Odi World Cup 2023: ప్రతి క్రీడలోనూ ఆనందం ఉండాలి.. అన్నింటికీ మించి ఆటగాళ్ల మధ్య పోరాట పటిమ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కనుకే మన దేశంలో క్రికెట్ అంటే జనం చాలా ఇష్టపడతారు. క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ కంటే మనదేశంలోనే ఎక్కువగా ఆ ఆటను చూస్తారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం.. అందులోనూ క్రికెట్ అంటే విపరీతమైన క్రేజ్ ఉన్నందువల్ల.. భారత క్రికెట్ క్రీడా సమాఖ్య మిగతా బోర్డుల కంటే సిరిమంతంగా వెలుగొందుతోంది. ప్రపంచ క్రికెట్ నే ఏలుతోంది. ప్రస్తుతం మన దేశం వేదికగా ప్రపంచకప్ జరుగుతోంది. ఆదివారం జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత్, తలపడుతున్నాయి. సాధారణంగా ఇటువంటి మెగా టోర్నీ అంటే చాలామంది క్రీడాభిమానులు ఆటను చూసేందుకు తరలి వస్తూ ఉంటారు. దీనివల్ల ఆ దేశానికి పర్యాటకపరంగా ఆదాయం సమకూరుతుంది. అయితే దీనినే తెలివిగా మన దేశం పర్యాటక అభివృద్ధి కోసం వాడుకుంది.
ఇద్దరు కెప్టెన్లతో ఫోటోషూట్
సాధారణంగా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ముందు రోజు ఇరు జట్లకు సంబంధించిన కెప్టెన్లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతుంటారు. తమ జట్టు కూర్పు గురించి విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు. అయితే దాని కంటే భిన్నంగా శనివారం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ తో నిన్న భారత ప్రభుత్వం ఫోటోషూట్ నిర్వహించింది. అయితే చాలామందికి ఇది ఫోటోషూట్ లాగానే కనిపించింది. మీడియాకు, సోషల్ మీడియాకు భారత ప్రభుత్వం విడుదల చేసిన ఫోటోల్లో ఒక బావి కనిపించింది. చాలామంది దానిని ఒక పురాతన బావి అనుకున్నారు. దాని గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తే మాత్రం చాలా విలువైన సమాచారం తెలిసింది. 2014 కు ముందు విదేశీ ప్రముఖులకు భారత్ అంటే తాజ్ మహల్ మాత్రమే. అయితే ఈ పద్ధతిని మార్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారు. భారతదేశంలో మరుగునపడిన ప్రఖ్యాతమైన పర్యాటక ప్రాంతాలను ప్రపంచ వేదికల మీద పరిచయం చేసుకుంటూ వస్తున్నారు.. ఇక తాజాగా ఆస్ట్రేలియా, భారత జట్ల కెప్టెన్ల ఫోటోషూట్ లో కనిపించిన ఆ బావి కూడా అలాంటిదే. ఇంతకీ ఆ బావి చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పటాన్ జిల్లాలో..
ఇరు జట్ల కెప్టెన్లు ఫోటోషూట్ నిర్వహించిన ప్రాంతం గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ జిల్లాలో ఉంది.. ఆ బావి పేరు “రాణి కి వావ్”. ఇది ఒక రకంగా చెప్పాలంటే దిగుడు బావి. భూమి లోపల ఏడు అంతస్తుల మెట్లతో ఉంటుంది. దీనిని చాళుక్య రాజవంశం పాలనలో నిర్మించారు. సరస్వతి నది ఒడ్డున ఈ కట్టడం ఉంది. 1304 లో జైన సన్యాసి మేరు తుంగతో స్వరపరిచిన ప్రబంధ చింతామణిలో ఈ బావి గురించి ప్రముఖంగా పేర్కొన్నారు. ” నర వరాహ ఖేంగార కుమార్తె ఉదయమతి, సహస్ర లింగ తటాకం” కంటే గొప్ప వైభవంగా శ్రీ పట్టణ ( పటాన్) వద్ద ఈ నవల మెట్ల బావి పనులను 1063 లో ప్రారంభించారు. ఆ తర్వాత 20 సంవత్సరాలకి ఇది పూర్తయింది. దీనిని భీమరాజు జ్ఞాపకార్థం అతడి భార్య ఉదయమతి నిర్మించింది. ఈ మెట్ల బావి తర్వాత కాలంలో సరస్వతి నదికి వచ్చిన వరదల కారణంగా పూర్తిగా మట్టి, బురదతో కూరుకుపోయింది. 1890లో బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్తలు హెన్రీ కౌసెన్స్, జేమ్స్ బర్గెస్ దీనిని చూసి ఆశ్చర్యపోయారు. బురదలో వారికి కొన్ని స్తంభాలు కనిపించాయి. మొదట్లో దీనిని వారు ఒక గొయ్యిగా మాత్రమే అభివర్ణించారు. దాదాపు ఆ బావిలోతు 285 అడుగులు ఉంటుందని నిర్ధారించారు.. కొంత కాలానికి అంటే 1940లో అప్పటి బరోడా స్టేట్ జరిపిన తవ్వకాల్లో ఈ మెట్ల బావిని గుర్తించారు.. చివరగా 1981లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా 1981 నుంచి 1987 వరకు తవ్వకాలు, పునరుద్ధరణ కార్యక్రమం జరిగింది. ఈ తవ్వకాలలో రాణి ఉదయమతి చిత్రం కూడా లభించింది. ఇది జూన్ 22, 2014లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరింది.
ఈ బావి విశేషాలు ఏంటంటే
ఈ బావి నిర్మాణ ఆలోచనే ఒక అద్భుతం. ప్రస్తుతం భూమి మీద ఉన్న ఆలయాలను తిరగేసి “వీ” ఆకారంలో నిర్మిస్తే ఎలా ఉంటుందో.. భూమి లోపల ఏడు అంతస్తుల్లో దీన్ని అలా నిర్మించారు. దీనిని 92 అడుగుల లోతు, పైన 213 అడుగుల పొడవు, 26 అడుగుల వెడల్పుతో నిర్మించారు. పూర్తి దిగువన బావిని తవ్వారు. బావి ప్రతి అంతస్తులను భారీ స్తంభాలు ఆధారంగా మండపాలు నిర్మించారు. వీటిలో స్తంభాలు, గోడలు పైకప్పులు పూర్తిగా చెక్కిన శిల్పాలతో నింపేశారు. ఇలాంటి స్తంభాలు ఈ బావిలో 212 దాకా ఉన్నాయి. ఈ శిల్పాలలో బ్రహ్మ, విష్ణువు, శివుడు, గణేశుడు, కుభేరుడు, లకులీశ, భైరవుడు, సూర్యుడు, ఇంద్రుడు, హయగ్రీవుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, చాముండా, క్షేమంకరి.. ఇంకా చాలా దేవి, దేవతల శిల్పాలు ఉన్నాయి. విష్ణువుకు సంబంధం ఉన్న శిల్పాలు ఎక్కువగా ఇందులో కనిపిస్తుంటాయి. ప్రపంచ వారసత్వ జాబితాలో ఈ బావి స్థానం సంపాదించింది కాబట్టి.. దానికి ప్రాముఖ్యం కల్పించేందుకే ఇరుజట్ల కెప్టెన్లతో భారత ప్రభుత్వం ఫోటోషూట్ తో పాటు దాని చారిత్రాత్మక ఐతిహ్యం గురించి వివరించింది. ఇక నిన్నటి నుంచి ఈ బావి గురించి గూగుల్ లో విదేశీ పర్యాటకుల శోధన మొదలైంది. ప్రస్తుతం ఈ బావి సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు గతానికంటే భిన్నంగా ఒక బావి గురించి ఈ స్థాయిలో ప్రచారం చేయడం ఆసక్తి కలిగిస్తోంది.