IPL History : ఐపీఎల్ చరిత్రలో ఆటగాళ్లను వదులుకోని ఫ్రాంచైజీలు ఇవే.. కారణం ఏంటంటే?

ఐపీఎల్ ప్రారంభమైన సంవత్సరం నాటి నుంచి ఇవాల్టి వరకు వారిని జట్టులోనే కొనసాగించాయి. అయితే ఇంతలో కొంతమంది ఆటగాళ్లు క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ.. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వారి సేవలను వినియోగించుకుంటున్నాయి. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లతో పాటు వెస్టిండీస్ ఆటగాడు ఉండడం విశేషం.

Written By: Anabothula Bhaskar, Updated On : October 4, 2024 10:15 pm

IPL History

Follow us on

IPL History : ఐపీఎల్ అంటేనే క్రికెట్ రిచ్ లీగ్.. డబ్బులతో ముడి పడి ఉన్న ఈ ఆటలో ప్రతిభకు మాత్రమే అవకాశం లభిస్తుంది. బాగా ఆడే ఆటగాళ్లకు మాత్రమే చోటు ఉంటుంది. కొంతమంది ఆటగాళ్ల విషయంలో ఆటతో సంబంధం లేకుండా ఫ్రాంచైజీ జట్లు వ్యవహరించాయి. వారు జట్టులో ఉండడమే మహాభాగ్యం అన్నట్టుగా వ్యవహరించాయి. ఐపీఎల్ ప్రారంభమైన సంవత్సరం నాటి నుంచి ఇవాల్టి వరకు వారిని జట్టులోనే కొనసాగించాయి. అయితే ఇంతలో కొంతమంది ఆటగాళ్లు క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ.. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వారి సేవలను వినియోగించుకుంటున్నాయి. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లతో పాటు వెస్టిండీస్ ఆటగాడు ఉండడం విశేషం..

సచిన్ టెండుల్కర్ – ముంబై

ముంబై జట్టుకు సచిన్ టెండూల్కర్ కు విడదీయరాని అనుబంధం ఉంది. ఒక సీజన్ లో తన కొడుకు అర్జున్తో కలిసి సచిన్ ఆడాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఈ ఘనత అందుకున్న తొలి ఆటగాడు సచినే కావచ్చు. సచిన్ ముంబై జట్టు తరఫున చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై జట్టు విజేతగా నిలిచినప్పుడు ఎగిరి గంతేశాడు. ఐపీఎల్ కు వీడ్కోలు పలికే సమయం వరకు సచిన్ ముంబై జట్టుతోనే కొనసాగాడు. తనకు వయసు పైబడినప్పటికీ కుర్రాళ్ళతో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటికీ ముంబై జట్టుకు సచిన్ పరోక్షంగా సలహాలు అందిస్తూనే ఉన్నాడు.

మహేంద్ర సింగ్ ధోని – చెన్నై

ఐపీఎల్ లో చెన్నై జట్టును అత్యంత విజయవంతమైన టీం గా రూపొందించడంలో ధోని కృషి అపారమైనది. ఇటీవల సీజన్లో రుతు రాజ్ గైక్వాడ్ కు అవకాశం కల్పించినప్పటికీ.. గత ఏడాది సీజన్లో చెన్నై జట్టును విజేతగా నిలపడంలో ధోని అద్భుతమైన కృషి చేశాడు. చెన్నై జట్టుకు ఏకంగా 5 టైటిల్స్ అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం అన్ క్యాప్డ్ ప్లేయర్ గా కొనసాగించాలని చెన్నై జట్టు నిర్ణయం తీసుకుందంటే.. ధోనిపై ఆ యాజమాన్యానికి ఎంతటి అనుబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు.

సునీల్ నరీన్ – కోల్ కతా

కోల్ కతా జట్టులో ఎంతమంది ఆటగాళ్లు మారినప్పటికీ.. సునీల్ నరైన్ మాత్రం మారడు. ఎందుకంటే ఆ జట్టు యాజమాన్యంతో అతడికి ఉన్న అనుబంధం అటువంటిది. కోల్ కతా జట్టు లో ప్రారంభం నుంచి అతడు కొనసాగుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలలో అతడు రాణిస్తున్నాడు. అందువల్లే అతన్ని వదులుకోవడానికి కోల్ కతా జట్టు యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. ఇటీవలి ఐపిఎల్ సీజన్లో కోల్ కతా ట్రోఫీ దక్కించుకోవడంలో సునీల్ నరైన్ కీలకపాత్ర పోషించాడు.

రిషబ్ పంత్ – ఢిల్లీ

ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు ఇంతవరకు ట్రోఫీ దక్కించుకోలేదు. అయినప్పటికీ ఆ జట్టి యాజమాన్యం రిషబ్ పంత్ విషయంలో సంపూర్ణమైన నమ్మకం ఉంచుతోంది. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఢిల్లీ యాజమాన్యం.. ఇటీవలి ఐపిఎల్ లో జట్టు పగ్గాలు అతడికే ఇచ్చింది. ఆటగాళ్ల ఆట తీరు ఎలా ఉన్నప్పటికీ.. జట్టును రిషబ్ పంత్ అద్భుతంగా నడిపించాడు. జట్టు ఆటగాళ్లలో క్రీడా స్ఫూర్తిని నింపాడు.

విరాట్ కోహ్లీ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

ఐపీఎల్ ప్రారంభమైన సంవత్సరం నాటి నుంచి ఇప్పటివరకు విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుతోనే ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు బెంగళూరు ఐపిఎల్ ట్రోఫీ దక్కించుకోకపోయినప్పటికీ.. విరాట్ కోహ్లీ ఆ జట్టుతోనే కొనసాగుతున్నాడు. ప్రారంభంలో నాయకత్వాన్ని వహించిన విరాట్.. తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. బెంగళూరు ఆటగాడిగా వీర లెవెల్ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పటికీ.. ఆ జట్టు ట్రోఫీ దక్కించుకోలేకపోవడం ఒకింత ఇబ్బందికరమే.

ప్రస్తుతం ఐపీఎల్ వేలానికి సంబంధించి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. పై ఆటగాళ్ళను ఆయా యాజమాన్యాలు వదులుకునే పరిస్థితి లేదు. అవసరమైతే వీరిని జట్టులో ఉంచడం కోసం మిగతా వారిపై వేటు వేసే అవకాశాలు లేకపోలేదు. ముందుగానే చెప్పినట్టు ఆట తీరుతో సంబంధం లేకుండా.. ఈ ఆటగాళ్లను జట్ల యాజమాన్యాలు కొనసాగిస్తున్నాయంటే.. దానికి ప్రధాన కారణం జెంటిల్మెన్ గేమ్ వారు ఆడటమే..