South Africa vs Afghanistan : టి20 వరల్డ్ కప్ లో సెమీస్ సమరానికి సర్వం సిద్ధమైంది. వరుస విజయాల దక్షిణాఫ్రికా, సంచలన ఆట తీరుకు నిలయమైన ఆఫ్ఘనిస్తాన్.. అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి..ట్రినిడాడ్ అండ్ టొబాగో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది.. అటు సౌత్ ఆఫ్రికా గ్రూప్-2 లో టేబుల్ టాపర్ గా నిలిచింది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ -1 లో రెండవ స్థానం ఆక్రమించింది..
సౌత్ ఆఫ్రికా t20 వరల్డ్ కప్ లో వరుస విజయాలతో సెమిస్ చేరుకుంది. బలమైన ఇంగ్లాండ్ జట్టును మట్టికరి పించింది.. వెస్టిండీస్ జట్టును ఓడించింది. అమెరికాపై గెలుపును సాధించి దర్జాగా సెమిస్ దాకా వచ్చింది. దక్షిణాఫ్రికా జట్టు 2014లో సెమీ ఫైనల్ దాకా వచ్చింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆ జట్టు ప్రస్తుతం మళ్లీ సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. క్వింటన్ డికాక్, మార్క్రం, హెండ్రిక్స్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్ వంటి వారితో బ్యాటింగ్ లైనప్ భయంకరంగా కనిపిస్తోంది. బార్ట్ మన్, రబాడా, కోయెట్జీ, నోర్ట్జీ, కేశవ్ మహరాజ్ వంటి వారితో బౌలింగ్ దళం అత్యంత బలంగా కనిపిస్తోంది. సౌత్ ఆఫ్రికా ఒక్క నేపాల్ జట్టుపై మినహా మిగతా అన్ని మ్యాచ్లలో దాదాపు సమష్టి ప్రదర్శన చేసింది. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు బౌలర్లు చూపించిన ప్రదర్శన అనన్య సామాన్యం.. అయితే ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో సంచలన విజయాల సాధించి సెమీస్ చేరుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టును దక్షిణాఫ్రికా తక్కువ అంచనా వేయడం లేదు. పైగా పటిష్టమైన ప్రణాళికతో బరిలోకి దిగుతోంది.
ఇక ఈ టోర్నీలో అద్భుతమైన విజయాలు సాధించి సెమీస్ దాకా వచ్చింది ఆఫ్గానిస్తాన్. గుర్బాజ్, జద్రాన్, జజాయ్ వంటి వారు బ్యాటింగ్లో కీలకంగా ఉన్నారు. అయితే ఆఫ్గనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్, అజ్మతుల్లా, నాయబ్, నబీ, కరీం జనత్ ఆల్ రౌండర్లుగా ఉన్నారు. తమదైన రోజు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా వీరి సొంతం.. ఇక బౌలర్లలో నవీన్ ఉల్ హక్, ఫారూఖీ తిరుగులేని ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఫారూఖీ లీడింగ్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రావో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు శిక్షణ ఇస్తున్నాడు. అతని ఆధ్వర్యంలో వారు అద్భుతమైన నైపుణ్యాన్ని సాధించారు. సౌత్ ఆఫ్రికా తో ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ నాలుగుసార్లు తలపడగా.. అన్నిసార్లు ఓటమి పాలయింది.
ట్రాక్ రికార్డు ప్రకారం సౌత్ ఆఫ్రికా ది పై చేయి లాగా కనిపిస్తున్నప్పటికీ.. సూపర్ -8 లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, లీగ్ దశలో న్యూజిలాండ్ వంటి జట్లను మట్టికరిపించి సెమీస్ దాకా వచ్చింది ఆఫ్గానిస్థాన్. సంచలన ఆట తీరుకు నిదర్శనంగా నిలిచింది.. అటు దక్షిణాఫ్రికా కూడా అత్యంత బలంగా కనిపిస్తోంది.. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయమని తెలుస్తోంది. గురువారం నాటి మ్యాచ్లో ఈ రెండు జట్లలో ఈ జట్టు గెలిచినా చరిత్రే. ఎందుకంటే ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఫైనల్ చేరలేదు.