Team India : 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. వెస్టిండీస్ లోని బార్బడోస్ మైదానంలో హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపు ద్వారా రెండవసారి t20 వరల్డ్ కప్ దక్కించుకుంది. తద్వారా వెస్టిండీస్ , ఇంగ్లాండ్ జట్ల సరసన చేరింది.. వాస్తవానికి గత వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈసారి ఆ పరాజయాన్ని టి20 వరల్డ్ కప్ ఫైనల్లో పునరావృతం చేయకూడదన్నట్టుగా.. కసి కొద్దీ ఆడింది. ముఖ్యంగా చివరి 3 ఓవర్లు భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో విజయానికి ఏడు పరుగుల దూరంలో దక్షిణాఫ్రికా నిలిచింది.. ఒకానొక దశలో క్లాసెన్ విజృంభించి ఆడటంతో దక్షిణాఫ్రికా గెలిచేలాగా కనిపించింది. కానీ హార్దిక్ పాండ్యా ఒక అద్భుతమైన స్లో డెలివరీతో క్లాసెన్ ను బోల్తా కొట్టించాడు. సుదీర్ఘ విరామం తర్వాత టి20 వరల్డ్ కప్ గెలవడంతో భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో.. పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టి20 ఫార్మాట్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు. అయితే రోహిత్ శర్మ స్థానంలో ఎవరిని నియమిస్తారనేది ఇంతవరకు బిసిసిఐ ప్రకటించలేదు. త్వరలో గిల్ ఆధ్వర్యంలో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్తుంది. అక్కడ 5 t20 మ్యాచ్ లు ఆడుతుంది. ఈ పర్యటన టి20 వరల్డ్ కప్ కంటే ముందే ఖరారయింది. కొద్దిరోజులుగా తీరికలేని ఆట ఆడుతున్న సీనియర్లకు మేనేజ్మెంట్ జింబాబ్వే టోర్నీకి విశ్రాంతి ఇచ్చింది.
ఇదే సమయంలో టీమిండియా కోచ్ పదవి కాలం ముగియడంతో.. రాహుల్ ద్రావిడ్ ఆ పదవి నుంచి తప్పుకోనున్నాడు. అయితే కోచ్ పదవి కోసం సీనియర్ ఆటగాడు గౌతమ్ గంభీర్, భారత జట్టు మహిళల మాజీ కోచ్ డబ్ల్యూ సీ రామన్ ను బిసిసిఐ నియమించిన కమిటీ ఇంటర్వ్యూ చేసింది. గౌతమ్ గంభీర్ ఎంపిక లాంచనమే అని తెలుస్తోంది.. అయితే ఇంతవరకు బీసీసీఐ గౌతమ్ గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించలేదు.. జింబాబ్వే పర్యటన తర్వాత టీమిండియా శ్రీలంకలో టూర్ కు వెళ్తుంది. అయితే శ్రీలంక టూర్ నాటికి టీమిండియాకు కొత్త కోచ్ వస్తాడని బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించాడు. ” టి20 వరల్డ్ కప్ ను భారత్ దక్కించుకుంది. ఈ గెలుపులో అందరి పాత్ర ఉంది. కోచ్ ద్రావిడ్ ఆధ్వర్యంలో టీమిండియా మరింత రాటు తేలింది. అతడి పదవి కాలం ముగిసిన నేపథ్యంలో.. త్వరలో టీమ్ ఇండియాకు కొత్త కోచ్ వస్తాడు. కొత్త కోచ్ ఆధ్వర్యంలోనే టీమ్ ఇండియా శ్రీలంకలో పర్యటిస్తుందని” జై షా వ్యాఖ్యానించాడు.
మరోవైపు కొత్త కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నకు ఇంతవరకు బీసీసీఐ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. సీనియర్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం గిల్ వైపు మొగ్గు చూపుతున్నాడు. ” హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వద్దు. బుమ్రాను కూడా పరిగణలోకి తీసుకోవద్దు. గిల్ దురదృష్టవశాత్తు టి20 వరల్డ్ కప్ లో స్థానం కోల్పోయాడు. కానీ అంతకు ముందు జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అద్భుతంగా ఆడాడు. పరుగుల వరద పారించాడు.. పైగా యువకుడు, అతడికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది.. ధీటుగా ఆడే నేర్పు ఉందని” సెహ్వాగ్ పేర్కొన్నాడు. గతంలో రోహిత్ శర్మ గైర్హాజరైనప్పుడు హార్దిక్ పాండ్యా టీమిండియా కు నాయకత్వం వహించాడు. అటు రోహిత్, ఇటు హార్దిక్ అందుబాటులో లేనప్పుడు బుమ్రా జట్టును నడిపించాడు. జాతీయ మీడియా కథనాల ప్రకారం హార్దిక్ లేదా బుమ్రా కు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వచ్చని తెలుస్తోంది. అయితే బీసీసీఐలో కొంతమంది మాత్రం గిల్ వైపు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని సమాచారం. అయితే కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై జింబాబ్వే టూర్ తర్వాత స్పష్టత వస్తుందని తెలుస్తోంది. జింబాబ్వే టూర్లో గిల్ తన ప్రతిభను చూపించుకుంటే.. కెప్టెన్సీ దక్కే అవకాశాన్ని కొట్టిపారేయలేమని క్రీడా విశేషకులు అంటున్నారు. టి20 ఫార్మాట్ కు మాత్రమే రోహిత్ వీడ్కోలు పలికిన నేపథ్యంలో.. టెస్ట్, వన్డేలకు అతడే సారథ్యం వహించే అవకాశం ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ వరకు రోహిత్ నాయకత్వం వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ జరుగుతుంది. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వచ్చే ఏడాది జరుగుతుంది. ఆ రెండు ట్రోఫీలకు నాయకత్వం వహించి.. టీమిండియా కు ఆ రెండు కప్ లు అందించి.. అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పే యోచనలో రోహిత్ ఉన్నట్టు తెలుస్తోంది.