https://oktelugu.com/

Rohit Sharma : నేను కెప్టెన్ గా ఉన్నంతవరకు.. దానికి అవకాశం లేదు.. సంచలన ప్రకటన చేసిన రోహిత్ శర్మ

టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. ఈ క్రమంలో ఓటమికి దారి తీసిన పరిస్థితులను వెల్లడించాడు.. స్లో పిచ్, స్పిన్ బౌలింగ్, బ్యాటర్లలో సమన్వయం లేకపోవడం వంటివి ఓటమికి కారణమయ్యాయని రోహిత్ వ్యాఖ్యానించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 8, 2024 / 12:47 PM IST
    Follow us on

    Rohit Sharma : టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో మట్టికరిపించింది. అదే జోరులో యువభారత్ జట్టు జింబాబ్వేలో పర్యటించింది. ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ ను 4-1 తేడాతో దక్కించుకుంది. అనంతరం శ్రీలంక లో పర్యటించింది. సూర్య కుమార్ యాదవ్ సారధ్యంలో 3 t20 మ్యాచ్ల సీరీస్ ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. అయితే ఇదే జోరును టీమిండియా రోహిత్ నాయకత్వంలో చూపిస్తుందని.. వన్డే సిరీస్ అదరగొడుతుందని అభిమానులు ఆశించారు. పైగా జట్టుకూర్పులో కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన మార్క్ చూపించాడు. దీంతో వన్డే సిరీస్ లో కూడా టీమిండియా కు గెలుపు నల్లేరు మీద నడకని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది వేరు.. తొలి వన్డే టీమిండియా బ్యాటర్ల నిర్లక్ష్యం వల్ల టై అయింది. రెండవ వన్డే మిడిల్ ఆర్డర్ వైఫల్యం వల్ల ఓడిపోవాల్సి వచ్చింది. మూడో వన్డేలో ఆటగాళ్ల నిర్లక్ష్యం వల్ల సిరీస్ కోల్పోవలసి వచ్చింది.. దీంతో టీమిండియా ఆటగాళ్లపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జట్టుకూర్పు సరిగ్గా లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జట్టు సిరీస్ కోల్పోవడం పట్ల కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.

    టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. ఈ క్రమంలో ఓటమికి దారి తీసిన పరిస్థితులను వెల్లడించాడు.. స్లో పిచ్, స్పిన్ బౌలింగ్, బ్యాటర్లలో సమన్వయం లేకపోవడం వంటివి ఓటమికి కారణమయ్యాయని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఇదే సమయంలో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత్ ఆత్మ సంతృప్తి చెందిందా? అని విలేకరులు ప్రశ్నించగా.. దానికి రోహిత్ స్పందించాడు..” భారత్ తరఫున ఆడుతున్నప్పుడు అలాంటి మాటకు తావులేదు. నేను నాయకత్వం వహిస్తున్నంతవరకు అలాంటి దానికి అవకాశం ఇవ్వను. దేశం కోసం ఆడడాన్ని నేను గొప్పగా భావిస్తా. దేశం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాను. అలాంటప్పుడు ఓటమి అనే పదానికి తావులేదు. సంతృప్తి అనే మాటకు అర్థం లేదు. వన్డే, టి20 లలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం. టెస్టులలో రెండవ స్థానానికి వచ్చాం. మొదటి స్థానానికి వచ్చిన తర్వాత సంతృప్తి చెందితే అక్కడితోనే ఆగిపోవలసి ఉంటుంది. ఆ తర్వాత మన స్థానాన్ని ఇంకొకరు భర్తీ చేస్తారు. అలాంటి అవకాశం ఇస్తే మనం విఫలమైనట్టు లెక్క. అందుకే అలాంటి వాటికి నేను చోటు ఇవ్వను. శ్రీలంక మాకంటే మెరుగ్గా ఆడింది. స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో మా బ్యాటర్లు విఫలమయ్యారు. మాలో లోపాలను సమీక్షించుకుంటాం. కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా మళ్లీ విజృంభిస్తాం. ఈ సిరీస్ మీకు కోల్పోయినంత మాత్రాన ప్రపంచం అంత మైనట్టు కాదు. దీని తర్వాత ఎలా మేము పుంజు కోవాలి అనే విషయంపై ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకుంటామని” రోహిత్ వ్యాఖ్యానించాడు.

    అయితే తొలి వన్డేలో 14 బంతులకు ఒక్క పరుగు చేయాల్సిన సమయంలో.. టీమిండియా ఆటగాడు అర్ష్ దీప్ సింగ్ అనవసరమైన షాట్ కు యత్నించి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో తొలి వన్డే టై అయింది. ఆ తర్వాత రెండో వన్డేలో శ్రీలంక నిర్దేశించిన స్వల్ప స్కోర్ చేజ్ చేసే క్రమంలో టీమిడియా మిడిల్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఫలితంగా ఆ మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ఇక మూడో వన్డేలో శ్రీలంక స్పిన్ బౌలింగ్ ను తట్టుకోలేక టీమిండియా టాప్ ఆర్డర్ తడబడింది. ఫలితంగా ఈ మ్యాచ్ లోనూ ఓటమి ఎదురయింది. దీంతో 2-0 తేడాతో శ్రీలంక సిరీస్ దక్కించుకుంది. టి20 సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో భారత్ పై ప్రతీకారం తీర్చుకుంది.