Homeక్రీడలుWest Indies: వెస్టిండీస్ క్రికెట్ నాశనానికి అదే కారణం..!

West Indies: వెస్టిండీస్ క్రికెట్ నాశనానికి అదే కారణం..!

West Indies: ప్రపంచ క్రికెట్ లో వెస్టిండీస్ జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. రెండుసార్లు వరల్డ్ కప్ గెలిచి ఛాంపియన్ గా నిలిచిన ఈ జట్టు కొన్నాళ్లపాటు క్రికెట్ ప్రపంచాన్ని అప్రతిహతంగా ఏలింది. అటువంటి జట్టు ప్రస్తుతం అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్పుకు అర్హత సాధించలేకపోయింది. అనామక జట్లపై క్వాలిఫైయర్ మ్యాచ్ ల్లో ఓడిపోయి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. వెస్టిండీస్ ప్రస్తుత పరిస్థితికి రాజకీయాలే కారణం అంటూ భారత జట్టు డాషింగ్ ఓపెనర్, రిటైర్డ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించాడు. సెహ్వాగ్ చెప్పినట్లు నిజంగానే వెస్టిండీస్ క్రికెట్ ను రాజకీయాలే సర్వనాశనం చేశాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

వరల్డ్ కప్ కు క్వాలిఫై కాలేకపోయిన వెస్టిండీస్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వెస్టిండిస్ జట్టు ఆటగాళ్లు దేశం కంటే లీగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోందని, డబ్బుకే వెస్టిండీస్ ఆటగాళ్లు ప్రియారిటీ ఇవ్వడంతో ఆ దేశ క్రికెట్ పూర్తిగా నాశనం అయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఒకప్పుడు లెజెండ్స్ తో అలారారేది. ఆ జట్టు ఆటగాళ్లు అంతా దేశానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. దేశం తరువాతే లీగులకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. కానీ, ప్రస్తుతం వెస్టిండీస్ జట్టులో ఆడుతున్న మెజారిటీ ఆటగాళ్లు దేశం కంటే లీగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. క్వాలిఫైయర్ మ్యాచ్లను కూడా చాలామంది సీనియర్ ఆటగాళ్లు ఆడలేదు. ఇది కూడా క్వాలిఫైయర్ మ్యాచుల్లో ఓటమికి కారణమైంది. ఈ నేపథ్యంలో జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

వెస్టిండీస్ జట్టును నాశనం చేసిన రాజకీయాలు..

ఏ జట్టునైనా రాజకీయాలే నాశనం చేస్తుంటాయి. రాజకీయాలు చేసి ప్రతిభను అనగదొక్కే ప్రయత్నం చేసినప్పుడు వెస్టిండీస్ జట్టు మాదిరిగానే ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వెస్టిండీస్ జట్టు పరిస్థితికి రాజకీయాలే కారణమన్న విమర్శ వస్తోంది. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ‘వెస్టిండీస్ జట్టు వన్డే ప్రపంచ కప్ కు అర్హత సాధించలేకపోవడం సిగ్గుచేటు. టాలెంట్ ఉంటే సరిపోదు. రాజకీయాలకు అతీతంగా ఒక జట్టును నడిపించాలనడానికి విండీస్ జట్టు మంచి ఉదాహరణ. రాజకీయాలే ఆ జట్టును దెబ్బతీశాయి. ఇంతకుమించి పడిపోవటానికి వెస్టిండీస్ జట్టుకు ఇంకేమీ మిగల్లేదు’ అని సెహ్వాగ్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. జట్టులో రాజకీయాలు పెరిగిపోయినప్పుడు ఈ తరహా పతనం ఖాయమని, ఏ జట్టు అయిన రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రతిభను ప్రోత్సహించినప్పుడు అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని సెహ్వాగ్ వెల్లడించాడు.
సెహ్వాగ్ చెప్పినట్లు వెస్టిండీస్ జట్టు ఆటగాళ్లలో ఐక్యత లేదు. వ్యక్తిగత ప్రదర్శనలు, రికార్డులకు ప్రదర్శనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆటగాళ్ల మధ్య సఖ్యత కూడా పెద్దగా ఉండదు. జట్టులోని సమస్యలను పరిష్కరించేందుకు జట్టు యాజమాన్యం ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఫలితంగానే ప్రస్తుతం ఎదుర్కొన్న స్థితి దాపురించిందని పలువురు పేర్కొంటున్నారు.

వెస్టిండీస్ జట్టు పుంజుకుంటుందంటున్న మాజీ క్రికెటర్లు..

ఇక వెస్టిండీస్ జట్టు వరల్డ్ కప్ కు క్వాలిఫై కానంత మాత్రాన ఆ జట్టు పరిస్థితి అయిపోయిందన్న విమర్శలను పలువురు మాజీ క్రికెటర్లు కొట్టి పారేస్తున్నారు. వెస్టిండీస్ జట్టు నేలకు కొట్టిన బంతిలా తిరిగి పుంజుకుంటుందని భారత జట్టు మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, మదన్ లాల్ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచ కప్ కు వెస్టిండీస్ జట్టు అర్హత సాధించకపోవడం బాధగా ఉంది. అయితే, ఆ జట్టు అంటే తనకు ఆసక్తి ఉంది. దేశానికి ఆడడాన్ని గర్వకారణంగా జట్టు ఆటగాళ్లు భావించడం లేదని’ 1982 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు సభ్యుడు మదన్ లాల్ విమర్శించాడు. వెస్టిండీస్ బలంగా పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని గంభీర్ వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ జట్టు అంటే తనకు ఇష్టమని చెప్పిన గంభీర్.. ప్రపంచ క్రికెట్లో నెంబర్ వన్ జట్టుగా నిలిచే సత్తా వారికి ఉందని ఇప్పటికీ నమ్ముతున్నట్లు గంభీర్ స్పష్టం చేశాడు. వెస్టిండీస్ పతనానికి ఆర్థిక సంక్షోభం కూడా ఓ కారణమని ఆ జట్టు దిగ్గజ క్రికెటర్ బిషప్ అన్నాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు క్రికెట్లోకి రాకముందే ఈ పతనం ప్రారంభమైనట్లు వివరించాడు. నెమ్మదిగా జరిగిన పతనమిదని, ప్రస్తుత జట్టు క్రికెట్ మొదలు పెట్టక ముందే వెస్టిండీస్ పతనం మొదలైందని వివరించాడు. దాదాపు పదేళ్లుగా తమ జట్టు వన్డేల్లో అగ్ర జట్లపై సరైన ప్రదర్శన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. టి20లో మాత్రమే రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్లు అయ్యామని, ఆ తర్వాత ఇంకా మెరుపులేమీ లేవని, దీంతో పతనం వేగంగా సాగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుత విండీస్ జట్టుకు మంచి ప్రదర్శన చేసే సత్తా ఉందని నమ్ముతున్నానని, కెప్టెన్, కోచులు మారారని, వారికి కుదురుకునే సమయం ఇవ్వాలని వెల్లడించాడు. తక్కువ వనరులతోనే జింబాబ్వే అదరగొడుతుంటే వెస్టిండీస్ ఎందుకు మెరుగు కాకూడదని బిషప్ ప్రశ్నించాడు. ఏది ఏమైనా వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా జట్టు ఆటగాళ్లు సమిష్టి ప్రదర్శనతో ముందుకు వెళితే బలమైన జట్టుగా ఆవిర్భవించేందుకు అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES

Most Popular