Daughter brutally kills her father in Madanapalle
Daughter kills Father: ప్రేమ వివాహాల మాటున పరువు హత్యలు చూస్తుంటాం. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని కుమార్తెను, తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని పిల్లలపై దాడులు చేయడం చూస్తుంటాం. కానీ ఆ యువతి మాత్రం సంబంధం చూసి పెళ్లి చేస్తానన్న పాపానికి తండ్రిని దారుణంగా హత్య చేసింది. తన సరదా జీవితానికి అడ్డు వస్తున్నాడని చెప్పి జన్మనిచ్చిన వాడిపై దాడి చేసి మట్టు పెట్టింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది ఈ ఘటన.
మదనపల్లె కాలనీకి చెందిన దొరస్వామి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. దిగువ కురవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య లత, కుమార్తె హరిత ఉన్నారు. ఏడాదిన్నర కిందట భార్య లలిత అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటినుంచి కూతురు హరిత తో కలిసి దొరస్వామి నివాసం ఉంటున్నారు. బీఎస్సీ బీఈడీ చదివిన హరితకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని భావించాడు. తల్లి మృతి చెందడంతో కుమార్తెను గారాబంగా పెంచాడు.తల్లికి చెందిన నగలను ఆమెకే ఇచ్చాడు. ఆమె పెళ్లికి ఉంచిన నగదును ఆమె బ్యాంక్ అకౌంట్లో వేశాడు.
అయితే హరిత మదనపల్లి కు చెందిన రమేష్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటుంది. అతనికి తన బంగారు నగలను ఇచ్చినట్లు తెలుస్తోంది. అతను వాటిని తాకట్టు పెట్టి రూ.11.40 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. సాయి కృష్ణ అనే మరో యువకుడికి ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరే కాకుండా హరీష్ రెడ్డితోనూ సన్నిహితంగా ఉంటుంది. విషయం తెలుసుకున్న దొరస్వామి కుమార్తెను మందలించాడు. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని భావించాడు. దీంతో గత నెల రోజులుగా తండ్రి కుమార్తెల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 13న క్షణికావేశానికి గురైన హరిత చపాతీ కర్ర, పరీక్షలు రాసే అట్ట, తాళం కప్పతో విచక్షణారహితంగా దాడి చేసింది. దీంతో దొరస్వామి మృతి చెందాడు. ఇరుగు పొరుగు వారు వచ్చేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పోలీసులు తమదైన దర్యాప్తు చేయడంతో క్షణికావేశంలో తానే హత్య చేసినట్లు హరిత ఒప్పుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.