Ind Vs Aus Boxing Day Test: మెల్ బోర్న్ వేదికగా మొదలైన నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు ఆస్ట్రేలియా యువ ఆటగాడు కోన్ స్టాస్ భుజాన్ని గట్టిగా కావాలని తాకాడు. అలా భుజాన్ని రాసుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. దీంతో కోన్ స్టాస్ తన నోటికి పని చెప్పాడు. విరాట్ కూడా తగ్గేది లేదు అన్నట్టుగా గట్టిగా రిప్లై ఇచ్చాడు. మధ్యలో ఉస్మాన్ ఖవాజా వచ్చి పరిస్థితిని సద్దుమణిగించాడు. కోన్ స్టాస్ ఈ మ్యాచ్ ద్వారానే ఆస్ట్రేలియా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడు ఓపెనర్ గా బరిలోకి దిగాడు. 65 బంతులను ఎదుర్కొని ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 60 పరుగులు చేశాడు. అయితే అతడు విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. 19 సంవత్సరాల ఈ యువ ఆటగాడిని విరాట్ కోహ్లీ ఎందుకు ప్రయత్నించాడు.. సామ్ కోన్ స్టాస్ భుజాన్ని విరాట్ కోహ్లీ కావాలని గుద్దుకున్నాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో 10 ఓవర్ పూర్తయిన తర్వాత చోటుచేసుకుంది. 10 ఓవర్ పూర్తయిన తర్వాత విరాట్ కోహ్లీ కావాలని కోన్ స్టాస్ కు డ్యాష్ ఇచ్చినట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది.. కోహ్లీ అలా కవ్వించిన తర్వాత కోన్ స్టాస్ ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు. బుమ్రా వేసిన 11 ఓవర్లో ఏకంగా 18 పరుగులు సాధించాడు. 4,0,2,6,4,2 కొట్టి తన సత్తా చాటాడు.. అయితే కోన్ స్టాస్ పై విరాట్ వ్యవహరించిన తీరు పట్ల విమర్శలు వినిపించాయి. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ విరాట్ తీరును తప్ప పట్టారు. విరాట్ కావాలని చేసినట్టుగా అనిపించిందని.. అతనిపై చర్యలు తీసుకోవాలని మ్యాచ్ రిఫరీని ఆయన కోరారు.
మ్యాచ్ ఫీజులో కోత..
అంపైర్ల ఫిర్యాదుతో మ్యాచ్ రిఫరీ విచారణ చేపట్టాడు. అయితే మైదానంలో చూసిన దృశ్యాలు ఆధారంగా విరాట్ పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారని ప్రచారం జరిగింది.. అయితే విరాట్ చేసిన దానిని లెవెల్ వన్ నేరంగా పరిగణిస్తూ మ్యాచ్ ఫీజులో రిఫరీ 20% కోత విధించారు. ఒక డిమిరిట్ పాయింట్ కూడా కేటాయించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు 24 నెలల కాలంలో నాలుగు డి మెరిట్ పాయింట్లు కనక పొందితే ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచులలో ఆడకుండా నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే విరాట్ అకౌంట్లో ప్రస్తుతం ఒక్క డీ మెరిట్ పాయింట్ కూడా లేదు. అయితే 24 నెలల్లో విరాట్ కనక మరో డి మెరిట్ పాయింట్ పొందితే ఒక మ్యాచ్ లో ఆడకుండా నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ” కోహ్లీ లెవెల్ వన్ నేరానికి పాల్పడ్డారు. ప్రస్తుతానికి మ్యాచ్ ఫీజులో 20% కోతకు గురయ్యారు. ఒక డి మెరిట్ పాయింట్ కూడా పొందారు. ఇదే పరిస్థితి వచ్చే 24 నెలల్లో ఆయన కొనసాగిస్తే.. ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధానికి గురవుతారు. మైదానంలో చూసిన పరిస్థితుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని” మ్యాచ్ రిఫరీ వ్యాఖ్యానించారు. దీనికి అనుగుణంగానే ఐసీసీకి నివేదిక అందించానని ఆయన వివరించారు. ఐసీసీ నిబంధన ప్రకారమే కోహ్లీపై చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కోహ్లీపై జరిమానా విధించిన నేపథ్యంలో మ్యాచ్ రిఫరీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచారు