Virat Kohli : పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 7ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 73 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సాల్ట్ ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. వన్ డౌన్ ఆటగాడిగా వచ్చిన దేవదత్ పడిక్కల్ 35 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేశాడు.. విరాట్ కోహ్లీ, పడిక్కల్ రెండో వికెట్ కు 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ రజత్ పాటిదార్ 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. జితేష్ శర్మ 11 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 157 పరుగులు చేసింది. పంజాబ్ జట్టులో ప్రభ్ సిమ్రాన్ సింగ్ 33, శశాంక్ సింగ్ 31 , జోష్ ఇంగ్లిస్ 29, మార్కో జాన్సన్ 21 పరుగులు చేశారు. కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read : ఫీల్డర్ ఫోర్ వెళ్లకుండా బంతిని ఆపాడు.. తిక్క రేగిన కోహ్లీ ఏం చేశాడంటే..
విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు
ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా అతడు అరుదైన ఘనత అందుకున్నాడు. మొత్తం అతడు 252 ఇన్నింగ్స్ లలో 67 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ పేరు మీద అత్యధికహాఫ్ సెంచరీలు చేసిన రికార్డు ఉండేది. పంజాబ్ జట్టు మీద హాఫ్ సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు కొట్టాడు. ఇక ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (66), శిఖర్ ధావన్ (53), రోహిత్ శర్మ (45) తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉండడంతో మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు. పంజాబ్ జట్టుపై ఇటీవల జరిగిన మ్యాచ్లో విఫలమైన అతడు.. ఇప్పుడు ముల్లన్ పూర్ లో జరిగిన మ్యాచ్లో మాత్రం శివతాండవం చేశాడు. మొత్తంగా బెంగళూరు జట్టును 7 వికెట్ల తేడాతో గెలిపించాడు. ” విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. సూపర్ ఇన్నింగ్స్ తో బెంగళూరు జట్టును గెలిపించాడు. తద్వారా తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. కోహ్లీ అంటే వీర విహారానికి పెట్టింది పేరు. పంజాబ్ జట్టుపై అద్భుతమైన ఇన్నించాడు మరోసారి తన పేరును సార్ధకం చేసుకున్నాడని” సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.