Virat Kohli: ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే వెస్టిండీస్ వరకు ఎంతోమంది భయంకరమైన బ్యాటర్లు ఉన్నారు. మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేయగలరు. జెర్సీ వేసుకున్నంత సులభంగా పరుగులు తీయగలరు. కానీ వారంతా విరాట్ కోహ్లీ ముందు దిగదుడుపే. చదువుతుంటే కొంచెం అతిగా అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం.
Also Read: భారత్ ఆడకపోతే పాకిస్తాన్ కే కాదు.. క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ కు కూడా ఇబ్బందే..
విరాట్ కోహ్లీ వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. ఈ వయసులోనూ అతడు మైదానంలో పాదరసం లాగా కదులుతున్నాడు. మెరుపు వేగంతో పరుగులు తీస్తున్నాడు. చిరుత వేగంతో బౌండరీలు కొడుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు సింహ స్వప్నం లాగా మిగులుతున్నాడు. అందువల్లే అతడు ఈ కాలంలోనూ పరుగుల యంత్రంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. మామూలుగా అయితే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆటగాళ్లు నెమ్మదిస్తారు. కానీ విరాట్ కోహ్లీ అలా కాదు. అలా అయితే అతడు విరాట్ కోహ్లీ కాదు. మైదానంలోకి వచ్చింది మొదలు పరుగుల దాహాన్ని మొదలుపెడతాడు. ప్రత్యర్థి బౌలర్ల పై చేయి సాధించడానికి సిద్ధమవుతాడు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై విరాట్ సెంచరీ చేశాడు. స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తున్న మైదానంపై సెంచరీ చేయడం అంటే మామూలు విషయం కాదు. పైగా పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ ను ఎదుర్కొని విరాట్ ఆ ఘనత అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియాలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అయితే ఏకంగా 80 కి పైగా పరుగులు చేశాడు. తీవ్ర ఒత్తిడి మధ్య సింగిల్స్ తీస్తూ.. ఆస్ట్రేలియా బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. సాధారణంగా విరాట్ లాంటి ఆటగాడు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం అంటే మామూలు విషయం కాదు.. ఆట మీద ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఇలాంటి ఇన్నింగ్స్ సాధ్యం కాదు.
నెట్టింట చర్చ
ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ మినహా.. మిగతా అన్నిట్లో విరాట్ సత్తా చాటాడు. ఇందులో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్లో ఒక పరుగు మాత్రమే చేసి విరాట్ అవుట్ అయ్యాడు. ఇక ప్రస్తుత ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కొనసాగుతున్నాడు. విరాట్ తన కెరియర్లో ఐదు ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు. అందులో మూడుసార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. ఐసీసీ ఈవెంట్స్ లో అత్యధిక పరుగులు.. ఐసీసీ ఈవెంట్స్ లో సెమీస్, ఫైనల్ మ్యాచ్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు.. రెండుసార్లు ఐసీసీ డికేడ్ అవార్డ్స్.. ఎన్నిసార్లు ఐసీసీ యాన్యువల్ అవార్డ్స్ విరాట్ సొంతం చేసుకున్నాడు. ఇన్ని అవార్డులు పొందాడు కాబట్టే విరాట్ కోహ్లీని మిస్టర్ ఐసీసీ అని.. అతడి అభిమానులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియా వేదికగా మిస్టర్ ఐసీసీ అనే యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే వేలాది ట్వీట్లు విరాట్ అభిమానులు చేశారు. తమ అభిమానంతో ట్విట్టర్ ను షేక్ చేస్తున్నారు.