Homeక్రీడలుVinesh phoghat : పారిస్ లో రాజకీయాలు జరిగాయి.. ఆమె ఆధ్వర్యంలో నా వెనుక గోతులు...

Vinesh phoghat : పారిస్ లో రాజకీయాలు జరిగాయి.. ఆమె ఆధ్వర్యంలో నా వెనుక గోతులు తవ్వారు.. వినేశ్ ఫొగాట్ సంచలన ఆరోపణలు

Vinesh phoghat :  100 గ్రాముల అధిక బరువును తగ్గించుకునేందుకు ఆమె అనేక ప్రయత్నాలు చేసింది. స్టీమ్ బాత్ చేసింది. రాత్రి మొత్తం జాగింగ్ చేసింది. ఆహారం కూడా మానేసింది. శరీరం నుంచి కొంతమేరకు రక్తాన్ని తొలగించుకుంది. జుట్టు కత్తిరించుకుంది. పొడవు పెరిగిన గోర్లను కూడా తొలగించుకుంది. అయినప్పటికీ ఆమె బరువు తగ్గలేదు. దీంతో బరువెక్కిన గుండెతో ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో భారత ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు పి.టి.ఉష వినేశ్ ను పరామర్శించారు. ఆస్పత్రిలో ఆమెను పలకరించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఫైనల్ పోటీలకు అర్హత సాధించలేకపోవడంతో వినేశ్ ఫొగాట్ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. తను ఇంకా పోటీ పడలేదని పేర్కొన్నారు. కుస్తీ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించారు. అప్పట్లో ఆమెకు దేశవ్యాప్తంగా సంఘీభావం లభించింది. ప్రముఖులు ఆమెకు మద్దతు పలికారు.. ఆ తర్వాత ఆమె ఆర్బిట్రేషన్ లో దావా వేశారు. కనీసం తనకు రజత పతకమైనా ఇవ్వాలని అందులో కోరారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఆ కేసును ఆర్బిట్రేషన్ కోర్టు కొట్టేసింది. దీంతో పతకం లేకుండానే వినేశ్ ఫొగాట్ ఖాళీ చేతులతో దేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఆమె ఇంటి వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అయితే అప్పట్లోనే జాతీయ మీడియాలో ఈ విషయంపై విశేషమైన కథనాలు ప్రసారమయ్యాయి. తనకు ఫైనల్ పోటీలలో ఆడే అవకాశ రాకపోయినప్పటికీ వినేశ్ ఫొగాట్ ఆ విషయం గురించి ఇంతవరకు స్పందించలేదు. అయితే ఇప్పుడు వినేశ్ ఫొగాట్ ఆ విషయంపై మాట్లాడింది. సంచలన విషయాలను వెల్లడించింది.

రాజకీయాలు జరిగాయి

పారిస్ వేదికగా వినేశ్ ఫొగాట్ ఫైనల్ పోటీలలో పాల్గొనకుండా రాజకీయాలు జరిగాయట. ఇదే విషయాన్ని వినేశ్ ఫొగాట్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ” నేను ఆరోజు ఆసుపత్రి బెడ్ పై పడుకొని ఉన్నాను. నన్ను పరామర్శించడానికి మేడం వచ్చారు. కానీ తలుపులు మూసి నాకు వ్యతిరేకంగా రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటికే నా గుండె ముక్కలైపోయింది. ఇక పోరాడే ఓపిక నాకు లేదు. నన్ను పరామర్శించే పేరుతో నా వెనుక గోతులు తవ్వారు. నేను కుస్తీ పోటీలకు వీడ్కోలు పలికితే.. ఎందుకు ఆ పని చేశారని చాలామంది అడిగారు. కానీ నాకు పోరాడే ఓపిక లేదు. పారిస్ వేదికగా నాకు ఎలాంటి మద్దతూ లభించలేదు. ప్రతి చోటా రాజకీయాలు ఉన్నాయి.. ఆ రాజకీయాలను తట్టుకునే శక్తి నాకు లేదు.. నాకు తెలియకుండానే పి.టి.ఉష వచ్చారు. నాకు సంబంధం లేకుండానే ఆ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేను ఆస్పత్రిలో మంచం మీద ఉన్నాను. బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు. అప్పుడు నేను ఉన్న పరిస్థితి నా జీవితంలోనే అత్యంత దుర్భరమైన దశ. నాకు తెలియకుండానే ఫోటో తీసి.. నాకు సంఘీభావంగా ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు.. అది కుస్తీ పోటీలలో నేను చేసే ప్రదర్శనలు కంటే రెట్టింపు ఉందని” వినేశ్ ఫొగాట్ వ్యాఖ్యానించింది. ప్రైవేట్ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది.

కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ

ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి వినేశ్ ఫొగాట్ పోటీ చేస్తున్నారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పి.టి.ఉషను ఉద్దేశించి వినేశ్ ఫొగాట్ ఈ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం.. తెగ ప్రచారం చేస్తోంది. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగం కూడా వినేశ్ ఫొగాట్ వ్యాఖ్యలకు ఘాటుగానే స్పందిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version