Homeక్రీడలుVinesh Phogat: తీవ్ర ఉత్కంఠ మధ్య మాతృ దేశానికి వినేశ్ ఫొగాట్.. ఆమె వెంట...

Vinesh Phogat: తీవ్ర ఉత్కంఠ మధ్య మాతృ దేశానికి వినేశ్ ఫొగాట్.. ఆమె వెంట కాంగ్రెస్ ఎంపీ.. భారత రెజ్లర్ల కీలక వ్యాఖ్యలు..

Vinesh Phogat: ప్రఖ్యాత మల్ల యోధురాలు వినేశ్ ఫొగాట్ తీవ్ర ఉత్కంఠ మధ్య శనివారం భారత్ వచ్చింది. ఇటీవలి పారిస్ విశ్వ క్రీడల్లో కుస్తీ పోటీల్లో ఫైనల్ చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. రెజ్లింగ్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఫైనల్ మ్యాచ్ లో 100 గ్రాములు అధిక బరువు ఉండటం వల్ల అనర్హతకు గురైంది.. దీనిపై ఆమె పోరాటం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఆ బరువు తగ్గించుకునేందుకు ఆమె ఎన్నో ఇబ్బందులు పడింది.. ఎంతో ఇష్టమైన తన జుట్టును కత్తిరించుకుంది. శరీరం నుంచి రక్తాన్ని తొలగించుకుంది. రాత్రి మొత్తం జాగింగ్ చేసింది. డైట్ కూడా మానేసింది. పలుమార్లు ఆవిరి స్నానం చేసింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంవల్ల ఆమె ఫైనల్ మ్యాచ్ లో తల పడలేకపోయింది. పారిస్ ఒలంపిక్ కమిటీ తీరును నిరసిస్తూ భారత ఒలంపిక్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.. పి.టి.ఉష ఆధ్వర్యంలో పలువురు పారిస్ ఒలంపిక్ కమిటీ సభ్యులను కలిసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో వినేశ్ ఫొగాట్ “కాస్” గడప తొక్కింది. తన వాదనను భారతదేశానికి చెందిన సీనియర్ లాయర్లతో కాస్ ఎదుట వినిపించింది. ఆ లాయర్ల వాదనలు విన్న కాస్.. తీర్పును మూడుసార్లు వాయిదా వేసింది. చివరికి ఆమెపై విధించిన అనర్హత వేటు సరైనదని భావించింది. ఫలితంగా ఆమె రజత పతకానికి అర్హురాలు కాదని స్పష్టం చేసింది. దీంతో వినేశ్ బాధాతప్త హృదయంతో పారిస్ స్పోర్ట్స్ విలేజ్ ను తన లగేజ్ తో వీడింది.

ఫైనల్ మ్యాచ్లో అనర్హత వేటుకు గురి కావడంతో.. కృంగిపోయిన వినేశ్.. రెజ్లింగ్ కు వీడ్కోలు పలికింది. టోక్యో ఒలంపిక్స్ లో, అంతకు ముందు జరిగిన రియో ఒలంపిక్స్ లోనూ వినేశ్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. తొలి రౌండ్ లోనే ఓటమిపాలై స్వదేశానికి తిరిగి వచ్చింది. అని పారిస్ ఒలింపిక్స్ లో ఆమె సత్తా చాటింది. 50 ప్రీ స్టైల్ విభాగంలో ఫైనల్ వెళ్ళింది. ఇలా ఫైనల్ వెళ్లిన తొలి భారత మల్ల యోధురాలిగా ఆమె చరిత్ర సృష్టించింది. కానీ ఫైనల్ లో దురదృష్టవశాత్తు 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో అనర్హత వేటును ఎదుర్కొంది. ఆ తర్వాత రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పేసింది.. ఆమె నిర్ణయంతో దేశం యావత్తు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆమెకు నచ్చజెప్పేందుకు పి.టి.ఉష ప్రయత్నించినప్పటికీ.. వినేశ్ ఆ మాటకే నిలబడి ఉంటానని స్పష్టం చేసింది. కాస్ తీర్పుకు ముందే వినేశ్ స్వదేశానికి పయనమైంది. శనివారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయానికి చేరుకుంది.

స్వదేశానికి చేరుకున్న ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.. అభిమానులను చూసిన వినేశ్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైంది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అభిమానులకు అభివాదం చేసింది. కొంతమంది అభిమానులు ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ.. 500 నోట్లతో రూపొందించిన దండను మెడలో వేశారు.. ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని అనుసరించి.. కాన్వాయ్ లాగా బయలుదేరి వెళ్లారు. వినేశ్ వెంట కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు దీపిందర్ హుడా, మల్ల యోధులు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా ఉన్నారు. బాధపడుతున్న వినేశ్ ను ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు. “ఆమె తెగువ ఇంత పెద్ద దేశాన్ని కదిలించింది. దానిని చాలామంది ఇష్టపడుతుంటారు. అందువల్లే అభిమానులు ఈ స్థాయిలో ఘన స్వాగతం పలికారని” బజరంగ్ పునియా వ్యాఖ్యానించాడు. ” ఆమెలాంటిదో అందరికీ తెలుసు. దేశం కోసం ఏం చేసిందో కూడా తెలుసు. తక్కువ మంది మాత్రమే ఇలాంటి దానికి అర్హత సాధిస్తారు. ఆమె కు దక్కే ఈ ప్రశంసలు చాలా గొప్పవి. వాటికి ఆమె నూటికి నూరు శాతం అర్హురాలని” సాక్షి మాలిక్ పేర్కొన్నారు..”ఆమె ఓ పోరాట యోధురాలు. మనందరికీ విజేతగా పరిచయం. ఆమెను ఛాంపియన్ గా భావించాం. మన దృష్టిలో గోల్డ్ మెడల్ సాధించిందని అనుకున్నాం. 53 కిలోల విభాగంలో ఆమె తలపడుతుంది.. 50 కిలోల విభాగానికి తన స్థాయిని తగ్గించుకుంది. ఫైనల్ దాకా వెళ్ళింది. మూడు రంగుల జెండాను రేపరెపలాడించిందని” సత్యవర్త్ కడియన్ అనే మల్ల యోధుడు వ్యాఖ్యానించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version