Kannaiah Naidu: తుంగభద్రకు అడ్డుకట్ట వేసిన బాహుబలి.. కన్నయ్య నాయుడు ఎవరు? ఆయన సాధించింది ఏంటంటే?

వారం రోజుల కిందట తుంగభద్ర జలాశయానికి భారీ డ్యామేజ్ జరిగింది. నిండుకుండల జలాశయం ఉండగా ఒక గేటు కొట్టుకుపోయింది. లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా పోగా.. జలాశయంలో నీరు ఖాళీ అయింది. సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.

Written By: Dharma, Updated On : August 17, 2024 1:47 pm

Kannaiah Naidu

Follow us on

Kannaiah Naidu: తుంగభద్ర జలాశయం సంరక్షణకు ఇంజనీరింగ్ బృందం రంగంలోకి దిగింది. కొట్టుకుపోయిన 11వ క్రస్ట్ గేటు స్థానంలో ప్రత్యామ్నాయంగా గేటు ఏర్పాటు చేసేందుకు గత మూడు రోజులుగా అహోరాత్రులు శ్రమిస్తోంది ఆ బృందం. వందలాదిమంది కార్మికులతో క్షణం తీరిక లేకుండా గేటు ఏర్పాటు లక్ష్యంగా పావులు కదిపింది. ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగింది. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యింది. తాత్కాలిక గేటును ఏర్పాటు చేయగలిగింది. అయితే ఇది అంత ఆషామాషీ విషయం కాదు. తుంగభద్ర జలాశయ బాధ్యత కర్ణాటకదే అయినా.. ఈ విషయంలో మాత్రం ఏపీ ప్రత్యేక చొరవ తీసుకుంది. జలాశయాల గేట్ల రూపకల్పనలో ఎంతో అనుభవం ఉన్న మన రాష్ట్రానికి చెందిన ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడును రంగంలోకి దించింది. మూడు రోజులపాటు నిద్రాహారాలు మాని కన్నయ్య నాయుడు నేతృత్వంలోని నిపుణుల బృందం అనుకున్నది సాధించింది. కొట్టుకుపోయిన 19వ వ క్రస్ట్ గేటు స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దీంతో ఏపీకి ప్రమాదం తప్పినట్లు అయ్యింది. అదే సమయంలో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇబ్బంది లేకుండా కాపాడగలడంలో సక్సెస్ అయ్యారు. తుంగభద్ర జలాశయానిది సుదీర్ఘ చరిత్ర. 1954లో ఈ జలాశయాన్ని నిర్మించారు. మిగిలిన జలాశయాలతో పోలిస్తే దీని నిర్వహణ బాగున్నట్టే. వాస్తవానికి జలాశయం గేట్ల జీవితకాలం 45 సంవత్సరాలు. ఈ ప్రాజెక్టు జీవిత కాలం మాత్రం వందేళ్లు. కానీ ఈ గేట్లు వేసి దాదాపు 70 సంవత్సరాలు అవుతోంది. సాధారణంగా కొత్త జలాశయాలకు వేసిన గేట్లు 20 సంవత్సరాలకి పాడవుతున్నాయి. ఈ విషయంలో తుంగభద్ర జలాశయం గేట్లు బలమైన వని చెప్పవచ్చు. ఈనెల 10వ తేదీ రాత్రి ప్రవాహ తీవ్రత వల్లే ఈ గేట్ కొట్టుకెళ్లిపోయింది.

* కొట్టుకుపోయిన గేటు
దాదాపు 105 టీఎంసీలతో నిండుకుండలా ఉండేది జలాశయం. దీంతో ఈ ఏడాది మూడు రాష్ట్రాలకు సాగునీటికి ఇబ్బంది ఉండదని అంతా భావించారు. సరిగ్గా అటువంటి సమయంలోనే జలాశయం గేటు కొట్టుకుపోయింది. లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా బయటకు వెళ్ళిపోయింది. ఈ తరుణంలో నదీ పరివాహక ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఇటువంటి తరుణంలో కర్ణాటక కంటే ఏపీ చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.అప్పుడే రంగంలోకి దిగారు ఏపీ బాహుబలి కన్నయ్య నాయుడు.

* చేతులెత్తేసిన వైనం
ఈ విషయంలో కేంద్ర జల సంఘం సైతం చేతులెత్తేసింది. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఇంజనీరింగ్ బృందం ఉంది. ఇటువంటి తరుణంలో రంగంలోకి దిగారు కన్నయ్య నాయుడు. గేట్ల ఏర్పాటులో కన్నయ్య నాయుడుకు ఐదు దశాబ్దాల అనుభవం ఉంది. అందుకే ఆయన చొరవతో స్టాప్ లాగ్ గేట్లు పెట్టాలని ప్రయత్నం ప్రారంభించారు. వాస్తవానికి జలాశయ కట్టడంలో ఓ రాయి కదిలితే మొత్తం రాళ్లు పడిపోయే ప్రమాదం ఉంది. ఇటువంటి సమయంలో రాళ్లకు ముప్పు లేకుండా పని చేయాలి. మరోవైపు నీటి ప్రవాహం అధికంగా ఉంది. ఇటువంటి సమయంలో నిపుణులైన అధికారులను, కార్మికులను రంగంలోకి దించారు కన్నయ్య నాయుడు. ఈ జలాశయం 60 అడుగుల ఎత్తు వరకు ఉంది. ఇటువంటి భారీ నిర్మాణం దేశంలో ఎక్కడా లేదు. ఇలాంటి జలాశయాలు నిండా నీరుంటే తాత్కాలిక గేటు పెట్టడం కష్టం. 60 అడుగుల ఎత్తున పనిచేయలేదు. కానీ కన్నయ్య నాయుడు రెండు క్రేన్లను నిలిపి తాత్కాలికంగా గేటు అమర్చారు. మొదట నాలుగు అడుగుల ఎత్తులో తాత్కాలిక గేటు పెట్టారు. మరో ఎనిమిది అడుగుల ఎత్తులో మరో తాత్కాలిక గేటు పెట్టగలిగారు. ఇలా 12 అడుగుల ఎత్తు వరకు అడ్డుకట్ట వేయడం ద్వారా 60 టీఎంసీల నీటిని అడ్డుకోగలిగారు.

* మార్మోగిన కన్నయ్య నాయుడు పేరు
ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో కన్నయ్య నాయుడును బాహుబలితో పోల్చుతున్నారు. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ తరఫున కన్నయ్య నాయుడు రంగంలోకి దిగడంతో ఏపీ మంత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో సైతం కన్నయ్య నాయుడును బాహుబలి గా అభివర్ణిస్తూ పోస్టులు వెలుస్తున్నాయి. అవి విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.