https://oktelugu.com/

India vs Australia : టీమిండియాకు ఏంటీ శిరోభారం.. గబ్బా లో చరిత్ర తిరగరాసిన హెడ్.. ఈసారి ఏం చేశాడంటే.. వీడియో వైరల్..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడవ టెస్ట్ జరుగుతున్న బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ చరిత్ర తిరగ రాశాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్న అతడు.. సరికొత్త రికార్డు సృష్టించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 15, 2024 / 10:51 AM IST
    Follow us on

    India vs Australia : శనివారం వర్షం కురవడంతో తొలిరోజు ఆట తుడిచిపెట్టుకుపోయింది. దీంతో రెండవ రోజైన ఆదివారం వర్షం తగ్గడంతో ఆట మళ్లీ మొదలైంది. ప్రారంభంలో మూడు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు హెడ్, స్మిత్ పాతుకుపోయారు. భారత బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినప్పటికీ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై పై చేయి సాధించలేకపోయాడు.. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్(101*), స్మిత్ (64*) క్రీజ్ లో ఉన్నారు. తొలి స్పెల్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు.. ఆ తర్వాత తేలిపోయారు. బుమ్రా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా.. ఇలా అయిదుగురు బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. నాలుగో వికెట్ కు ఇప్పటివరకు స్మిత్, హెడ్ 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో.. ఈ మ్యాచ్ గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లేందుకు అవకాశాలు ఉన్న తరుణంలో.. భారత బౌలర్లు చేతులెత్తేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

    మరోసారి శిరోభారం

    మూడో టెస్టులోనూ హెడ్ భారత జట్టుకు శిరోభారంగా తయారయ్యాడు. లబూ షేన్ అవుట్ అయిన వెంటనే క్రీజ్ లోకి వచ్చిన అతడు మైదానంలో పాతుకుపోయాడు. భారత బౌలర్లను ప్రతిఘటిస్తూ సింహ స్వప్నం లాగా మారిపోయాడు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. చెత్త బంతులను బౌండరీలుగా తరలించాడు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ లో అప్పర్ కట్ షాట్ ఆడి ఫోర్ గా మలిచాడు. అది అతడి ఇన్నింగ్స్ కే హైలెట్ గా నిలిచింది.

    సరికొత్త రికార్డు

    గబ్బా మైదానంలో హెడ్ కు ఆశించినంత స్థాయిలో రికార్డు లేదు. అతడు ఈ మైదానంపై మూడు సార్లు డక్ అవుట్ గా వెనుతిరిగాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్ట్ లోనూ అతడు అదే విధంగా ఔట్ అవుతాడని.. అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ హెడ్ తిరుగులేని ఆట తీరు ప్రదర్శించాడు. భారత బౌలర్లకు ఏమాత్రం భయపడకుండా బ్యాటింగ్ చేశాడు. దూకుడుగా ఆడుతూ.. పరుగుల వరద పారించాడు. తను ఆడుతున్నది టెస్ట్ అని మర్చిపోయి.. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. 115 బంతుల్లో 13 ఫోర్ల సహాయంతో 101 పరుగులు చేశాడు. అతడి జోరు చూస్తుంటే డబుల్ సెంచరీ చేసేలా కనిపిస్తున్నాడు. ఏమాత్రం భయం అనేది లేకుండా ఆడుతున్నాడు. భారత బౌలర్లను చీల్చి చెండాడుతున్నాడు. అతని బ్యాటింగ్ చూస్తూ ఆస్ట్రేలియా ప్రేక్షకులు ఆస్వాదిస్తుంటే.. టీమిండియా ప్రేక్షకులు మాత్రం నిరాశలో మునిగిపోయారు.