Sr. NTR : నందమూరి తారక రామారావు.. అలియాస్ ఎన్టీఆర్. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. రాజకీయాల్లో ప్రభంజనం.. ప్రతి తెలుగు వాడి ఆత్మ గౌరవం.. ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం.. సంక్షేమ పథకాలకు తారక మంత్రం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు ఆయన సొంతం. ఆయనకే అవి అనితర సాధ్యం. వెండితెర ఇలవేల్పుగా.. రాజకీయాల్లో అనితర సాధ్యుడిగా రాణించిన ఆయనకు ఒక లోటు ఉంది. అదే భారతరత్న. ఆ అవార్డుకు నిజమైన అర్హుడు ఎన్టీఆర్. కానీ దశాబ్దాలుగా ఆ మాట వినిపిస్తుంది కానీ కార్యరూపం దాల్చడం లేదు. తాజాగా ఆయన సినీ జీవితం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. విజయవాడలో వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇదే వేదికపై మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని పోరాడుతామని స్పష్టం చేశారు. దీంతో అభిమానుల్లో ఒక రకమైన ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడంతో.. తప్పకుండా ఈసారి ఎన్టీఆర్కు భారతరత్న దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో సీఎం చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పుకు రావడంతో తప్పకుండా లభిస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు.
* నాలుగున్నర దశాబ్దాల కిందట
తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలిరా.. అంటూ 1982 మార్చి 29న పిలుపునిస్తూ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు నందమూరి తారక రామారావు. తారక రాముడి అనూహ్య నిర్ణయానికి ఢిల్లీ కోటలో కదిలాయి. రాజ్యసభ సీటు ఇస్తాం అంటూ రాయబారాలు మొదలయ్యాయి. లక్ష్యసాధనలో విజ్ఞులు ఎప్పుడూ ప్రలోభాలకు లొంగరనే వివేకానందుడి మాటలను ఒంటి పట్టించుకున్న అన్న ఎన్టీఆర్ వెనుకడుగు వేయలేదు. జనం మధ్యకు వచ్చారు. జనం నీరాజనాలు పలికారు. చైతన్య రథం ఎక్కి ఊరు రా తిరుగుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టారు. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ను మట్టికరించారు. రైట్ పర్సన్ ఇన్ రైట్ టైం అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ.. రాజకీయ సూన్యతను ముందే పసికట్టిన ఢిల్లీ నాయకులను బెంబేలెత్తించి తెలుగోడి సత్తాను చాటారు ఎన్టీ రామారావు.
* తిరుగులేని శక్తిగా..
పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంట ఆరాధించబడ్డ నటుడు ఎన్టీ రామారావు. అది ఆయనను తిరుగులేని శక్తిగా మార్చింది. కృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు. రాముడు అంటే ఎలా ఉంటారో తెలియదు. కానీ ఇదిగో ఈ రూపం అంటూ ప్రతి తెలుగు వాడి మదిలో కనిపించేది ఎన్టీఆర్. నాయకుడంటే ఎలా ఉంటాడు అని పాలించి చూపించారు. అందుకే రాజకీయం అనే డిక్షనరీలో తొలి పేజీలో అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఎన్టీఆర్ దే మొదటి స్థానం. అధికారం చేపట్టిన నాటి నుంచి ఏదైతే చెప్పారో అదే చేసి చూపారు. తప్పుడు వాగ్దానాలు, తప్పించుకునే దారిని ఆయన పాలనలో ఏనాడు దరిచారనివ్వలేదు. నాలుగున్నర దశాబ్దాల కిందట ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పునాదులు ఇప్పటికీ గట్టిగా ఉన్నాయంటే దానికి కారణం ముమ్మాటికి ఎన్టీఆర్. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలే. 33 సంవత్సరాల సినీ జీవితం, 13 సంవత్సరాల రాజకీయ జీవితంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు ఎన్టీఆర్. 1996 జనవరి 18న 73 ఏళ్ల వయసులో మృతి చెందారు. యుగ పురుషుడిగా నిలిచిపోయారు. అటువంటి మహానేతకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది. కానీ అది కార్యరూపం దాల్చడం లేదు. పోనీ ఈసారి అయినా ఆయనకు భారతరత్న దక్కాలని సగటు ఏపీ పౌరుడిగా కోరుకుందాం.