ICC Champions Trophy 2025 : సొంత మైదానంలో జరిగిన ట్రై సిరీస్ లో న్యూజిలాండ్ చేతుల్లో పాకిస్తాన్ దెబ్బతిన్నది. దీనికంటే ముందు సౌత్ ఆఫ్రికాను వారి దేశంలో వైట్ వాష్ చేసింది. అంతకంటే ముందు ఆస్ట్రేలియా లో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం సాధించి సిరీస్ దక్కించుకుంది. బాబర్ అజామ్ ఫామ్ అంత గొప్పగా లేదు. సల్మాన్ అఘా, రిజ్వాన్, ఫకర్ జమాన్ దూకుడు మీద ఉన్నారు. షహీన్ షా, నసీం షా, అబ్రార్ అహ్మద్ సూపర్ ఫామ్ లో బౌలింగ్ చేస్తున్నారు. రౌఫ్ ఫిట్ నెస్ సాధించడం ఆ జట్టుకు కొండంత బలం. పాకిస్తాన్ ఒకవేళ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తే సెమీస్ వెళ్లగలదు.
ఇక ఈ టోర్నీలో న్యూజిలాండ్ జట్టు పై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ జట్టు స్థిరమైన ఆట తీరు ప్రదర్శిస్తుంది. ఇటీవల పాకిస్తాన్ వేదికగా జరిగిన ట్రై సిరీస్లో విజేతగా నిలిచింది . విలియంసన్, కాన్వే, ఫిలిప్స్, మిచల్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. శాంట్నర్, బ్రాస్వెల్, హెన్రీ, ఓరూర్కే బౌలింగ్లో అదరగొడుతున్నారు. ఒకవేళ న్యూజిలాండ్ జట్టు ఇదే ఊపు కొనసాగిస్తే కచ్చితంగా ఫైనల్ వెళ్లగలదని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఎందుకో అంత బలంగా కనిపించడం లేదు.. కెప్టెన్ కమిన్స్ జట్టుకు దూరమయ్యాడు. మిచెల్ మార్ష్ గాయం వల్ల ఇంటికి పరిమితమయ్యాడు. స్టార్క్ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు, స్టోయినిస్ ఏకంగా వన్డేలకే వీడ్కోలు పలికాడు. తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్, లబూ షేన్, ట్రావిస్ హెడ్, మాక్స్ వెల్, షార్ట్, జోష్ ఇంగ్లిస్, అబాట్, స్పెన్సర్ జాన్సన్, ఎలిస్ లాంటి ఆటగాళ్లతో కూడిన ఆస్ట్రేలియా జట్టు ఈ టోర్నీలో ఎలాంటి ప్రతిభ చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఎలాంటి ఫార్మాట్ అయినా దూకుడుగా ఆడే ఇంగ్లాండ్ జట్టుపై ఈసారి భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల భారత జట్టుతో జరిగిన టి20, వన్డే సిరీస్లలో న్యూజిలాండ్ ఓటమిపాలైంది.. అయినప్పటికీ సాల్ట్, డకెట్, బట్లర్, బ్రూక్, రూట్, లివింగ్ స్టోన్ వంటి ఆటగాళ్లు ఇంగ్లాండ్ జట్టుకు ప్రధాన బలం. అబ్దుల్ రషీద్ రూపంలో ప్రపంచ స్థాయి స్పిన్నర్ ఇంగ్లాండ్ జట్టుకు అందుబాటులో ఉన్నాడు. ఆర్చర్, సకిబ్, మహమూద్, వుడ్ తో కూడిన పేస్ విభాగం బలంగా కనిపిస్తోంది.
ఐసీసీ టోర్నీ అంటే చాలు దురదృష్టకరమైన జట్టుగా దక్షిణాఫ్రికాకు పేరుంది. అయితే ఈసారి తన రాతను మార్చుకోవాలని దక్షిణాఫ్రికా జట్టు భావిస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికా జట్టులో ఎంట్రీ ఇచ్చిన బ్రీట్జ్కే సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వండర్ డసన్, క్లాసెన్, మిల్లర్ లాంటి సీనియర్ ఆటగాళ్లు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు. రబాడ మీదనే బౌలింగ్ ఆధారపడి ఉంది. ఎంగిడి పెద్ధగా ఫామ్ లో లేడు. స్పిన్ బౌలర్లు కేశవ్ మహారాజ్, షంసి రాణించాల్సి ఉంది.
బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ టోర్నీలో నాకౌట్ దశకు వెళ్లడం దాదాపు కష్టమే. అలా అని వాటిని తీసిపారేయడానికి లేదు. మహమ్మదుల్లా, ముస్తాఫిజూర్, మిరాజ్ వంటి ఆటగాళ్లపై బంగ్లాదేశ్ ఆశలు పెట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నబి, కరోటె ల ప్రదర్శన మీదే ఆధారపడి ఉంది. ఒకవేళ సంచలనాలు గనుక చోటు చేసుకుంటే ఈ జట్లు అద్భుతమైన ప్రదర్శన ఇస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.