IPL Mega Auction 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా క్రికెట్ అనేది రిచ్ లీగ్ లాగా మారిపోయింది. ఏకంగా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ను బీట్ చేసేస్తోంది. ప్రసార హక్కులు, మైదానంలో టికెట్లు ధరలు, ప్రైజ్ మనీ, లోకల్ స్పాన్సర్షిప్, గ్రౌండ్లో అండార్స్ మెంట్లు ఇలా లెక్కేసుకుంటే.. బోలెడంత రాబడి వస్తోంది. దీంతో ఆటగాళ్ల మీద కోట్లకు కోట్లు కుమ్మరించడానికి యాజమాన్యాలు వెనకడుగు వేయడం లేదు. ఐపీఎల్ లో వేలం అనేది కొత్త కాదు, కోట్లకు కోట్లు చెల్లించడం కొత్తకాక పోయినప్పటికీ.. ఈసారి మాత్రం వేలం సరికొత్తగా జరిగింది. ముఖ్యంగా స్టార్ ఆటగాళ్లకు, అందులోనూ ఇండియన్ ఆటగాళ్లకు భారీగా ధరలు లభించాయి. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లు ఏకంగా 77.5 కోట్ల ను దక్కించుకున్నారు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరంటే..
రిషబ్ పంత్
రోడ్డు ప్రమాదానికి గురై.. చావు చివరిదాకా వెళ్లొచ్చి.. దాదాపు రెండు సంవత్సరాలపాటు మంచానికే పరిమితమై.. నరకం చూసాడు రిషబ్ పంత్. అతని స్థానంలో మరో ఆటగాడు ఉంటే ఇంతలా బౌన్స్ బ్యాక్ అయి ఉండేవాడు కాదు. గత సీజన్లో ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే ఆ జట్టు యాజమాన్యం అతనిని వదిలేసింది. దీంతో అతడు ఒకసారిగా వార్తల్లోకి ఎక్కాడు. అంతేకాదు అతడిని కొనుగోలు చేసేందుకు పెద్దపెద్ద జట్లు పోటీపడ్డాయి. చివరికి లక్నో జట్టు కొనుగోలు చేసింది. ఏకంగా 27 కోట్లు చెల్లించింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఇదే హైయెస్ట్ అమౌంట్. రేపటికి వేలం జరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ఇంతకు మించి డబ్బుతో కొనుగోలుకు ధైర్యం చేస్తాయని అనుకోవడంలేదని స్పోర్ట్స్ వర్గాలు అంటున్నాయి.
శ్రేయస్ అయ్యర్
గత ఏడాది కోల్ కతా జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. తన పోరాటస్ఫూర్తితో జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపాడు. ఆటగాళ్లలో కసిని పెంచాడు. అందువల్లే కోల్ కతా జట్టును తిరుగులేని స్థాయిలో నిలబెట్టాడు. అయితే కోల్ కతా యాజమాన్యం అతడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో సహజంగానే శ్రేయస్ అయ్యర్ కు డిమాండ్ ఏర్పడింది. అది వేలంలో కనిపించింది. ఎన్నోజట్లు పోటీపడ్డాయి చివరికి పంజాబ్ 26.75 కోట్లతో కొనుగోలు చేసి.. అందరినీ ఆశ్చర్యపరిచింది.
వెంకటేష్ అయ్యర్
ఈ బక్క పల్చని ఆటగాడు కోల్ కతా జట్టుకు సుదీర్ఘకాలంగా ఆడుతున్నాడు. ఇతడు కొట్టని షాట్లు అంటూ లేవు.. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే ఇతడు.. సునామి తరహా ఇన్నింగ్స్ ఆడతాడు. మెరుపు వేగంతో పరుగులు తీస్తాడు. తక్కువ బంతుల్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసే ఆటగాడిగా ఇతడు పేరు తెచ్చుకున్నాడు. అందువల్లే ఇతడిని కోల్ కతా జట్టు మరోసారి తీసుకుంది. ఇటీవల వదిలేసినప్పటికీ.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇతడిని ఏకంగా 23.75 కోట్లకు దక్కించుకుంది..
మొత్తంగా చూస్తే శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్ 77.5 కోట్లను దక్కించుకొనుట లెక్క. వీరి వయసు 30 సంవత్సరాల లోపు మాత్రమే.. కసిగా ఆడటంలో, మెరుగైన ఇన్నింగ్స్ నిర్మించడంలో, బలమైన భాగస్వామ్యాలు నెలకొల్పడంలో వీరికి వీరే సాటి. అందువల్లే ఐపీఎల్ వేలంలో వీరి కోసం జట్లు పోటీపడ్డాయి. చరిత్రలో తొలిసారిగా కోట్లకు కోట్లు కుమ్మరించాయి.