Rohit Sharma: ఐపీఎల్ కు ఇంకా కొద్దిరోజులే సమయం ఉంది. ఐపీఎల్ తర్వాత పరిస్థితి ఏంటి? మళ్లీ ఆ స్థాయిలో క్రికెట్ వినోదం లభిస్తుందా? అనే సగటు అభిమాని ప్రశ్నకు ఐసీసీ అదిరిపోయే రేంజ్ లో సమాధానం ఇస్తోంది. అంతేకాదు 15 ఏళ్ల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అంటూ హామీ ఇస్తోంది. ఇంతకీ ఐపీఎల్ ముగిసిన తర్వాత ఐసీసీ ఏం టోర్నీలు ప్లాన్ చేసింది? అవి ఎక్కడ జరుగుతాయి? అనే వివరాలు మీకోసం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా హోస్ట్ చేస్తున్న టి20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. ఇది జూన్ 1 నుంచి జూన్ 29 వరకు కొనసాగుతుంది. ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజులకే ఈ టోర్నీ ప్రారంభమవుతుందని ఐసిసి అంటోంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఐసిటి ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది జరుగుతుంది. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ ట్రోఫీ కోసం పది జట్లు పోటీ పడతాయి. మినీ వరల్డ్ కప్ గా భావించే ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకునేందుకు అన్ని జట్లు సర్వశక్తులూ ఒడ్డుతాయి.
ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ వచ్చే ఏడాది జూన్లో జరుగుతుంది. ఈ టోర్నీ ఇంగ్లాండ్లో నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఇలా మూడు మెగా టోర్నీలను 15 నెలల వ్యవధిలోనే నిర్వహిస్తూ ఉండడం విశేషం.
టి20 వరల్డ్ కప్ ప్రవేశపెట్టిన సంవత్సరం భారత్ కైవసం చేసుకుంది. ఇప్పటివరకు మరో టి20 వరల్డ్ కప్ భారత జట్టు ఖాతాలో నమోదు కాలేదు.. 2013లో ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలిచింది. కానీ ఇంతవరకు మరో ట్రోఫీ భారత వశం కాలేదు. ఇక ఇటీవల స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడాలంటే భారత్ ఐసీసీ టోర్నీలలో సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.