Yashaswi Jaiswal : చిదంబరం మైదానం వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో భారత తలపడుతోంది. తొలి టెస్ట్ మ్యాచ్లో భాగంగా భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇటీవల పాకిస్తాన్ జట్టును ఓడించిన బంగ్లాదేశ్ జట్టు.. అదే ఉత్సాహంతో బౌలింగ్ చేసింది. ఆ జట్టు బౌలర్లు నిలకడగా బౌలింగ్ చేయడంతో.. పలు సెషన్లలో భారత జట్టుపై బంగ్లాదేశ్ పై చేయి సాధించింది. టి విరామానికి ముందు టీమిండియా 48 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 176 రన్స్ చేసింది. ఆ తర్వాత జట్టు రూపురేఖలను రవీంద్ర జడేజా (49*), రవిచంద్రన్ అశ్విన్ (73*) మార్చేశారు. వీరిద్దరూ ఏడో వికెట్ కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత జట్టు మొదటి, రెండు సెషన్ లలో తీవ్రంగా ఇబ్బంది పడింది. కేవలం 88 పరుగులు మాత్రమే చేసి, కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (56) హఫ్ సెంచరీ చేయడంతో భారత జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. భారీ స్కోర్ ఖాయమని అభిమానులు అనుకున్నారు. కానీ 10 ఓవర్లలోపే బంగ్లా బౌలర్ హసన్ మహమ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ (6) , గిల్(0), విరాట్ కోహ్లీ (6) అవుట్ అయ్యారు. ఈ దశలో రిషబ్ పంత్ (39), జైస్వాల్ నాలుగో వికెట్ కు 62 పరుగులు జోడించారు.
లంచ్ విరామం తర్వాత..
భోజన విరామం తర్వాత పంత్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ (16) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.. ఈ దశలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని కెరియర్ లో ఇది ఐదవ హాఫ్ సెంచరీ. ఇప్పటికే అతడు 3 సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో జైస్వాల్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.. ఈ ఏడాది క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు సాధించిన రెండవ ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. బంగ్లా జట్టుతో సీరియస్ ప్రారంభానికి ముందు జైస్వాల్ నాలుగో స్థానంలో ఉన్నాడు.. హాఫ్ సెంచరీ చేయడం ద్వారా తనకంటే ముందు ఉన్న ఆటగాళ్లను అధిగమించాడు. ఏకంగా రెండవ స్థానానికి చేరుకున్నాడు. జైస్వాల్ కంటే ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్(20 ఇన్నింగ్స్ లలో 986 పరుగులు) మొదటి స్థానంలో ఉన్నాడు. జైస్వాల్ (12 ఇన్నింగ్స్ లలో 796 రన్స్), జైస్వాల్ తర్వాత కామిందు మెండిస్( 10 ఇన్నింగ్స్ లలో 748) పోప్(11 ఇన్నింగ్స్ లలో 745) తర్వాతి స్థానాలలో ఉన్నారు. ఒకవేళ జైస్వాల్ ఇదే దూకుడు కనక కొనసాగిస్తే రూట్ ను అధిగమించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. భారత్ ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. అలాంటప్పుడు జైస్వాల్ రూట్ రికార్డ్ అధిగమించడం దాదాపు ఖాయమే.