https://oktelugu.com/

IPL 2024: ఈ ఐపీఎల్ ఎప్పటికీ ప్రత్యేకమే.. ఎందుకో తెలుసా?

ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమై దాదాపు నాలుగు వారాలు పూర్తయింది. 10 జట్లు సగం మ్యాచ్ లు ఆడేశాయి. అభిమానులను అంతకుమించి అనే స్థాయిలో అలరిస్తున్నాయి.

Written By: , Updated On : April 19, 2024 / 01:51 PM IST
IPL 2024

IPL 2024

Follow us on

IPL 2024: ఐపీఎల్ అంటేనే దూకుడుకు మారుపేరు. బాదుడుకు పర్యాయపదం. అనితర సాధ్యమైన ఆటతీరుకు నానార్థం. ఇది ప్రతి సీజన్లో నిరూపితమవుతూనే ఉంది. అందువల్లే ఆటగాళ్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. పాత రికార్డులను బద్దలు కొడుతున్నారు. అసాధ్యం అనే మాటను సాధ్యం చేసి చూపిస్తున్నారు. ఫలితంగా అభిమానులకు సరికొత్త క్రికెట్ అనుభూతి లభిస్తోంది. ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక కొత్తదనం ప్రేక్షకులను మైదానాల వైపు మళ్ళిస్తోంది. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ ల్లోనూ మైదానాలు హౌస్ ఫుల్ అయిపోయాయంటే ఐపీఎల్ వారి మీద ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆటగాళ్ల ఆట తీరు వారిని ఏ విధంగా కట్టిపడేస్తోందో అవగతం చేసుకోవచ్చు.

ఈ ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమై దాదాపు నాలుగు వారాలు పూర్తయింది. 10 జట్లు సగం మ్యాచ్ లు ఆడేశాయి. అభిమానులను అంతకుమించి అనే స్థాయిలో అలరిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సగం మ్యాచులు ముగిసినప్పటికీ ఈసారి సరికొత్త రికార్డులను ఆటగాళ్లు సృష్టిస్తున్నారు. ఐపీఎల్ మాత్రమే కాకుండా t20 చరిత్రలోనే సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభ మ్యాచ్ చెన్నై, బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఆ మ్యాచ్లో చెన్నై గెలుపొందింది. అయితే ఆశించినత స్థాయిలో ఆ మ్యాచ్ ప్రేక్షకులకు ఆనందాన్ని ఇవ్వలేదు. కానీ మూడవ మ్యాచ్ నుంచి అసలు సిసలైన ఐపిఎల్ మజా ప్రారంభమైంది. ఇక ఉప్పల్ వేదికగా హైదరాబాద్, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు సరికొత్త క్రికెట్ అనుభూతిని అందించింది.

ఈ మ్యాచ్లో హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేసి ఏకంగా 277 స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు హైయెస్ట్ స్కోర్ ఘనత బెంగళూరు (263) పేరు మీద ఉండేది. అయితే ఆ రికార్డును హైదరాబాద్ జట్టు తుడిపేసింది. అయితే చేజింగ్ లో ముంబై జట్టు చేతులెత్తయలేదు. అదికూడా అంతకుమించి అనే స్థాయిలో ఆడింది. దూకుడుగా ఆడుతూ 246 రన్స్ చేసింది. ఇలా చేజింగ్లో 246 పరుగులు చేయడం అంత సులభం కాదు. అన్ని పరుగులు చేసిన మొదటి జట్టుగా ముంబై రికార్డు సృష్టించింది. పరుగులపరంగానే కాదు.. ఈ మ్యాచ్ సిక్సర్ల పరంగా కూడా సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్ గా ఇది రికార్డు సృష్టించింది.

ఇక విశాఖపట్నం వేదికగా కోల్ కతా, ఢిల్లీ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా ఏకంగా 272 రన్స్ చేసింది. హైదరాబాద్ జట్టుకు అతి చేరువగా వచ్చింది. ఇలా ఒకే టోర్నమెంట్లో 270+ స్కోర్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ జరిగిన కొద్ది రోజులకే ముంబై వేదికగా బెంగళూరు, ముంబై జట్లు తలపడ్డాయి. బెంగళూరు 196 పరుగులు చేయగా.. ముంబై ఆ లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. అంతేకాదు ఐపీఎల్ మజా ప్రేక్షకులకు అందించింది. ఇక ఇటీవల బెంగళూరు జట్టుతో చిన్న స్వామి స్టేడియం వేదికగా హైదరాబాద్ జట్టు తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఈ మైదానంలో పరుగుల వరద పారించింది. హెడ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. క్లాసెన్ తన మార్క్ షాట్లతో ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సమద్, అభిషేక్, మార్ప్రం దూకుడుగా ఆడి హైదరాబాద్ జట్టుకు 287 పరుగుల భారీ స్కోరు అందించారు. చరిత్రపుటల్లో సరికొత్త ఘనతను లిఖించారు. అంతకుముందు ముంబై జట్టుపై తాము చేసిన 277 పరుగుల రికార్డును కేవలం రోజుల వ్యవధిలోనే తుడిచిపెట్టారు. అంతేకాదు ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ముంబై జట్టు పేరు మీద ఉన్న రికార్డును కూడా బద్దలు కొట్టారు.

అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు కూడా వెన్ను చూపలేదు. తిరుగులేని పోరాట పటిమ చూపించి ఏకంగా 262 పరుగులు చేసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 13వేల టి20 మ్యాచ్ లు జరగగా.. మునుపెన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్లో మొత్తం రెండు జట్లు కలిసి 549 రన్స్ చేసి.. చరిత్రలో ఇంకెవరూ లిఖించలేని సరికొత్త ఘనతను సృష్టించారు. ఈ మ్యాచ్ తర్వాత కోల్ కతా, రాజస్థాన్ తలపడ్డాయి. కోల్ కతా 223 రన్స్ చేసింది. రాజస్థాన్ ఎదుట 224 టార్గెట్ విధించింది. దీనిని ఛేదించడంలోనూ రాజస్థాన్ సరికొత్త రికార్డు సృష్టించింది. వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ రికార్డు స్థాయిలో సెంచరీ చేశాడు. 224 విజయ లక్ష్యాన్ని చేరుకొని.. రాజస్థాన్ జట్టుకు గెలుపును అందించాడు. ఇప్పటివరకు సగం లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇంతలోనే పాత రికార్డులు బద్దలయ్యాయి. కొత్త రికార్డులు నమోదయ్యాయి. కొన్ని జట్ల ఆట తీరు చూస్తుంటే మరెవరికీ సాధ్యం కాని రికార్డులు చరిత్రపుటల్లో స్థానం సంపాదించుకునే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.