LSG Vs CSK: మరో రసవత్తర పోరు.. గెలుపు ఎవరిది?

లక్నో జట్టు ఇటీవల మ్యాచులలో ఓటములు ఎదుర్కొంది. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 19, 2024 1:57 pm

LSG Vs CSK

Follow us on

LSG Vs CSK: ఐపీఎల్ 17వ సీజన్లో మరో రసవత్తర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. శుక్రవారం లక్నో వేదికగా చెన్నై, లక్నో జట్టు తలపడనున్నాయి. చెన్నై జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. లక్నో జట్టు ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. పాయింట్లు పట్టికలో తన మూడవ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక లక్నో జట్టు కోల్ కతా తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన లక్నో జట్టు.. మూడు ఓటములు, మూడు విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో లక్నో జట్టుకు విజయం ప్రస్తుతం అత్యవసరం. ఈ నేపథ్యంలో శుక్రవారం సొంత మైదానంలో జరిగే మ్యాచ్ పై లక్నో జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు ఈ మ్యాచ్లో విజయం సాధించి పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలోకి వెళ్లాలని చెన్నై జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో ఈ రెండు జట్ల బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే..

లక్నో

లక్నో జట్టు ఇటీవల మ్యాచులలో ఓటములు ఎదుర్కొంది. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి పడిపోయింది. గత రెండు మ్యాచ్లలో ఆ జట్టు ఆటగాళ్ల ఆట తీరు అత్యంత నాసిరకంగా ఉంది. ముఖ్యంగా కోల్ కతా తో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్, పూరన్ మాత్రమే రాణించారు. ఫిలిప్ సాల్ట్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినీస్, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్ వంటి వారు విఫలమయ్యారు. రాహుల్, పూరన్ ఆడకపోతే ఆ మ్యాచ్లో లక్నో జట్టు మరింత తక్కువ స్కోరు నమోదు చేసేది.

ఇక బ్యాటింగ్ ఇలా ఉందనుకుంటే బౌలింగ్ అత్యంత నాసిరకంగా ఉంది. కోల్ కతా తో జరిగిన మ్యాచ్లో లక్నో బౌలర్లు దారుణంగా బౌలింగ్ వేశారు. మోసిన్ ఖాన్ మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. సమర్ జోసెఫ్, కృనాల్ పాండ్యా, యష్ ఠాకూర్, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ వంటి వారు తమ స్థాయికి తగ్గట్టుగా బౌలింగ్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో చెన్నై జట్టుతో జరిగే శుక్రవారం నాటి మ్యాచ్లో వీరు చేసే బౌలింగ్ ప్రదర్శన పైనే లక్నో జట్టు విజయం ఆధారపడి ఉంది.

ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్ మాత్రమే రాణిస్తున్నారు. దేవదత్ పడిక్కల్, క్వింటన్ డికాక్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినీస్ వంటి వారు సత్తా చాటాల్సి ఉంది.

చెన్నై జట్టు

ఈ సీజన్లో చెన్నై జట్టు ఆటతీరు ఆశించినంత స్థాయిలోనే సాగుతోంది. హైదరాబాద్, ఢిల్లీ జట్ల మీద వరుస ఓటములతో ఆ జట్టు ఆటగాళ్లు ఒక్కసారిగా తమ ఆట తీరు మార్చుకున్నారు. బలమైన కోల్ కతా నైట్ రైడర్స్ పై 7 వికెట్లు, ముంబై ఇండియన్స్ జట్టు పై 20 పరుగుల తేడాతో వరుస విజయాలు సాధించారు. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. అయితే శుక్రవారం నాటి మ్యాచ్లో లక్నో జట్టుపై విజయం సాధించి, రెండవ స్థానంలోకి ప్రవేశించాలని చెన్నై జట్టు కోరుకుంటున్నది.

చెన్నై జట్టులో రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, మహేంద్ర సింగ్ ధోని మాత్రమే రాణిస్తున్నారు. అప్పుడప్పుడు రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర వంటి వారు మెరుపులు మెరిపిస్తున్నారు.. ఓపెనర్ అజింక్య రహానే ఇంతవరకు తన ఫామ్ అందుకోలేదు. అతని ఆట తీరు పట్ల జట్టు ఆందోళనగా ఉంది. రచిన్ రవీంద్ర నిలకడలేమి ఆ జట్టును ఇబ్బందికి గురి చేస్తోంది. డారి మిచెల్ కూడా టచ్ లోకి రావాల్సి ఉంది.

బౌలింగ్లో మతిషా పతీరణ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇటీవల ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తుషార్ దేశ్ పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్ మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. కీలకమైన వికెట్లు తీయలేకపోతున్నారు. రవీంద్ర జడేజా తన స్థాయికి తగ్గట్టుగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. పైగా అతడు ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. శార్దూల్ ఠాకూర్ కూడా తన లయను అందిపుచ్చుకోలేకపోతున్నాడు. వీరు ముగ్గురు టచ్ లోకి రావాలని చెన్నై జట్టు ఆశిస్తోంది.

ఇక ఈ రెండు జట్లు ఇప్పటివరకు మూడుసార్లు తలపడ్డాయి. చెరో మ్యాచ్ గెలిచాయి. ఒక మ్యాచ్ అననుకూల వాతావరణం వల్ల నిర్వహించలేదు.

ఇప్పటివరకు లక్నో మైదానంలో తొమ్మిది మ్యాచ్లు జరిగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు ఆరుసార్లు విజయం సాధించింది. చేజింగ్ జట్టు మూడుసార్లు విజయాన్ని దక్కించుకుంది. పవర్ ప్లే లో యావరేజ్ స్కోర్ 47 పరుగులుగా ఉంది. డెత్ ఓవర్లలో 42 పరుగులు చేసే అవకాశం ఉంది. ఈ మైదానంపై ఇప్పటివరకు అత్యధికంగా నమోదైన స్కోరు 199 పరుగులు. మైదానం ముందుగా పేస్ బౌలర్లకు అనుకూలిస్తే.. తర్వాత స్పిన్ బౌలర్లకు అనుకూలంగా మారుతుంది. గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం చెన్నై జట్టుకు 58 శాతం, లక్నో జట్టుకు 42 శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి.

జట్ల అంచనా ఇలా..

లక్నో

కేఎల్ రాహుల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, టర్నర్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, క్వింటన్ డికాక్, యష్ ఠాకూర్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, మార్కస్ స్టోయినీస్.

చెన్నై

రుతు రాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్య రహనే, రచిన్ రవీంద్ర, మహేంద్ర సింగ్ ధోని, మోయిన్ అలీ, శివం దుబే, రవీంద్ర జడేజా, మతిషా పతిరణ, శార్దుల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తుషార్ దేశ్ పాండే.