India Vs Bangladesh: వారిద్దరే కాకుండా రాహుల్ కూడా పూర్తి విఫలమయ్యాడు. ఈ దశలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మైదానంలోకి వచ్చారు.. వీరిద్దరూ ఏడో వికెట్ కు 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 339 రన్స్ చేసింది.. రవిచంద్రన్ అశ్విన్ (102*), రవీంద్ర జడేజా (86*) పరుగులు చేసి భారత జట్టును కాపాడారు. తొలి రెండు సెషన్లు బంగ్లా బౌలర్లు పై చేయి సాధిస్తే.. మధ్యాహ్నం నుంచి భారత బ్యాటర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఏడో వికెట్ కు 195 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. వాస్తవానికి భారత్ 144 పరుగుల వద్ద ఆరు వికెట్ల కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ భారత జట్టు బ్యాటింగ్ భారాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. బౌలర్ ఎవరనేది చూడకుండా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. చెత్త బంతులను బౌండరీలకు తరలించారు.. సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ.. బంగ్లా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ దశలోనే పలు రికార్డులను బద్దలు కొట్టారు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో రవిచంద్రన్ అశ్విన్ ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చెన్నైలోని చెపాక్ మైదానంలో వరుసగా రెండవ టెస్టు సెంచరీ సాధించాడు. ఈ దశలోనే రవిచంద్రన్ అశ్విన్ అనేక రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి నాలుగు సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో అతడు రెండవ స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు న్యూజిలాండ్ ఆటగాడు డానియల్ వెటోరి ఐదు సెంచరీలతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ ఆటగాడు కమ్రాన్ అక్మల్ మూడు సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. జాసన్ హోల్డర్ మూడు సెంచరీలు చేసి.. అక్మల్ తో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక వికెట్ల పరంగా చూసుకుంటే.. అహ్మదాబాద్ లో 2008లో భారత జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఆటగాడు డెల్ స్టేయిన్ (5/23) ఐదు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు తొలి రోజు టెస్టులో భారత జట్టుపై ఇతడిదే అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. అతని తర్వాత స్థానాన్ని హసన్ మహమూద్ ఆక్రమించాడు. చెన్నైలో జరుగుతున్న తొలి టెస్ట్ లో మహమూద్ (4/58) నాలుగు వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ (6), విరాట్ కోహ్లీ (6), గిల్(0), పంత్(39) ను మహమూద్ ఔట్ చేశాడు. ఐతే మహమూద్ అదే జోరును చివరి వరకు కొనసాగించలేకపోయాడు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More