Hardik Pandya Narasa Stankovic : సుదీర్ఘ ఉత్కంఠకు తెరపడింది. ఊహాగానం అనే చర్చకు ఫుల్ స్టాప్ పడింది. మొత్తానికి హార్దిక్ నోట విడాకులు అనే మాట వినిపించింది. విడిపోతున్నాం అనే పదం ధ్వనించింది. అటు నటాషా కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఫలితంగా హార్దిక్ – నటాషా నాలుగేళ్ల ప్రయాణానికి మధ్యలోనే ఎండ్ కార్డ్ పడింది. వాస్తవానికి విడాకుల విషయాన్ని హార్దిక్ పాండ్యా గురువారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు గానీ.. గత కొద్దిరోజులుగా అతడు హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. కానీ జనాలకే అర్థం కావడం లేదు. అటు నటాషా కూడా తన మనో గతాన్ని ప్రకటిస్తూనే ఉంది.. కాకపోతే దాన్ని పసిగట్టడంలో అటు మీడియా, ఇటు సోషల్ మీడియా వెనుకబడిపోయాయి
సెర్బియా దేశం నుంచి..
నటాషా సెర్బియా దేశానికి చెందిన మోడల్. తన కెరియర్ కోసం ముంబై వచ్చింది. ఈ క్రమంలో ఒక పార్టీలో హార్దిక్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది స్నేహంగా మారింది. కొద్దిరోజుల తర్వాత ఇద్దరు డేటింగ్ చేశారు. ఆ క్రమంలోనే నటాషా గర్బం దాల్చింది. ఆ తర్వాత హార్దిక్ వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన కొద్ది రోజులకే అగస్త్య జన్మించాడు. ఆ తర్వాత హార్దిక్ – నటాషా జీవితం మరింత అందంగా మారింది. అయితే వారి అన్యోన్యత ఎంతో కాలం సాగలేదు. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అవి చినికి చినికి గాలి వాన లాగా మారాయి. అంతిమంగా విడాకులకు దారితీసాయి.
ఇద్దరు ఎవరికి వారే విడిగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత.. విడాకులకు సంబంధించిన విషయాన్ని నేరుగా చెప్పకుండా.. పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ” నా ఆస్తి మొత్తం తల్లి పేరు మీద ఉంది. నేను ఎవరికీ భరణంగా రూపాయి కూడా ఇవ్వలేను. నేను ఉంటున్న ఇల్లు కూడా కిరాయిదే. నా పేరు మీద చిల్లిగవ్వ కూడా లేదు. అలాంటప్పుడు నన్ను డిమాండ్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదని” హార్దిక్ పాండ్యా అప్పట్లో ఓ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆ విషయం సంచలనంగా మారినప్పటికీ.. దాని వెనుక ఇంత కథ ఉందని ఎవరూ ఊహించలేదు. పైగా హార్దిక్ పాండ్యా ఇటీవల టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యాను ప్రాచీ సోలంకి అనే యువతీ కలిసింది. ఆ తర్వాత అతనితో చనువుగా ఫోటోలు దిగింది. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. టి20 వరల్డ్ కప్ హీరోను కలిసి ఫోటో దిగాను అంటూ కామెంట్ చేసింది. హార్దిక్ తో మాత్రమే కాకుండా అతని సోదరుడు కృనాల్ పాండ్యా, అతని భార్యతో కూడా ఫోటోలు దిగింది.
ఇక నటాషా కూడా హార్దిక్ పాండ్యా ఆడిన మ్యాచ్లకు హాజరు కాలేదు. అతడు ఐపీఎల్ లో ముంబై జట్టుకు కెప్టెన్ అయినప్పటికీ అభినందించలేదు. సోషల్ మీడియాలో హార్థిక్ పాండ్యాపై విపరీతమైన దాడి జరుగుతున్నప్పటికీ కనీసం సంఘీభావం ప్రకటించలేదు.. పైగా జిమ్ లో ఓ వ్యక్తి(దిశా పటాని మాజీ బాయ్ ఫ్రెండ్) తో చనువుగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశాయి. ఇక గురువారం తన కుమారుడు అగస్త్యతో కలిసి నటాషా సెర్బియా వెళ్ళిపోయింది. ఇందుకు నిదర్శనంగా సెర్బియా దేశం, విమానం, సొంత ఇల్లు ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అయితే అప్పటికి కూడా హార్దిక్ – నటాషా విడిపోలేదని అందరూ అనుకున్నారు. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా విడాకుల నిర్ణయాన్ని ప్రకటించాడు. దీంతో వారిద్దరూ విడిపోయారని.. ఎవరి దారులు వారు చూసుకున్నారని అభిమానులు ఒక అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో ధైర్యంగా ఉండాలని హార్దిక్ పాండ్యాకు సూచిస్తున్నారు.