IND VS BAN Test Match : టెస్ట్ క్రికెట్ లో భారత జట్టు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. ఓటమి చివరి అంచున నిలిచి.. కసి కొద్దీ ఆడి గెలుపును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో తనకంటూ పేజీలను లిఖించుకుంది.. బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా గురువారం చెన్నై వేదికగా మొదలైన తొలి మ్యాచ్ లో భారత్ 144/6 వద్ద నిలిచింది. ఆ తర్వాత ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది. 376 పరుగులకు ఆల్ అవుట్ అయింది. వాస్తవానికి 144 పరుగులు చేసిన భారత జట్టు.. మరో 50 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ దశలో భారత ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా 199 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. ఇండియాను కష్టాల నుంచి గట్టెక్కించారు. ఈ దశలో రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సొంత మైదానంలో వరుసగా రెండవ టెస్టు సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజా 14 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయినప్పటికీ.. అదిరిపోయే ఆట తీరు ప్రదర్శించాడు. వీరిద్దరి దూకుడు వల్ల భారత్ అత్యంత పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పుడు మాత్రమే కాదు పలు సందర్భాల్లో స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడి.. టెస్ట్ క్రికెట్లో సరికొత్త రికార్డులు సృష్టించింది.
ఆ చారిత్రక సందర్భాలు ఎప్పుడు చోటు చేసుకున్నాయంటే..
1971లో బ్రిడ్జ్ టౌన్ వేదికగా వెస్టిండీస్ జట్టుతో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఒకానొక దశలో 70 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారత జట్టు ఆటగాళ్లు మెరుగైన ఆట తీరు ప్రదర్శించి స్కోరును 371 పరుగుల దాకా తీసుకెళ్లారు. చివరి 4 వికెట్లకు 277 పరుగుల ను జత చేశారు.
2024 చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు స్కోర్ ఒక దశలో 144/ 6 వద్ద ఉండగా.. టీమిండియా ఆటగాళ్లు బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా బ్యాటింగ్ చేయడంతో భారత్ 376 పరుగులకు ఆలౌట్ అయింది. చివరి 4 వికెట్లకు భారత్ 232 పరుగులు జోడించింది.
2021 లో ఇంగ్లాండ్ జట్టుతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ 146/6 వద్ద ఉండగా.. తర్వాత పుంజుకొని 365 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. చివరి 4 వికెట్లకు భారత్ 219 పరుగులు జత చేసింది.
1996 లో కోల్ కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ 119/6 వద్ద ఉన్నప్పుడు.. చివరి 4 వికెట్లకు 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేసింది. దీంతో భారత్ 329 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
1964లో ఇంగ్లాండ్ జట్టుతో బ్రబౌర్న్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ 99/6 వద్ద ఉండగా.. చివరి 4 వికెట్లకు 201 పరుగుల భాగస్వామాన్ని నమోదు చేసింది. ఫలితంగా భారత్ 3 పరుగులకు ఆలౌట్ అయింది..
2010లో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 65 పరుగులకు ఆరు వికెట్ల కోల్పోయింది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు సత్తా చాటి 201 పరుగులు చివరి 4 వికెట్లకు నమోదు చేయడంతో, భారత్ 266 పరుగులకు ఆలౌట్ అయింది.