India vs England 2nd Test: ఐదుగురు బ్యాటర్లు సెంచరీలు చేశారు. బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లీష్ జట్టు ఎదుట 300+ రన్స్ టార్గెట్ విధించారు.. అయినప్పటికీ గెలవలేదు. గెలిచే ముందు బోల్తా పడింది. వాస్తవానికి టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇన్ని ఘనతలు నమోదైనప్పటికీ ఓడిపోవడం పట్ల టీమిండియా ప్లేయర్ల పై విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో టీమిండియా అత్యంత దారుణమైన ప్రదర్శన చేసింది. దీంతో బుధవారం నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదికగా ప్రారంభమయ్యే రెండవ టెస్టులో టీమిండియా ఎలా ఆడుతుందనే సందేహాలు అభిమానులలో వ్యక్తమవుతున్నాయి.. లీడ్స్ మైదానంలో బుమ్రా అదరగొట్టినప్పటికీ.. మిగతా బౌలర్లు చేతులెత్తేశారు. ఏ మాత్రం సత్తా చూపించలేక ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దాసోహం అయ్యారు. ఇక రెండవ ఇన్నింగ్స్ లోనూ బుమ్రా ఆకట్టుకోలేదు. పైగా అతని మీద ఒత్తిడి పెరిగిపోవడంతో కొన్ని బంతులను లయతప్పి వేశాడు.
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్లు అదరగొట్టారు.. రెండవ ఇన్నింగ్స్ లోనూ జైస్వాల్, గిల్ విఫలమైనప్పటికీ.. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఆకట్టుకున్నారు. అయితే తొలి ఇన్నింగ్స్ లో మిడిల్, లోయర్ ఆర్డర్ విఫలమైంది. ఇక బౌలింగ్ కూడా అత్యంత నాసిరకంగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. టీమిండియా ఇలా వైఫల్యాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో.. ఇంగ్లీష్ జట్టు వాటిని తనకు అనుకూలంగా మార్చుకుంది. అంతేకాదు టీమిండియా వైఫల్యాల మీద పదేపదే దాడి చేస్తూ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం రెండవ టెస్టు జరుగుతున్న ఎడ్జ్ బాస్టన్ లో ఇంతవరకు టీం ఇండియా ఒక్క విజయం కూడా అందుకోలేదు.. క్రితం జరిగిన మ్యాచ్ ను భారత్ డ్రా చేసుకుంది..
ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గడచిన 10 టెస్టులలో ఈ పిచ్ మీద తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 334 పరుగులుగా ఉంది. ఈ పిచ్ పై పేస్ బౌలర్లు ముందుగా ప్రభావం చూపిస్తారు. ఆ తర్వాత స్పిన్ బౌలర్లు అదరగొడతారు. అయితే తొలి రోజు ఇక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
రెండు జట్ల అంచనా ఇది
భారత్: గిల్(కెప్టెన్), జడేజా, సిరాజ్, ప్రసిధ్, నితీష్/ శార్దుల్, కులదీప్/ వాషింగ్టన్ సుందర్, రాహుల్, జైస్వాల్, సాయి సుదర్శన్, బుమ్రా/ ఆకాష్.
ఇంగ్లాండ్
స్టోక్స్ (కెప్టెన్), కార్స్, బషీర్, టంగ్, క్రాలే, పోప్, రూట్, డకెట్, బ్రూక్, స్మిత్, వోక్స్.