https://oktelugu.com/

Ireland Vs America: ఐర్లాండ్, అమెరికా జట్ల మధ్య మ్యాచ్ కు వర్షం ముప్పు.. రద్దయితే పాకిస్తాన్ ఇంటికే..

తొలి మ్యాచ్ అమెరికా చేతిలో సూపర్ ఓవర్ లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఆ తర్వాత భారత జట్టుపై ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 14, 2024 / 05:58 PM IST

    Ireland Vs America

    Follow us on

    Ireland Vs America: టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఏమంత బాగోలేదు. అమెరికా మీద ఓడిపోయిన ఆ జట్టు.. భారత్ పై కూడా పరాజయం పాలైంది. చివరగా కెనడాపై విజయం సాధించింది. అయినప్పటికీ ఆ జట్టు సూపర్ -8 కు దర్జాగా చేరుకుంటుందనే నమ్మకం లేదు.. చివరి మ్యాచ్లో ఐర్లాండ్ పై గెలిచి.. సూపర్ -8 చేరుకోవాలని పాకిస్తాన్ భావిస్తుంటే.. ఆ ఆశలు మొత్తం నీరు గారే ప్రమాదం ఉంది. గ్రూప్ – ఏ లో పాకిస్తాన్ జట్టు ఉండగా.. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడగా.. కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. పాకిస్తాన్ ఖాతాలో రెండు పాయింట్లు ఉండగా, ఆ జట్టు +0.191 నెట్ రన్ రేట్ తో కొనసాగుతోంది. ఇక పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

    తొలి మ్యాచ్ అమెరికా చేతిలో సూపర్ ఓవర్ లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఆ తర్వాత భారత జట్టుపై ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెనడాపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ జట్టుపై సాగించిన విజయం ద్వారా రన్ రేట్ మెరుగుపరచుకుంది. సూపర్ -8 పై ఆశలు పెంచుకుంది. అయితే ఆ జట్టు తదుపరి దశకు వెళ్లాలంటే కచ్చితంగా ఫ్లోరిడాలోని లాండర్ హిల్ ప్రాంతంలో ఆదివారం ఐర్లాండ్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి. ఇది మాత్రమే కాకుండా శుక్రవారం ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడిపోవాల్సి ఉంటుంది. మ్యాచ్ ఫలితాలు ఇలా వస్తేనే నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా పాకిస్తాన్ సూపర్ -8 కు చేరుకుంటుంది. ప్రస్తుతం అమెరికా జట్టు కంటే మెరుగైన నెట్ రన్ రేట్ కలిగి ఉన్నప్పటికీ.. పాకిస్తాన్ సూపర్ -8 కు వెళ్లాలంటే ఐర్లాండ్ జట్టుతో జరిగే మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి. అయితే ఫ్లోరిడాలో మ్యాచ్ జరిగేందుకు పరిస్థితులు సజావుగా లేవు. కొన్ని రోజులుగా అక్కడ విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల వరదలు ముంచెత్తుతున్నాయి.

    ఇక శుక్రవారం అమెరికా – ఐర్లాండ్ జట్టు మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈరోజు కూడా వర్షం కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కేవలం ఈ మ్యాచ్ మాత్రమే కాకుండా, ఇదే వేదికపై శనివారం ఇండియా, కెనడా జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆదివారం పాకిస్తాన్, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. అయితే అమెరికా, ఐర్లాండ్ లేదా పాకిస్తాన్, ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్లో ఏ ఒక్కటి రద్దయినా పాకిస్తాన్ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మ్యాచ్ రద్దు అయితే రెండు జట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు. ఈ ప్రకారం అమెరికా ఖాతాలో ఐదు పాయింట్లు ఉంటాయి. ఆ తర్వాత పాకిస్తాన్ ఐర్లాండ్ జట్టుపై విజయం సాధిస్తే.. నాలుగు పాయింట్లతోనే లీగ్ దశలోనే ఆ జట్టు ప్రయాణం ముగుస్తుంది. ఒకవేళ ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడిపోయి, ఐర్లాండ్ జట్టుతో ఆడే మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే పాకిస్తాన్ కు కష్టమే. ఆ సందర్భంలో అమెరికా నాలుగు, పాకిస్తాన్ మూడు పాయింట్ల తోనే లీగ్ దశను ముగించాల్సి ఉంటుంది.