Champions Trophy 2025: టీ 20 ప్రపంచ కప్ లో భాగంగా అమెరికాలోని న్యూయార్క్ వేదికగా భారత్ – పాకిస్తాన్ పరస్పరం తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.. అనుక్షణం ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్.. ప్రేక్షకులకు అసలైన టీ – 20 మజా అందించింది. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడే అవకాశం లేదు. కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నీలలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడేందుకు అవకాశం ఉంది. అయితే ఇటీవల టీ -20 వరల్డ్ కప్ లో పరస్పరం తలపడిన ఈ రెండు జట్లు.. మరోసారి ఢీకొనబోతున్నాయి.. ఇంతకీ ఏ టోర్నీ లోనంటే..
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ..
పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించనున్నారు.. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఇప్పటికే ప్రతిపాదిత షెడ్యూల్ ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. 15 మ్యాచ్ లు ఆడతాయి. అయితే పాకిస్తాన్ లో భారత్ ఆడుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్ జట్టుతో ఏర్పడిన ఉద్రిక్తతల వల్ల భారత్ ఆ దేశంలో ఆడకపోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ టీమిండియా ఆడకపోతే టోర్నమెంట్ నిర్వహణకు ఐసీసీ హైబ్రిడ్ మోడల్ ఎంచుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది ఆసియా కప్ ను అరబ్ దేశాల వేదికగా నిర్వహించారు..
పాక్ లో నిర్వహిస్తే… ఇదీ పరిస్థితి
ఒకవేళ పాకిస్తాన్ దేశంలోనే టోర్నీ నిర్వహిస్తే.. టీమిండియాతో తలపడే మ్యాచ్ కు లాహోర్ ను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. మిగతా మ్యాచ్ లు కరాచీ, రావల్పిండి మైదానాలలో నిర్వహిస్తారు. లాహోర్ లో ఏడు, రావాల్పిండి లో ఐదు, కరాచీలో మూడు మ్యాచ్ లు నిర్వహిస్తారు.. ఫిబ్రవరి 19 బుధవారం నాడు కరాచీ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. మార్చి 9 ఆదివారం లాహర్ లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్ లో టోర్నీ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఆటగాళ్ల సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నోరు మెదపడం లేదు. ఐసీసీ హైబ్రిడ్ మోడల్ గురించి మాట్లాడటం లేదు.
బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గితే..
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒత్తిడికి తలొగ్గితే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వేదిక మారే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.. దీంతో బీసీసీఐ దయా దక్షిణ్యాల మీదే పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ఆధారపడి ఉంది. 2017 ఓవల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ – పాకిస్తాన్ తలపడగా.. పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడిపోయిన భారత జట్టు పాకిస్తాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. అనంతరం భారత్ 30.3 ఓవర్లలోనే 158 పరుగులకే కుప్పకూలింది. నాటి నుంచి పాకిస్తాన్ పై రివెంజ్ తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది.