https://oktelugu.com/

Rohit Sharma: నాడు అనామకంగా నిలబడ్డాడు.. నేడు ప్రపంచాన్ని చేతిలో పట్టుకున్నాడు..

2007లో టీమిండియా టి20 వరల్డ్ కప్ విజేతగా ఆవిర్భవించింది. దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించిన తొలి ఎడిషన్ లో ధోని ఆధ్వర్యంలో టీమిండియా విజయాన్ని సాధించింది. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై ఉత్కంఠ విజయాన్ని సాధించి ట్రోఫీని దక్కించుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 5, 2024 / 04:46 PM IST

    Rohit Sharma

    Follow us on

    Rohit Sharma: ఎన్నో ఉలి దెబ్బలు తింటేనే శిల శిల్పమవుతుంది. కొలిమిలో మండి.. సుత్తె దెబ్బలు తిన్న తర్వాతే బంగారం ఆభరణం అవుతుంది.. అనేక కోతల తర్వాతే వజ్రం ధగ ధగ మెరుస్తుంది. ఎన్నో కష్టాలు పడితేనే ఒక మనిషిని విజయం వరిస్తుంది. ఆ విజయం ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే.. ప్రపంచాన్ని సరికొత్తగా పరిచయం చేస్తుంది. అపరిమితమైన సంతోషాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఈ అనుభూతిని అనుభవిస్తున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

    2007లో టీమిండియా టి20 వరల్డ్ కప్ విజేతగా ఆవిర్భవించింది. దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించిన తొలి ఎడిషన్ లో ధోని ఆధ్వర్యంలో టీమిండియా విజయాన్ని సాధించింది. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై ఉత్కంఠ విజయాన్ని సాధించి ట్రోఫీని దక్కించుకుంది. 2007లో టీ 20 వరల్డ్ కప్ గెలిచిన టీం ఇండియాలో రోహిత్ శర్మ కూడా ఒక సభ్యుడు. తుది జట్టుకు ఎంపికైనప్పటికీ.. అతడికి ఆడే అవకాశం లభించలేదు. దీంతో రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. డ్రింక్స్ అందించే బాయ్ అవతారమెత్తాడు. తనకు తుది జట్టులో ఆడే అవకాశం రాకపోయినప్పటికీ.. రోహిత్ ఏమాత్రం బాధపడలేదు. పైగా టీమిండియా ఆటగాళ్లు మైదానంలో చేస్తున్న ప్రదర్శనను తనవి తీరా ఆస్వాదించాడు.. టీమిండియా కప్ గెలిచిన తర్వాత ఆ సంబరాలలో తాను ఒక సభ్యుడయ్యాడు. ట్రోఫీ అందుకున్న సందర్భంలో కింది వరుసలో కూర్చుని.. డౌన్ టు ఎర్త్ అని నిరూపించాడు.

    సరిగ్గా 14 సంవత్సరాల తర్వాత వెస్టిండీస్ – అమెరికా దేశాల వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా విజయంలో రోహిత్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సూపర్ -8 లో ఆస్ట్రేలియా, సెమీస్ లో ఇంగ్లాండ్ జట్లపై అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. ఫైనల్ మ్యాచ్లో 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయినప్పటికీ.. ఆటగాళ్లల్లో అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పాడు.

    టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత..ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటోను పోస్ట్ చేశాడు. 2007లో టీమ్ ఇండియాలో అనామక ఆటగాడిగా ఉన్న రోహిత్ శర్మను.. 2024 లో టి20 వరల్డ్ కప్ చేతుల్లో పట్టుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పోల్చుతూ.. ఆ ఫోటో పోస్ట్ చేశాడు. ” నాడు అనామక ఆటగాడిగా ఉన్నాడు. నేడు ప్రపంచాన్ని చేతిలో పట్టుకున్నాడు” అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. “విజయం ఒక రోజులోనే దరిచేరదు. 14 ఏళ్ళు ఎదురు చూస్తే రోహిత్ శర్మకు ఈ అపూర్వ విజయం లభించింది. ప్రస్తుతం ఈ విజయాన్ని అతడు ఆస్వాదిస్తున్నాడు. అతని నాయకత్వంలో టీమిండియా సాధించిన గెలుపును దేశం మొత్తం అభినందిస్తోందని” ఈ ఫోటోను చూసి నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.