Rohit And Virat: “రో.కో” వైఫల్యమే ఓటమికి కారణం.. గౌరవంగా జట్టు నుంచి తప్పుకోవడమే శరణ్యం..

15 సంవత్సరాల కాలంగా వారిద్దరు టీమిండియా క్రికెట్ కు ప్రధాన భూమికలుగా ఉన్నారు. క్రికెట్ లో ఫార్మాట్ తో సంబంధం లేకుండా దూకుడుగా ఆడే తత్వం ఒక ఆటగాడిదైతే..పిచ్, బౌలర్ అనే పారామీటర్స్ తో సంబంధం లేకుండా ఆడే ఆటగాడు మరొకరు.. వారే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ..

Written By: Anabothula Bhaskar, Updated On : November 4, 2024 8:42 am

Rohit And Virat

Follow us on

Rohit And Virat: వీరిద్దరూ ఆధునిక క్రికెట్లో సంచలనాలు సృష్టించారు. టీమిండియా కు అద్భుతమైన విజయాలు అందించారు.. కానీ వీరిద్దరూ ఇటీవల న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ లో దారుణంగా విఫలమయ్యారు.. వీరిద్దరి వైఫల్యం టీమిండియా విజయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. వీరిద్దరి వల్లే టీమిండియా ఓడిపోయింది అని చెప్పడం అతిశయోక్తి కాకమానదు. న్యూజిలాండ్ సిరీస్లో రోహిత్ 6 ఇన్నింగ్స్ లు ఆడాడు. మొత్తం 15. 17 సగటుతో 91 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ కోహ్లీ 15.53 సగటుతో 93 పరుగులు మాత్రమే చేశాడు. ఇక గత పది ఇన్నింగ్స్ లు పరిశీలిస్తే రోహిత్ గొప్పగా బ్యాటింగ్ చేసిన దాఖలాలు లేవు. 6, 5, 23, 8, 23, 2, 52, 0, 8, 18, 11 పరుగులు మాత్రమే చేశాడు.. విరాట్ కోహ్లీ 6, 17, 47, 29, 0, 70, 1, 17, 4, 1 రన్స్ చేశాడు. వాస్తవానికి వీరి బ్యాటింగ్ శైలి తెలిసినా ఏ బౌలర్ అయినా సరే ఇలా ఆడతారని అస్సలు అనుకోరు. అనామక బౌలర్లు సైతం వీరిని అవుట్ చేయడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గిల్, జైస్వాల్, పంత్ వంటి యువ ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. వీరిద్దరు మాత్రం పదేపదే తమ బలహీనతను బయట పెట్టుకుంటున్నారు. అత్యంత చెత్త షాట్లు ఆడుతూ వెంటనే వెళ్ళిపోతున్నారు.. భారత్ తో ఆడే టెస్ట్ సిరీస్ కు ముందు న్యూజిలాండ్ శ్రీలంక పై రెండు టెస్టులు ఆడింది. అందులో కివీస్ స్పిన్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.. భారత్ లో మాదిరిగానే శ్రీలంకలోనూ పిచ్ లు ఉంటాయి.. అయితే వాటిపై కివీస్ బౌలర్లు సత్తా చాటడం విశేషం.

సాంట్నర్ స్థాయిలో కాకపోయినప్పటికీ..

సాంట్నర్.. పూణే టెస్టులో టీమిండియా టాప్ ఆర్డర్ ను వణికించాడు. అద్భుతమైన బంతులు వేస్తూ చుక్కలు చూపించాడు.. పూణే టెస్ట్ గెలిచిన నేపథ్యంలో సాంట్నర్ ను న్యూజిలాండ్ జట్టు విశ్రాంతి ఇచ్చింది. మొదటి స్థానంలో అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ వంటి వారికి అవకాశం ఇచ్చింది. అయితే వీరి బౌలింగ్ ఎదుర్కోవడానికి రోహిత్, విరాట్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముందు టీమిండియా దారుణమైన ఓటమి ని స్వదేశం వేదికగా చవిచూసిన నేపథ్యంలో.. రోహిత్, విరాట్ కోహ్లీ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది.. విదేశాలపై చతికిల పడినప్పటికీ.. స్వదేశంలో గొప్పగా ఆడతారు కాబట్టి.. అభిమానులు మన ఆటగాళ్లను ఆకాశానికి ఎత్తేవారు. న్యూజిలాండ్ సిరీస్లో దారుణంగా ఆడటాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నారు. సిరీస్ ముగిసిన నేపథ్యంలో రోహిత్, విరాట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. “త్వరలో ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. ఆ సిరీస్ లో కూడా ఇలానే ఆట తీరు ప్రదర్శిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్లే రోహిత్, విరాట్ జట్టు నుంచి గౌరవంగా తప్పుకుంటే మంచిదని” అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.