https://oktelugu.com/

Mike Tyson : మైక్ టైసన్ అంటే ఉక్కు కండలు.. పిడి గుద్దులు మాత్రమే కాదు.. చావు చివరి దాకా వెళ్లి వచ్చిన మనిషి కూడా..

మైక్ టైసన్.. ఈ పేరు చెప్తే ఉక్కు కండరాలు గుర్తుకొస్తాయి. ప్రత్యర్థి పై సంధించిన పిడుగుద్దులు జ్ఞాపకం వస్తాయి. బౌట్ లో దిగితే అతడు గట్టిగా మాట్లాడతాడు. ప్రత్యర్థి పై బూతుల వర్షం కురిపిస్తాడు. అయితే అలాంటి మైక్ చావు చివరిదాకా వెళ్లి వచ్చాడు. ఈ విషయం అతడే చెప్పాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : November 17, 2024 6:13 pm
Mike Tyson

Mike Tyson

Follow us on

Mike Tyson : బాక్సింగ్ లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గా మైక్ టైసన్ కు పేరుంది. బాక్సింగ్ క్రీడలో అతడు ఎన్నో రికార్డులు సృష్టించాడు.. మరెన్నో బెల్ట్ లను పొందాడు. అందువల్లే సంవత్సరాలుగా బాక్సింగ్ క్రీడలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నాడు. అయితే ఇటీవల తనకంటే వయసులో చాలా చిన్నవాడైన 27 సంవత్సరాల జేక్ పాల్ చేతిలో 58 సంవత్సరాల టైసన్ ఓడిపోయాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. టైసన్ ఓడిపోవడంతో రకరకాల విమర్శలు వ్యక్తమయ్యాయి. ” టైసన్ గొప్పతనం తగ్గిపోయింది. అతడి సామర్థ్యం క్రమేపి కనుమరుగవుతోంది. అతడి దృఢత్వం సన్నగిల్లుతోంది. ఒకప్పటిలాగా అతడు బౌట్ లో చెలరేగడం లేదు. ప్రత్యర్థి పై పిడుగుద్దుల వర్షం కురిపించడం లేదు. వయసు పైబడుతోంది కాబట్టి.. అతడి శక్తి యుక్తులు కూడా తగ్గిపోతున్నాయని” సామాజిక మాధ్యమాలలో బాక్సింగ్ ప్రేమికులు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై టైసన్ స్పందించక తప్పలేదు. ఈ క్రమంలో ట్విట్టర్ ఎక్స్ లో అతడు ఒక సుదీర్ఘ వీడియో పోస్ట్ చేశాడు.

ఓటమి ఎలాంటిదైనా..

“ఓటమి అనేది బాధాకరం. అది ఎవరికైనా సరే అలాంటి అనుభవాన్నే ఇస్తుంది. బాక్సింగ్ లోకి రావడం ఇదే చివరిసారి కావచ్చు. దానికి పెద్దగా బాధ లేదు. గత ఏడాది జూన్ నెలలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాను. చావు చివరిదాకా వెళ్లి వచ్చాను. వైద్యులు నాకోసం 8సార్లు రక్తమార్పిడి చేశారు. 12 కిలోల వరకు బరువు తగ్గాను. మళ్లీ నా ఆరోగ్యాన్ని పొందడానికి తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. అయితే అంతిమంగా నా అనారోగ్యంపై నేను విజయం సాధించాను. మళ్లీ నేను నా పూర్వ ఆకృతిని దాల్చాను. డల్లాస్ లోని కౌబాయ్ స్టేడియంలో.. నాకంటే వయసులో చాలా చిన్నవాడైన యువకుడితో నేను పోరాడాల్సి వచ్చింది. నేను 8 రౌండ్ల పాటు పోరాడాను. దానిని నా పిల్లలు దగ్గరుండి చూశారని” టైసన్ వ్యాఖ్యానించాడు. అయితే ఈ మ్యాచ్లో జేక్ విజేతగా నిలిచిన తర్వాత.. తనదైన స్పందన తెలియజేశాడు..” ఈ సమయంలో రికార్డులు ఒక్కసారిగా బద్దలయ్యాయి. మైక్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నంబర్లు తప్పుగా ఉండవు. రికార్డులు భద్రంగానే ఉంటాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటన వస్తుంది. ఈ సందర్భంగా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని” జేక్ వ్యాఖ్యానించాడు.. ఈ మ్యాచ్ ఏటి అండ్ టి స్టేడియంలో జరిగింది. దీనిని 72,300 మంది ప్రత్యక్షంగా చూశారు. టీవీలలో ఆరు కోట్ల మంది వీక్షించారు. నెట్ ఫ్లిక్స్ లో ఇది లైవ్ స్ట్రీమింగ్ అయింది. వీక్షకుల తాకిడి పెరగడంతో సర్వర్ డౌన్ అయింది. అయితే ఈ మ్యాచ్ కు ముగ్గురు న్యాయ నిర్నేతలుగా వ్యవహరించారు. 80-72 తో ఒకరు, మరో ఇద్దరు 79-73 తో జేక్ ను విజేతగా ప్రకటించారు. అయితే అతిగా మద్యం తాగడం, మాంసాన్ని తినడం వల్ల టైసన్ అల్సర్ వ్యాధికి గురయ్యాడు. కొంతకాలంగా దాని నివారణ కోసం అతడు మందులు వాడుతున్నాడు. అయితే ఇటీవల ఆ వ్యాధి తిరగబెట్టడంతో.. అతడు చావు చివరి అంచుల దాకా వెళ్లి వచ్చాడు.