WTC Final – Ravichandran Ashwin : డబ్ల్యూటీసీ ఫైనల్ లో అందుకే స్థానం దక్కలేదు.. అసలు నిజం చెప్పిన రవిచంద్రన్ అశ్విన్..!

డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ తుది జట్టులో అశ్విన్ సభ్యుడిగా లేకపోవడానికి మాజీ క్రికెటర్లు తీవ్రంగా తప్పుపట్టారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ సహా చాలామంది మాజీ క్రికెటర్లు అశ్విన్ ను తుది జట్టులో నుంచి తప్పించడాన్ని మేనేజ్మెంట్ ను తీవ్రంగా ప్రశ్నించారు.

Written By: BS, Updated On : June 16, 2023 10:20 am
Follow us on

WTC Final – Ravichandran Ashwin : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఓటమి తర్వాత టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలిసారి స్పందించాడు. ఈ మ్యాచ్ లో అశ్విన్ ను జట్టులోకి తీసుకోకపోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. రోహిత్ చేసిన తప్పిదం భారత జట్టు ఓటమికి కారణమైందంటూ పలువురు పెదవి విరిచారు. అయితే, వీటన్నింటిపైనా తాజాగా రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడారు. ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న జట్టులో తనకు స్థానం లేదని 48 గంటల ముందే తెలుసుకున్నట్లు రవిచంద్ర అశ్విన్ ప్రకటించాడు.

ప్రపంచ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఆడించలేదు. ఈ నిర్ణయం పట్ల అన్ని రకాలుగా విమర్శలు వ్యక్తుమయ్యాయి. ఇదే జట్టు ఓటమికి కారణమైందంటూ పలువురు మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై తాజాగా రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ ఒకరకంగా ఆవేదనను వ్యక్తం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో జట్టులో భాగస్వామినై టైటిల్ గెలవాలని భావించానని చెప్పాడు. అయితే, దురదృష్టవశాత్తు తనకు ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆడే అవకాశం రాలేదని, ఈ విషయం తనకు ముందే తెలుసునని స్పష్టం చేశాడు.
టైటిల్ గెలవాలని ఆకాంక్షించిన ప్రయోజనం లేదు..
తనను జట్టులోకి తీసుకోకపోయినప్పటికీ భారత జట్టు టైటిల్ గెలవాలని ఎంతగానో ఆకాంక్షించానని ఈ సందర్భంగా అశ్విన్ పేర్కొన్నాడు. డబ్ల్యూటీసి ఫైనల్ కు వెళ్లేంత వరకు భారత ప్రయాణంలో కీలక భాగస్వామిగా ఉన్నానని, అయితే, ఫైనల్ లో అవకాశం రాకపోవడం దురదృష్టకరంగా వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ రవీంద్ర జడేజాతో భారత జట్టు ఆడిన విషయం తెలిసిందే. అనేక మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా జట్టుపై అశ్విన్ పై చేయి సాధించినప్పటికీ తుది జట్టులోకి తీసుకోకపోవడం అనేక విమర్శలకు కారణమైంది. ఈ విధంగా కీలకమైన మ్యాచుల్లో అశ్విన్ ను ఆడించకపోవడం ఇదే తొలిసారి కాదు. 2021లో బర్మింగ్ హోమ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ ఫైనల్ మ్యాచ్ లోనూ అశ్విన్ ను ఆడించలేదు. అలాగే, 2021- 22లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అశ్విన్ ను ఒక్క మ్యాచ్ లో కూడా భారత జట్టు ఆడించలేదు.
టీమ్ మేనేజ్మెంట్ పిలుపును ముందే గ్రహించా..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు తనను డ్రాప్ చేయమని టీమ్ మేనేజ్మెంట్ పిలుపును తాను ముందుగానే గ్రహించినట్లు వివరించాడు. తాను ఆడడానికి ఎక్కువగా ఇష్టపడతానని ఎందుకంటే ఫైనల్ కు చేరుకోవడంలో తన పాత్ర ఎంతో కీలకంగా పోషించినట్లు వివరించాడు. చివరి ఫైనల్ లో కూడా తాను నాలుగు వికెట్లు సాధించి అద్భుతంగా బౌలింగ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు అశ్విన్. 2018-19 నుంచి తన ఓవర్సీస్ బౌలింగ్ అద్భుతంగా ఉందని, కానీ ఈ విషయాలను మేనేజ్మెంట్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరిసారి తాము ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు 2-2తో సిరీస్ డ్రా చేసామని, అప్పుడు కూడా నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ కలయికతో ముందుకు వెళ్లామని, దానినే ఇక్కడ అమలు చేసినట్లు అర్థమైంది అని అశ్విన్ వివరించాడు. ఫైనల్ మ్యాచ్ లో తాను లేకపోయినప్పటికీ సహచరులను అభినందిస్తూ విజయం సాధించాలన్న ఆకాంక్షతో ట్వీట్ కూడా చేశాడు అశ్విన్.
అశ్విన్ లేకపోవడాన్ని తప్పు పట్టిన మాజీలు..
డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ తుది జట్టులో అశ్విన్ సభ్యుడిగా లేకపోవడానికి మాజీ క్రికెటర్లు తీవ్రంగా తప్పుపట్టారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ సహా చాలామంది మాజీ క్రికెటర్లు అశ్విన్ ను తుది జట్టులో నుంచి తప్పించడాన్ని మేనేజ్మెంట్ ను తీవ్రంగా ప్రశ్నించారు. 2023లో నాలుగు టెస్టుల్లో 18 కంటే తక్కువ సగటుతో 25 వికెట్లు తీయడంతోపాటు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని గెలవడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. 2020-21లో ఆస్ట్రేలియాలో భారత్ సంచలన విజయం సాధించడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్ ల్లో 12 వికెట్లు తీశాడు. ఇకపోతే ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో దిండిగల్ డ్రాగన్స్ తరఫున రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్నాడు.