Zhang Zhi Jie: బ్యాడ్మింటన్ ఆడుతుండగా.. ఒక్కసారిగా కుప్పకూలాడు..

ఢిల్లీ వేదికగా ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు మొదలయ్యాయి. ఈ పోటీలలో పాల్గొనేందుకు చైనాకు చెందిన 17 సంవత్సరాల సెట్లర్ జాంగ్ జిజీ వచ్చాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 2, 2024 8:16 am

Zhang Zhi Jie

Follow us on

Zhang Zhi Jie: కరోనా తర్వాత.. మనుషుల ఆరోగ్యాల్లో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు.. ఇటీవల ఇతర సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా ఈ గుండెపోటు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా 25 సంవత్సరాల లోపు యువతీ యువకులు గుండెపోటు మరణాలకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ పోటీలో ఆడుతున్న 17 సంవత్సరాల ఆటగాడు మైదానంలో కుప్పకూలిపోయాడు.

ఢిల్లీ వేదికగా ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు మొదలయ్యాయి. ఈ పోటీలలో పాల్గొనేందుకు చైనాకు చెందిన 17 సంవత్సరాల సెట్లర్ జాంగ్ జిజీ వచ్చాడు.. ఆదివారం రాత్రి జపాన్ ఆటగాడు కజుమాతో సింగిల్స్ పోటీలో తలపడ్డాడు. ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా ఆడారు.. తొలి గేమ్ లో 11-11 తో సమానంగా నిలిచారు. ఇదే సమయంలో జాంగ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో టోర్నీ నిర్వాహకులు అతడికి ప్రధమ చికిత్స చేశారు. అంబులెన్స్ ద్వారా దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు కన్నుమూశాడు. తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల అతడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. “మేము అతడిని కాపాడాలనుకున్నాం. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతడికి ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో చనిపోయాడని” ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.

మరోవైపు జాంగ్ కన్నుమూసిన నేపథ్యంలో భారత ఏస్ షట్లర్ పీవీ సింధు స్పందించింది. ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేసింది. ఈ వార్తతో తన గుండె ముక్కలైందని బాధపడింది. ” చైనాకు చెందిన బ్యాడ్మింటన్ యువ ఆటగాడు ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్ సందర్భంగా గుండెపోటుతో మరణించాడని తెలియగానే.. నా హృదయం ద్రవించి పోయింది. ఇంతటి కష్టకాలంలో అతని కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నా. అతని కుటుంబానికి నా తరఫున సానుభూతి వ్యక్తం చేస్తున్నా. అద్భుతమైన ప్రతిభావంతుడిని ఈ క్రీడా ప్రపంచం కోల్పోయింది.. అతడి ఆత్మకు శాంతి కలగాలి.. ఇంతటి విపత్కర పరిస్థితిలో అతని కుటుంబం గుండె ధైర్యం చేసుకోవాలని” పీవీ సింధు పేర్కొంది. జాంగ్ మృతి నేపథ్యంలో అతడికి సంతాపంగా ఒకరోజు పోటీలను నిర్వహించలేదు. ఆ తర్వాత షెడ్యూల్ మార్చి టోర్నీ నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు.