Speaker Om Birla: 18వ లోక్ సభ కొలువుదీరిందో లేదో.. గరం గరం చర్చ మొదలైంది. ఎన్నికల్లో గణనీయమైన సీట్లను సాధించడంతో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం నుంచే ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రిపై ఎటాక్ మొదలుపెట్టారు. ఏకంగా పార్లమెంట్లోకి హిందూ దేవతామూర్తులు చిత్రపటాలు తీసుకెళ్లి నరేంద్ర మోదీని ఘాటుగా విమర్శించారు. చివరికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ను కూడా వదిలిపెట్టలేదు.. “నరేంద్ర మోదీ కి మీరెందుకు నమస్కరిస్తున్నారంటూ” ఆరోపించారు.. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతల మైక్ లు కట్ చేస్తున్నారంటూ ఆరోపించారు.. ఇది రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చకు దారి తీసింది. దీంతో ఓం బిర్లా స్పందించాల్సి వచ్చింది.
“ఇది సభాపతి గౌరవానికి సంబంధించిన విషయం.. రాహుల్ గాంధీ లాంటి సీనియర్ పార్లమెంటు నాయకుడు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇతర విషయాలపై సమయం వెచ్చించి.. సభా కాలాన్ని వృధా చేయకుండా సభ్యులు ప్రజల సమస్యలపై మాట్లాడాలని” ఓం బిర్లా వ్యాఖ్యానించారు. ” స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఎవరైనా కేవలం సభను నిర్వహించడం లేదా ఆదేశాలు జారీ చేయడం మాత్రమే చేయగలరు. సభలో మాట్లాడే అవకాశం ప్రతి ఒక్కరికి ఇస్తారు. గౌరవ సభ్యుడి పేరు పిలిచినప్పుడు.. స్పీకర్ ఇచ్చిన ఆదేశాల మేరకు అక్కడ ఉన్న పార్లమెంట్ సిబ్బంది మైక్ కనెక్షన్ ఇస్తారు. అంతేతప్ప కుర్చీలో కూర్చున్న సభాపతికి లేదా రికార్డింగ్ అధికారులకు మైక్ నిర్వహించే అవకాశం ఉండదు.. ఇది తెలిసినా కూడా తలా తోకా లేని ఆరోపణలు చేయడం అత్యంత దురదృష్టకరం. సభాపతి స్థానంలో స్పీకర్ లేకుంటే.. సభను నడిపించేందుకు ఏర్పాటుచేసిన స్పీకర్ ప్యానెల్ లో అన్ని పార్టీల సభ్యులు ఉంటారని.. ఈ విషయం రాహుల్ గాంధీ గుర్తెరగాలని” ఓం బిర్లా స్పష్టం చేశారు.. స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవాన్ని కించపరచకూడదని, కనీసం ఆ ప్యానల్ లో ఉన్న సభ్యులు అలాంటి ఆరోపణలు చేయకూడదని ఓం బిర్లా వ్యాఖ్యానించారు.. కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ నాయకుడు కే సురేష్ స్పీకర్ ప్యానల్ లో ఉన్నారని, గౌరవ సభ్యులకు ఇచ్చే మైక్ ను సభాపతి కంట్రోల్ చేస్తారా? లేదా? అనేది ఆయన చెప్పాలని ఓం బిర్లా పేర్కొన్నారు.
ఇక శుక్రవారం లోక్ సభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు..నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి చోటు చేసుకున్న అక్రమాలపై ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా స్పందించాల్సి వచ్చింది..” గతంలో మైక్ కట్ చేసే సంప్రదాయం ఉండేది. అలాంటి ఏర్పాటు అప్పట్లో చేశారు. కొత్త పార్లమెంట్ బోనంలో అలాంటిదేమీ లేదు. కేవలం పార్లమెంటు సిబ్బంది మాత్రమే దానిని ఆపరేట్ చేస్తారు. ప్రస్తుతం గౌరవ సభ్యులు ఉపయోగించేందుకు మైక్రోఫోన్ ఏర్పాటు చేశాం. ఆయనప్పటికీ అలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరం. మళ్లీ మళ్లీ ఇదే విషయంపై వివరణ ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉందని” స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యానించారు.