Team India : రెండు సంవత్సరాలుగా టి20 ప్రపంచ కప్ ల్లో వరుస వైఫల్యాలు ఎదురయ్యాయి. మరో వైపు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్నారు.. దీనివల్ల వివిధ టోర్నీల్లో టీం ఇండియా భారీ మూల్యాలను చెల్లించుకున్నది. దీనికి తోడు ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రికెట్ వరల్డ్ కప్ జరగబోతోంది.. 2011లో ధోని సారథ్యంలో ప్రపంచకప్ గెలుచుకున్న టీమిండియా… తర్వాత ఆ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రదర్శన చేయలేదు.. స్వదేశంలో జరుగుతున్న ఆ కప్ ను ఎలాగైనా గెలుచుకోవాలంటే ఆటగాళ్లు అంచనాల మేరకు ఆడాలి.. అందుకోసమే మిషన్ వరల్డ్ కప్ కోసం బీసీసీఐ అంచనాలు రూపొందించింది.

-యోయో, డెక్సా టెస్టులు
టీమిండియా ఆటగాళ్ల ఫిట్ నెస్ పై గత కొంతకాలంగా సందేహాలు తలెత్తుతున్నాయి. టీ _20ల్లో ఈ ఏడాది దాదాపు 37 క్యాచ్ లను ఆటగాళ్లు డ్రాప్ చేశారు.. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వారు మైదానంలో ఎంత బద్ధకంగా ఉన్నారో… అదనపు పరుగులు చేయాల్సిన సమయంలో రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ లో కూడా బ్యాటర్లు నిదానంగా ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఇందుకు గాయాలు అదనం.. ఈ రకంగా వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని భారత క్రికెట్ క్రీడా సమాఖ్య ముందే గుర్తించింది.. దీంతో గతంలో నిలిపేసిన యోయో టెస్టును తిరిగి ప్రారంభించింది.. కొత్తగా డెక్సా స్కాన్ కూడా జత చేసింది.
-నాణ్యత ప్రమాణాలు అందుకోవాలి
కొత్తగా డెక్సా (ఎముకల స్కానింగ్) ను తెరపైకి తీసుకురావడంతో ఆటగాళ్లు ఫిట్ నెస్ పై బాధ్యతాయుతంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ టెస్టుల వల్ల ఆటగాళ్ల శిక్షకులు జవాబుదారితనంగా ఉంటారని బీసీసీఐ భావిస్తోంది.. ఆటగాడి శరీరంలోని ఎముకల సాంద్రత, కొవ్వు శాతం, కండరాల శాతం, నీటి శాతం వంటి ప్రాథమిక అంశాలపై ట్రైనర్లకు స్పష్టమైన అవగాహన వస్తుంది.. ఇందులో ఆటగాడు వేటిని దాచి పెట్టడం సాధ్యం కాదు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. ఇక మనిషి శరీరంలో కొవ్వు శాతం 10 లోపే ఉండాలి.. అదే 12 వరకు ఉంటే బార్డర్ లైన్ లో ఉన్నట్టు.. ఫుట్బాల్ క్రీడాకారుల ఒంట్లో మాత్రం కొవ్వు శాతం ఎనిమిదికి మించకూడదు.. కానీ క్రికెటర్లకు 10 శాతం వరకు ఉండొచ్చు.. తక్కువ కొవ్వు ఉందంటే శరీరంలో కండరాల శాతం ఎక్కువ ఉందని అర్థం.. ఇది ఆటగాడికి సామర్థ్యం, శక్తి, వేగం, చురుకు కుదనంతోపాటు, కీళ్ళ పై భారాన్ని తగ్గిస్తుంది. దీంతో కండరాలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.. ఇలాంటి సమయంలో ఆటగాళ్ళు గాయాల బారిన పడకుండా ఉంటారు. స్వదేశంలో జరిగే వరల్డ్ కప్ ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.