IND vs SL : టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా జింబాబ్వేలో పర్యటించింది. టి20 సిరీస్ దక్కించుకుంది. 4-1 తేడాతో విజేతగా ఆవిర్భవించింది. అనంతరం శ్రీలంకలో పర్యటించింది. 3 t20 మ్యాచ్ ల సిరీస్ ను 3-0 తేడాతో గెలిచింది. ఇదే ఊపు వన్డే సిరీస్ లోను కొనసాగిస్తుందని అందరూ భావించారు. రోహిత్ వన్డే కెప్టెన్ గా తిరిగి రావడంతో టీమ్ ఇండియాకు తిరుగులేదు అని అనుకున్నారు. కానీ వన్డే సిరీస్ కు వచ్చేసరికి పరిస్థితి ఒక్కసారిగా తిరగబడింది. తొలి మ్యాచ్ టై అయింది. ఈ మ్యాచ్ టై అయింది అనేకంటే, టీమిండియా ఆటగాళ్ల నిర్లక్ష్యమే ఎందుకు కారణం. ఇక రెండవ వన్డేలో 32 పరుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. మిడిల్ ఆర్డర్ వైఫల్యం వల్ల టీమిండియా సిరీస్ 1-0 తేడాతో వెనుకబడింది. దీంతో బుధవారం జరుగుతున్న మూడవ వన్డేలో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
బౌలింగ్ బాగున్నప్పటికీ..
వాస్తవానికి శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియా బౌలింగ్ బాగున్నప్పటికీ.. బ్యాటింగ్ విభాగంలో రోహిత్ మినహా మిగతా వారంతా అత్యంత దారుణంగా విఫలమవుతున్నారు. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి వారు అంచనాలు అందుకోవడంలో విజయవంతం కాలేకపోతున్నారు. రోహిత్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నప్పటికీ.. దానిని కొనసాగించడంలో మిగతా ఆటగాళ్లు పూర్తిగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా రెండవ వన్డే మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో టీమిండియా ఓటమి బాట పట్టాల్సి వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ అందించిన ఆరంభాన్ని పటిష్ఠవంతం చేయడంలో మిగతా ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. అందుకే భారత్ మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. బుధవారం జరుగుతున్న మూడవ వన్డే మ్యాచ్ లోనూ టీమ్ ఇండియా ఓడిపోతే.. జట్టులోని కొంతమంది ఆటగాళ్లకు మిగతా సిరీస్లలో స్థానం దక్కేది అనుమానం గానే ఉంది.
ఖలీల్ అహ్మద్
మిగతా సిరీస్ లకు అవకాశం దక్కని ఆటగాళ్ల జాబితాలో ఖలీల్ అహ్మద్ ముందు వరుసలో ఉంటాడని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే శ్రీలంక సిరీస్ కు అతడు బ్యాకప్ ఆటగాడిగా మాత్రమే ఎంపిక అయ్యాడు. అందువల్ల అతనికి ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు లభించలేదు.. బుమ్రా, మహమ్మద్ షమీ ఒకవేళ జట్టులోకి వస్తే ఖలీల్ అహ్మద్ కు అవకాశం లభించదు.
శివం దుబే
ఐపీఎల్ లో చెన్నై తరఫున మెరుగైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. టీమిండియాలో మాత్రం అతడు తన మార్కు చూపించలేకపోతున్నాడు. టి20 వరల్డ్ కప్ లో సత్తా చాటాలేకపోయాడు. బౌలింగ్ విభాగంలో మెరుగ్గానే ఉన్నప్పటికీ.. జట్టు అవసరాల దృష్టిగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. ఒకవేళ రియాన్ పరాగ్ జట్టులోకి వస్తే, హార్దిక్ పాండ్యా పునరాగమనం చేస్తే శివం దుబే కు టీమిండియాలో చోటు దక్కడం అనుమానమే.
శ్రేయస్ అయ్యర్
అయ్యర్ బ్యాటింగ్ చాలా వరకు బాగుంటుంది. కానీ అతడు శ్రీలంక టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. తొలి మ్యాచ్లో 23 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్లో ఏడు పరుగులు మాత్రమే సాధించాడు. రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్ వన్డే జట్టులోకి వస్తే అయ్యర్ బ్యాగు సర్దుకోవాల్సి ఉంటుంది.
అయితే ఈ ఆటగాళ్లకు అవకాశాలు లభించినప్పటికీ తమ స్థాయికి తగ్గ ఆట తీరు ప్రదర్శించలేకపోయారు. వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ నిలవలేకపోయారు. అందువల్లే వారు స్థిరంగా ఉండలేకపోతున్నారని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తే ఖచ్చితంగా జట్టులో కొనసాగుతారని.. అలా చేయని పక్షంలో ఆటగాళ్లకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా పై ఆటగాళ్లు స్థిరత్వాన్ని సాధించాలని కోరుతున్నారు.