Team India: కరేబియన్ దీవులలో ఏర్పడిన హరికేన్ కారణంగా.. కొద్దిరోజులుగా ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు వేదికైన బార్బడోస్ తో పాటు సెయింట్ విన్సెంట్, గ్రెనెడా, సెయింట్ లూసియా ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో కరేబియన్ దీవులలో ఉన్న విమానాశ్రయాలను అధికారులు మూసేశారు. దీంతో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు బార్బడోస్ లోని హోటళ్లకే పరిమితమయ్యారు. ఆ ప్రాంతంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్తు, తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను స్వదేశానికి తీసుకొచ్చేందుకు బీసీసీఐ అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి చార్టర్డ్ ఫ్లైట్లు కూడా ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ ప్రయత్నాలను విరమించుకుంది.
తాజా సమాచారం ప్రకారం బీసీసీఐ స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేయడంతో టీమ్ ఇండియా ఆటగాళ్లు బుధవారం స్వదేశానికి చేరుకుంటారని తెలుస్తోంది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లకు ఘనమైన స్వాగతం పలకాలని అభిమానులు అనుకుంటున్నారు. అయితే వారి ఉత్సాహం మీద హరికేన్ నీళ్లు చల్లింది. అయితే బిసిసిఐ ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో.. టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం పలకాలని అభిమానులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు..
హరికేన్ వల్ల టీమిండియా ఆటగాళ్లు శనివారం నుంచి బార్బడోస్ లోని హోటల్ కే పరిమితమయ్యారు.. అయితే మంగళవారం నుంచి అక్కడ పరిస్థితి కాస్త మెరుగు కావడంతో భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మూడు గంటల 30 నిమిషాలకు బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానం ఇండియాకు బయలుదేరుతుంది. బుధవారం సాయంత్రం ఏడు గంటల 40 నిమిషాలకు ఆటగాళ్లు ఢిల్లీ చేరుకుంటారు. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, సంజు, ఖలీల్ అహ్మద్ వంటి వారు టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోనే ఉన్నారు. స్వదేశానికి చేరుకోగానే.. ప్రస్తుత టి20 జట్టులో ఉన్న ఆటగాళ్లలో సీనియర్లు మినహా మిగతావారు జింబాబ్వే పర్యటనకు వెళ్తారు. ఈ జట్టుకు గిల్ నాయకత్వం వహిస్తాడు.