Nallamala Forest: అది చూసేందుకు బాహుబలి దున్నపోతులా ఉంటుంది. దానిని అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తే అంతకుమించి అనే లాగా ఉంటుంది. అమెరికా బైసన్ (ఇది ఒక రకమైన భారీ దున్నపోతు) కూడా దీని ముందు చిన్నబోతోంది. చూపు తిప్పుకొనివ్వని రూపం.. భారీగా పెరిగిన కొమ్ములు.. దృఢమైన శరీరం.. విస్తారమైన ఆకృతి.. దుర్భేద్యమైన కాళ్లతో అత్యంత బలంగా కనిపిస్తుంది. అయితే ఈ దున్నపోతు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం నల్లమల అడవిలో కనిపించేదట. దాదాపు శతాబ్దంన్నర కాలం దాటినా దీని ఆచూకీ కనిపించలేదు. కానీ ఇన్నాళ్లకు ఇది నల్లమల అడవిలో ప్రత్యక్షమైంది.
నంద్యాల జిల్లా పరిధిలో విస్తరించిన నల్లమల అడవిలో 154 సంవత్సరాల తర్వాత అడవి దున్నపోతు ప్రత్యక్షమైంది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్ పరిధిలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్ లో ఈ దున్నపోతు చిత్రాలు నమోదయ్యాయి. ఈ దున్నపోతు అత్యంత బలమైనది ఒక మోస్తారు పులి లేదా సింహాన్ని సమర్థవంతంగా ఎదిరించగలదు. తనదైన రోజు కొమ్ములతో పొడిచి చంపగలదు. జంతు శాస్త్ర నిపుణులు దీనిని బలమైన దున్నపోతుగా పేర్కొంటారు.
ఈ దున్నపోతు నల్లమల అడవిలో కనిపించడంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అప్పుడెప్పుడో 1870 కాలంలో ఈ దున్నపోతులు నల్లమల అడవిలో సంచరించేవి.. కాలక్రమేణా అవి కనిపించడం మానేశాయి. అయితే ఇవి అంతరించిపోయాయని అటవీ శాఖ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ అడవి దున్న గత ఏడాది జనవరి నెలలో వెలుగోడు రేంజ్ పరిధిలో మొదటిసారి కనిపించింది.. ఆ తర్వాత ఆహార అన్వేషణలో భాగంగా గత నెలలో బైర్లూటీ అటవీ రేంజ్ పరిధిలోకి వచ్చింది. అయితే కర్ణాటక ప్రాంతంలో విస్తారంగా ఉండే ఈ దున్నపోతులు కృష్ణా నదిని దాటి ఆహార అన్వేషణలో భాగంగా నల్లమల అడవిలోకి వచ్చాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ దున్నపోతు జాతిని పరిరక్షించేందుకు అటవీ శాఖ కసరత్తు చేస్తోందని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా పేర్కొన్నారు..”ఈ అడవిలోకి ఆ దున్న రావడం ఆనందంగా అనిపిస్తోంది. ఈ దున్న చాలా బలమైనది. విశిష్టమైన లక్షణాలు కలిగి ఉన్నది. అందువల్లే దాని రాక మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని” సాయిబాబా పేర్కొన్నారు.
154 ఏళ్ల తర్వాత కనిపించిన అడవి దున్న నంద్యాల జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కనిపించిన అడవి దున్న.
ఆత్మకూరు డివిజన్ పరిధి బైర్లూటీ రేంజ్లో సిబ్బంది కెమెరాలో అడవి దున్న చిత్రాలు రికార్డు.
1870 తర్వాత నల్లమల్ల అడవిలో అడవి దున్న సంచారం కనిపించిందని చెబుతున్న అటవీ శాఖ pic.twitter.com/Nc5K4NEeJ7
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2024