Team India – ICC T20 World Cup 2024 : : టి20 ప్రపంచ కప్ లో భారత జట్టు వరుస విజయాలు సాధించింది. ఏకంగా సూపర్ -8 కు వెళ్లిపోయింది. గ్రూప్ – ఏ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రాక్టీస్ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టుపై గెలిచిన భారత్.. ఆ తర్వాత వరుస విజయాలు సాధించింది. ఐర్లాండ్ జట్టును మట్టికరిపించింది. పాకిస్తాన్ జట్టును పడుకోబెట్టింది. అమెరికాను చిత్తు చేసింది. కెనడా తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఒకవేళ ఈ మ్యాచ్ గనుక జరిగి ఉంటే నాలుగు విజయాలతో.. భారత్ తిరుగులేని స్థానంలో ఉండేది. ఇక ఇదే గ్రూపులో భారత తర్వాత అమెరికా సూపర్ -8 కు ఎంపికయింది.
అమెరికా వేదికగా లీగ్ దశలో చాలా వరకు మ్యాచులు జరిగాయి. మైదానాల రూపకల్పనలో ఐసీసీ పాటించిన విధానం వల్ల బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో పరుగులు చేయలేకపోయారు. బౌలర్లు మాత్రం పండగ చేసుకున్నారు. ఇక లీగ్ దశ ముగిసిన తర్వాత, సూపర్ -8 మొదలవుతుంది. ఈ స్టేజిలో అన్ని జట్లు తల మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. తదుపరి దశకు చేరుకోవాలంటే ఈ మూడు మ్యాచ్ లలో గెలవడం ప్రతి జట్టుకు అత్యంత అవసరం. అత్యధిక విజయాలు, నెట్ రన్ రేట్ ఆధారంగా ఏ జట్లు సెమీస్ చేరిపోతాయో తెలిసిపోతుంది.
సూపర్ -8 లో భారత్ తో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్/ నెదర్లాండ్స్ లలో ఒక టీం తో టీమిండియా తలపడుతుంది. జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో భారత్ సూపర్ -8 పోరు ప్రారంభిస్తుంది. జూన్ 22న బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ జట్టుతో తలపడుతుంది. ఇక జూన్ 24న బలమైన ఆస్ట్రేలియా జట్టును ఢీ కొడుతుంది. ఈ మ్యాచ్లు మొత్తం వెస్టిండీస్ వేదికగా జరుగుతాయి. సెయింట్ లూసియా, అంటిగ్వా, బార్బ డోస్ మైదానాలు ఈ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇస్తాయి. లీగ్ మ్యాచ్లలో సత్తా చాటిన రోహిత్ సేన.. సూపర్-8 లోనూ అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇలా ఆడితేనే రోహిత్ సేన నాకౌట్ స్టేజ్ కి వెళ్తుంది..
ఈ టోర్నీలో అదిరిపోయే రేంజ్ లో ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించడం భారత్ కు అంత సులభం కాదు. ఇక ఆస్ట్రేలియాను మట్టి కరిపించడం కూడా అంత ఈజీ కాదు. ఇప్పటికే ఆస్ట్రేలియా చేతిలో భారత్ వన్డే వరల్డ్ కప్, టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లలో ఓడిపోయింది.. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా పై రివెంజ్ తీర్చుకోవాలంటే కచ్చితంగా రోహిత్ సేన పకడ్బందీ ప్రణాళికతో రంగంలోకి దిగాల్సి ఉంటుంది. వెస్టిండీస్ మైదానాలు స్లో వికెట్ కు అనుకూలంగా ఉంటాయి. అలాంటప్పుడు భారత్ స్పిన్ ఆస్త్రాన్ని సంధించాల్సి ఉంటుంది. ఒకవేళ నెదర్లాండ్స్ జట్టుకు బదులు బంగ్లాదేశ్ సూపర్-8 లోకి ప్రవేశిస్తే.. భారత జట్టుకు మరో సవాల్ ఎదురవుతుంది . ఇలాంటప్పుడు జట్టు సమిష్టిగా ఆడి, ప్రణాళికలను అమలు చేస్తేనే విజయాలు దక్కుతాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.