Crime News : తాచుపాము తన పిల్లల్ని తానే తినేస్తుంది. అది సృష్టి ధర్మం.. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ కథనంలో ఈ తల్లి కూడా అలానే చేసింది. సాధారణంగా తల్లి ప్రేమకు ఏదీ సాటి రాదని అంటుంటారు. ఈ సృష్టిలో అత్యంత తీయనిది తల్లి ప్రేమ అంటుంటారు. కానీ ఈ తల్లి తన ప్రేమను, వాత్సల్యాన్ని దూరం పెట్టింది. వివాహేతర సంబంధం మాయలో పడి కన్న కొడుకునే కడ తేర్చింది. ఈ దారుణ సంఘటన సంగారెడ్డి పట్టణంలోని పటాన్ చెరువు ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఈనెల 11న ముత్తంగి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ముళ్ళ పొదలలో ఓ బాలుడి మృతదేహం కనిపించింది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతం మీద వెళ్తున్న కొంతమందికి బాలుడి మృతదేహం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేసి.. దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తీగ లాగితే ఆ బాలుడి తల్లి వివాహేతర సంబంధం గుట్టు మొత్తం రట్టయింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన కర్రి స్వాతి (30)కి భర్త రాజు ఉన్నాడు. వీరు రామచంద్రపురం పట్టణంలో పాతబస్తీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. రాజు, స్వాతి దంపతులకు కుమారుడు విష్ణువర్ధన్ (9), కుమార్తె (7) ఉన్నారు. రామచంద్రపురం పాతబస్తీలోనే ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చీమకుర్తి ప్రాంతానికి చెందిన దొంతు అనిల్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. స్వాతికి, అనిల్ కు మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకరోజు తన తల్లి అనిల్ తో అత్యంత సాన్నిహిత్యంగా ఉండగా.. విష్ణువర్ధన్ చూసాడు. అయినప్పటికీ తన తల్లిని ఏమీ అనలేదు. మరోసారి కూడా ఇలానే జరిగింది. దీంతో అతడు తన తల్లితో గొడవకు దిగాడు. వివాహేతర సంబంధం సరికాదంటూ నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
పట్టరాని కోపంతో స్వాతి విష్ణువర్ధన్ గొంతు నులిమేసింది. దీంతో అతడు ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయాడు. కళ్ళముందే కొడుకు చనిపోవడంతో స్వాతికి కాళ్లు, వేళ్ళూ ఆడలేదు. దీంతో నేరం నుంచి తప్పించుకోవాలని భావించి.. ఒక కండువాతో బాలుడి మెడకు ఉరివేసి.. కిటికీ కి వేలాడదీసింది.. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన కుమార్తెకు, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న అనిల్ కు విష్ణువర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని కల్లబొల్లి కబుర్లు చెప్పింది. అదే రోజు రాత్రి విష్ణువర్ధన్ మృత దేహాన్ని స్కూటీపై అనీల్ సహాయంతో తీసుకెళ్లింది. ముత్తంగి ఔటర్ జంక్షన్ వద్దకు వారు చేరుకున్నారు. అక్కడ సర్వీస్ రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో ఆ బాలుడి మృతదేహాన్ని పడేశారు.
అయితే ఆ బాలుడి మృతదేహాన్ని చూసిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ ఫుటేజ్ లో వారు ఆ బాలుడిని ముళ్ల పొదల్లో పడేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో పోలీసులు వారిదైన శైలిలో విచారించగా స్వాతి అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులు స్వాతి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్వాతికి సహకరించిన అనిల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరికీ రిమాండ్ విధించారు. అయితే స్వాతి భర్త రాజు కొంత కాలం క్రితమే మృతి చెందాడు. స్వాతి వ్యవహార శైలి నచ్చకనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. భర్త చనిపోయినప్పటికీ స్వాతి తన తీరు మార్చుకోలేదు. పైగా కన్న కొడుకునే హత్య చేసింది..