T20 World Cup 2024 – IPL 2024 : ఏరి కోరి టీ20 కి ఎంపిక చేస్తే.. ఇలా ఆడుతున్నారేంటి?

ఇక ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో ఆటగాళ్లు తమ అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారు.. అందువల్ల మన బ్యాటర్లు, బౌలర్ల ఆట తీరు చూసి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పైగా త్వరలో నిర్వహించే టి20 వరల్డ్ కప్ లో భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Written By: NARESH, Updated On : May 3, 2024 9:25 pm
Follow us on

T20 World Cup 2024 – IPL 2024 : దేశమంతా ఐపీఎల్ ట్రెండ్ నడుస్తోంది. ఈ జోరు ఇలా ఉండగానే, ఐసీసీ టీ – 20 వరల్డ్ కప్ నకు సన్నాహాలు మొదలయ్యాయి. దాదాపు అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి.. టీమిండియా 15 మందితో కూడిన ఆటగాళ్లను, నలుగురు రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను ఎంపిక చేసింది. గత ఏడాది నుంచి చూపిస్తున్న ప్రతిభ ఆధారంగా ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే టి20 వరల్డ్ కప్ కోసం ఈ ఎంపిక చేసిన ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్ లో చెత్త ప్రదర్శన కొనసాగిస్తున్నారు.

టి20 వరల్డ్ కప్ ఎంపికకు మందు అద్భుతంగా ఆడిన యజువేంద్ర చాహల్, ఆర్ష్ దీప్ సింగ్, శివం దూబే, రోహిత్ శర్మ, సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్ దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నారు. దీంతో అభిమానులు నిట్టూర్చుతున్నారు. అయితే అభిమానులు ఆ తీరుగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టి20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్నాయి. అక్కడ ప్రత్యేకంగా మైదానాలు నిర్మితమవుతున్నాయి. ఆ మైదానాలకు, మన మైదానాలకు చాలా తేడా ఉంది. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లను బ్యాటింగ్ కు అనుకూలంగా మార్చిన విషయం తెలిసిందే. మైదానాలు ప్లాట్ గా ఉండడంతో బౌలర్లు విఫలమవుతున్నారు. అమెరికా, వెస్టిండీస్ మైదానాలు బౌన్సీ గా ఉంటాయి. ఇలాంటి మైదానాలపై పేస్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు పండగ చేసుకోవచ్చు.

వెస్టిండీస్ మైదానాలు స్పిన్ బౌలింగ్ కు విపరీతంగా సహకరిస్తాయి. అందువల్లే రోహిత్ శర్మ నలుగురు స్పిన్నర్లకు అవకాశం ఇచ్చాడు. అలాంటి మైదానాలపై మన దేశ స్పిన్నర్లు తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి మైదానాలపై విరాట్ కోహ్లీ ధాటిగా ఆడగలడు. చాహల్, కులదీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మైదానాలపై వారికి అద్భుతమైన రికార్డు ఉంది. అమెరికాలో మైదానాల విషయానికొస్తే.. ఆ ప్రాంతంలో క్రికెట్ ప్రోత్సహించేందుకు.. వేరేచోట మైదానాలు తయారుచేసి.. ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఈ మైదానాలు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్యాటింగ్ లో విఫలమవుతున్న సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్ వంటి వారు ఇక్కడ రెచ్చిపోయే అవకాశం ఉంది.

టి20 వరల్డ్ కప్ టోర్నీకి, ఐపీఎల్ కు చాలా తేడా ఉంది. ఐపీఎల్ కమర్షియల్ టోర్నీ. బ్యాటర్లు భారీ పరుగులు చేసేందుకు బౌలర్లకు నరకం చూపిస్తున్నారు. అందువల్లే ప్లాట్ మైదానాలు తయారు చేస్తున్నారు. కానీ ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో మైదానాలను అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లకు అనుకూలంగా తయారు చేస్తారు. ఇక ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో ఆటగాళ్లు తమ అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారు.. అందువల్ల మన బ్యాటర్లు, బౌలర్ల ఆట తీరు చూసి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పైగా త్వరలో నిర్వహించే టి20 వరల్డ్ కప్ లో భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.