https://oktelugu.com/

T20 Women’s World Cup : నెట్ రన్ రేట్ పరంగా మనమే మెరుగు.. అయినా పాకిస్తాన్ కివీస్ ను ఓడిస్తేనే సెమీస్ కు.. ఇంతకీ సమీకరణాలు ఎలా ఉన్నాయంటే?

గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఓడింది. ఆస్ట్రేలియా చేతిలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో 9 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత జట్టు సెమీఫైనల్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా సెమీఫైనల్ వెళ్లాలంటే సోమవారం న్యూజిలాండ్ - పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కీలకంగా మారింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 14, 2024 8:59 am
T20 Women's World Cup

T20 Women's World Cup

Follow us on

T20 Women’s World Cup :  ఆదివారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా – టీమిండియా తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 రన్స్ చేసింది. వాస్తవానికి ఆస్ట్రేలియా ధాటిగా బ్యాటింగ్ చేయలేనప్పటికీ.. టీమ్ ఇండియా బౌలర్లు ఎక్స్ ట్రా ల రూపంలో 13 పరుగులు ఇచ్చారు. దీంతో ఆస్ట్రేలియా స్కోర్ 151 పరుగులకు చేరుకుంది. గ్రేస్ (40) టాప్ స్కోరర్ గా నిలిచింది. తహ్లియా(32), ఎల్లిస్ ఫెర్రీ(32) పరుగులు చేశారు.. భారత బౌలర్లలో దీప్తి, రేణుక చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శ్రేయ, పూజ, రాధా తలా ఒక వికెట్ దక్కించుకున్నారు..

ఒత్తిడి తట్టుకోలేక..

152 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన టీమిండియా 26 పరుగుల వద్ద ఓపెనర్ షఫాలి వర్మ (20) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జట్టు స్కోరు 39 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు మరో ఓపెనర్ స్మృతి మందాన (6) వెనుదిరిగింది. దీంతో జట్టులో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. జెమిమా(16) దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ అయింది. ఈ దశలో వచ్చిన కెప్టెన్ హర్మన్(54), దీప్తి శర్మ (29) దూకుడుగా ఆడడంతో విజయంపై ఆశలు నెలకొన్నాయి. ఈ క్రమంలో దీప్తి అవుట్ కావడంతో.. భారత్ మళ్లీ కష్టాల్లో పడింది. అదే ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు పెద్దగా సత్తా చాట లేకపోవడంతో.. హర్మన్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. చివరికి విజయ సమీకరణం నాలుగు బంతుల్లో 12 పరుగులకు చేరుకున్నప్పుడు.. టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా 142 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది..దీంతో 9 పరుగుల తేడాతో ఓటమిపాలు కావాల్సి వచ్చింది.

వాస్తవానికి ఆస్ట్రేలియాపై టీమిండియా గెలిస్తేనే సెమీ ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంది. అయితే కీలకమైన మ్యాచ్ లో ఓడిపోయిన నేపథ్యంలో సోమవారం జరిగే న్యూజిలాండ్ – పాకిస్తాన్ మ్యాచ్ టీమ్ ఇండియాకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడిపోతే..నెట్ రన్ రేట్ ఆధారంగా టీమిండియా సెమీఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే పాకిస్తాన్ జట్టు మూడు మ్యాచ్ లు ఆడి.. ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అలాంటప్పుడు ఆ జట్టు గెలిస్తే న్యూజిలాండ్ లేదా భారత జట్టు నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీఫైనల్ వెళ్తాయి. ప్రస్తుతం భారత్ +0.322 నెట్ రన్ రేట్ కలిగి ఉంది. న్యూజిలాండ్ +0.282 నెట్ రన్ రేట్ తో ఉంది. ఒకవేళ పాకిస్తాన్ జట్టుపై న్యూజిలాండ్ గెలిస్తే.. అప్పుడు టీమ్ ఇండియా లీగ్ దశలోనే తన పోరాటాన్ని ముగించాల్సి ఉంటుంది. అయితే న్యూజిలాండ్ చేతిలో తొలి మ్యాచ్ లో 58 పరుగుల తేడాతో ఓడిపోవడం వల్లే టీమిండియా కు ఈ దుస్థితి పట్టింది. ఆస్ట్రేలియా చేతిలో స్వల్ప పరుగుల తేడాతో ఓడిపోవడం వల్ల నెట్ రన్ రేట్ ప్రభావితం కాకపోయినప్పటికీ.. న్యూజిలాండ్ పాక్ పై గెలిస్తే మాత్రం హర్మన్ సేన స్వదేశానికి తిరుగు ముఖం పట్టాల్సిందే.