TATA IPL KKR vs RR : నరైన్ ఊచకోత.. విధ్వంసకర సెంచరీకి ఈడెన్ గార్డెన్స్ దద్దరిల్లింది.. మురిసిన షారుఖ్

కోల్ కతా జట్టు తురుపు ముక్క, మరో ఓపెనర్ పిలిప్ సాల్ట్ ఈ మ్యాచ్లో 10 పరుగులకే ఆవేశ్ ఖాన్ బౌలింగ్ లో ఔట్ అయినప్పటికీ..సునీల్ నరైన్ రఘు వన్షీ(30) తో కలిసి రెండో వికెట్ కు 43 బంతుల్లోనే 85 పరుగులు జోడించాడు..రఘు వన్షీ కులదీప్సేన్ బౌలింగ్లో అవుట్ అయిన తర్వాత కోల్ కతా స్కోరు కొంత తగ్గినట్టు అనిపించింది.

Written By: NARESH, Updated On : April 16, 2024 10:29 pm

TATAIPL KKR vs RR

Follow us on

TATA IPL KKR vs RR : ఐపీఎల్ 17వ సీజన్లో శతకాల మోత మోగుతోంది. సోమవారం రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు హెడ్ సృష్టించిన సెంచరీ విధ్వంసాన్ని మర్చిపోకముందే.. కోల్ కతా ఆటగాడు సునీల్ నరైన్ తుఫాన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మాస్ హిట్టింగ్ తో మైదానాన్ని హోరెత్తించాడు. 49 బంతుల్లోనే 100 పరుగుల మార్క్ చేరుకొని కోల్ కతా జట్టుకు తిరుగులేని ఆధిపత్యాన్ని అందించాడు.. 29 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన సునీల్ నరైన్ .. మిగతా 50 పరుగులను 20 బంతుల్లోనే పూర్తి చేశాడు. 11 బౌండరీలు కొట్టిన సునీల్ నరైన్ .. ఆరు భారీ సిక్సర్లు బాదాడు.

రాజస్థాన్ బౌలర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్ ను లక్ష్యంగా చేసుకొని వీర కొట్టుడు కొట్టాడు. సునీల్ నరైన్ బ్యాటింగ్ దూకుడుతో వారిద్దరూ ఏకంగా 103 పరుగులు సమర్పించుకున్నారు. సునీల్ నరైన్ కు ఐపీఎల్ లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. వాస్తవానికి రాజస్థాన్ జట్టుతో మ్యాచ్ కు ముందు సునీల్ నరైన్ ఐదు మ్యాచ్లు ఆడి 167 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సెంచరీ తో అతని పరుగుల సంఖ్య 276 కు చేరుకుంది.. ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న సునీల్ నరైన్ కోల్ కతా ఇన్నింగ్స్ కు వెన్నెముకలాగా మారాడు.

కోల్ కతా జట్టు తురుపు ముక్క, మరో ఓపెనర్ పిలిప్ సాల్ట్ ఈ మ్యాచ్లో 10 పరుగులకే ఆవేశ్ ఖాన్ బౌలింగ్ లో ఔట్ అయినప్పటికీ..సునీల్ నరైన్ రఘు వన్షీ(30) తో కలిసి రెండో వికెట్ కు 43 బంతుల్లోనే 85 పరుగులు జోడించాడు..రఘు వన్షీ కులదీప్సేన్ బౌలింగ్లో అవుట్ అయిన తర్వాత కోల్ కతా స్కోరు కొంత తగ్గినట్టు అనిపించింది. కెప్టెన్ అయ్యరర్ కూడా 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అండ్రీ రసెల్(13) తో నరైన్ ఏకంగా 19 బంతుల్లోనే 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 109 పరుగుల వద్ద బౌల్ట్ బౌలింగ్లో క్లీన్ బౌల్ద్ అయ్యాడు. నరైన్ ధాటికి కోల్ కతా ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. రాజస్థాన్ ఎదుట 224 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. గత సీజన్లో కోల్ కతా వరుస ఓటములు ఎదుర్కొనేది. ఫలితంగా ఆ జట్టు యజమాని షారుఖ్ ఖాన్ డల్ గా కనిపించేవాడు.. ఈ సీజన్లో కోల్ కతా జట్టు వరుసగా విజయాలు సాధిస్తుండడం.. మంగళవారం నాటి మ్యాచ్లో రాజస్థాన్ పై సునీల్ నరైన్ సెంచరీ చేయడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అతడికి ఫ్లైయింగ్ కిస్సులు విసిరాడు. కోల్ కతాకు గౌతమ్ గంభీర్ మెంటర్ గా వచ్చాక ఆ టీం బలోపేతమైంది. సరైన ఆటగాళ్లను బరిలోకి దింపుతున్నారు.