Modi vs Rahul : అది ముమ్మాటికి దోపిడీ నే: నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ

సొంతంగా అధికారంలోకి రాలేక కూటమి పెట్టుకుని.. కూటమికి నాయకత్వం వహించలేక చేతులు ఎత్తేసిన ఘనత రాహుల్ గాంధీ ది అంటూ" చంద్రశేఖర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Written By: NARESH, Updated On : April 16, 2024 9:47 pm

Election Bonds

Follow us on

Modi vs Rahul : గత నెలలో ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దానిని రద్దు చేయాలని కోరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తలంటింది. సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగి వచ్చింది. ఎవరెవరు ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశారో? ఏ కంపెనీలు ఏ పార్టీలకు ఏ స్థాయిలో ఇచ్చాయో? వివరాలు చెప్పింది. ఇందులో అధికార భారతీయ జనతా పార్టీ నుంచి మొదలుపెడితే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వరకు ఉన్నాయి. అయితే ఇందులో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అధికంగా ఎన్నికల బాండ్ల నిధులు రావడంతో కలకలం నెలకొంది. ప్రధాన ప్రతిపక్షాలు మొత్తం భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలిని విమర్శిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు మౌనంగా ఉన్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తొలిసారిగా పెదవి విప్పారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని దోపిడీగా అభివర్ణించారు.

కేరళలోని వయనాడ్ ప్రాంతం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ.. మంగళవారం ఆ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేశారు.. ముందుగా ఆయన తమిళనాడు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వయానాడ్ ప్రాంతానికి వచ్చారు. వయనాడ్ బయలుదేరుతున్న ఆయన హెలికాప్టర్ ను కేంద్ర ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏమైనా నగదు తరలిస్తున్నారా? అనే కోణంలో ఆయన హెలికాప్టర్ లో సోదాలు చేశారు. రాజకీయంగా ఈ తనిఖీల అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం అక్కడి నుంచి రాహుల్ గాంధీ వయనాడ్ వెళ్లిపోయారు.. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు.

” నిన్న ఏఎన్ఐ కి ఓ వ్యక్తి ఇచ్చిన ఇంటర్వ్యూను మీరు చూశారో, లేదో తెలియదు. అతను అతిపెద్ద అవినీతి కుంభకోణాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. వ్యాపారవేత్తల నుంచి భారతీయ జనతా పార్టీ వేలకోట్లు దోచుకుంది.. కానీ ఆయన మాత్రం నల్లధనాన్ని అరికట్టడానికే తాము ఈ పని చేశామని చెప్పుకున్నాడు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే వాటి నుంచి పారిపోవాలని కోరుకుంటున్నాడు. నిజాయితీ కలవారు ఈ అంశం గురించి ఆలోచిస్తే కచ్చితంగా పశ్చాత్తాప పడతారని” రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “గత ఫిబ్రవరి నెలలో ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నది. అయితే దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు నరేంద్ర మోడీ అనేక కుయుక్తులు పన్నాడు. సముద్రం అడుగున పూజలు చేయడం.. భారత దేశంలో ఒలంపిక్స్ నిర్వహిస్తామని చెప్పడం.. చంద్రుడి పైకి మనిషిని పంపబోతున్నామని వివరించడం.. ఇవన్నీ అందులో భాగమే. కానీ అతడు నిరుద్యోగం, ధరల పెరుగుదల గురించి మాట్లాడడు. పైగా కార్పొరేట్ కంపెనీల రుణాలు మాఫీ చేస్తాడని” రాహుల్ గాంధీ నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే అగ్ని పథ్ పథకాన్ని రద్దు చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశాడు.

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బిజెపి నాయకుడు చంద్రశేఖర్ స్పందించారు. ఏఎన్ఐ అనే న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ” ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేసే రాహుల్ గాంధీ.. వివాదాస్పద నిధుల గురించి మాట్లాడాలి.. ఆయన ఎందుకు కేసులు ఎదుర్కొంటున్నారో కూడా చెప్పాలి… ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల విచారణకు ఆయన తల్లి సోనియాగాంధీ ఎందుకు హాజరయ్యారో చెప్పాలి. దేశ ప్రధానిని గౌరవించడం తెలియని వ్యక్తి.. కోర్టుకు క్షమాపణలు చెప్పిన వ్యక్తి.. ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఆయన అన్ని విమర్శలు చేస్తున్నారు కదా.. ప్రజలకు బోఫోర్స్ తెలుసు.. రాహుల్ గాంధీ కుటుంబం చేసిన పురాణ గాథలు కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ చెబితే వినే స్థితిలో దేశ ప్రజలు లేరు. సొంతంగా అధికారంలోకి రాలేక కూటమి పెట్టుకుని.. కూటమికి నాయకత్వం వహించలేక చేతులు ఎత్తేసిన ఘనత రాహుల్ గాంధీ ది అంటూ” చంద్రశేఖర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.