Rohit Sharma: రోహిత్ అరుదైన ఘనత.. తొలి భారతీయ కెప్టెన్ గా చరిత్ర పుటల్లో..

2007లో జరిగిన టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో అప్పటి భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు. నాకౌట్ మ్యాచ్లలో ఇప్పటివరకు భారత కెప్టెన్ గా ధోని చేసిన పరుగులే హైయెస్ట్ స్కోర్ గా ఉన్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : June 28, 2024 11:47 am

Rohit Sharma

Follow us on

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో సూపర్ -8 మ్యాచ్లో 92 పరుగులు చేసిన అతడు.. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీస్ మ్యాచ్లో (39 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 57) అర్థ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. టి20 వరల్డ్ కప్ హిస్టరీలో నాకౌట్ మ్యాచ్లో అర్థ శతకం సాధించిన తొలి భారత సారధిగా ఘనతను సాధించాడు.. టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో గురువారం జరిగిన సెమీఫైనల్ -2 మ్యాచ్ లో భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది.

2007లో జరిగిన టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో అప్పటి భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు. నాకౌట్ మ్యాచ్లలో ఇప్పటివరకు భారత కెప్టెన్ గా ధోని చేసిన పరుగులే హైయెస్ట్ స్కోర్ గా ఉన్నాయి. ఇక గురువారం నాటి సెమీఫైనల్ మ్యాచ్లో 57 పరుగులు చేసిన రోహిత్ ధోని రికార్డును అధిగమించాడు.

ఇక గురువారం నాటి మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 5,000 పరుగుల మైలురాయి అందుకున్నాడు.. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 12,833 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. మహేంద్ర సింగ్ ధోని 11,207, మహమ్మద్ అజారుద్దీన్ 8,095, సౌరవ్ గంగూలీ 7,643 పరుగులతో రోహిత్ కంటే ముందు స్థానంలో ఉన్నారు.

ఇక సిక్సర్ లు బాదడంలో రోహిత్ టి20 ప్రపంచ కప్ చరిత్రలోనే రోహిత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. టి20 ప్రపంచ కప్ లలో ఇప్పటివరకు రోహిత్ శర్మ 50 సిక్సర్లు కొట్టాడు. 63 సిక్స్ లు కొట్టి గేల్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక అంతర్జాతీయ టి20లలో అత్యధిక విజయాలు నమోదు చేసిన సారధిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. టీమిండియా తరఫున టీ20 క్రికెట్లో 61 మ్యాచ్ లకు రోహిత్ నాయకత్వం వహించాడు. 49 మ్యాచ్లలో భారత జట్టును గెలిపించాడు. మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం 85 మ్యాచ్ లలో నాయకత్వం వహించి.. 48 విజయాలు కట్టబెట్టాడు.