America: అమెరికా నేల తెలుగుదనం సంతరించుకుంటోంది. అగ్రరాజ్యంలో ఎటు చూసినా తెలుగువారు కనిపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్తున్నవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. దీంతో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎక్కడకు వెళ్లినా తెలుగువారు కనిపిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా సెన్సెస్ బ్యూరో కూడా ధ్రువీకరించింది.
ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు..
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు తప్పకుండా ఉంటారు. ఉపాధి, వ్యాపారం నిమిత్తం వెళ్లిన వేలాది మంది వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. కొన్ని దేశాల్లో అయితే కీలక స్థానాల్లో ఉన్నారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. అందులో తెలుగు వారు కూడా ఉంటున్నారు. దీంతో ఏ దేశమేగినా భారతీయత స్పష్టంగా కనిపిస్తుంది.
అమీర్‌పేట్‌కు వెళ్లినట్లుగా..
ఇక అమెరికాలో అయితే చాలా మంది భారతీయులు ఉన్నారు. ఇటీవల తెలుగువారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన ఎనిమిదేళ్లలో అమెరికాలో తెలుగు వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగినట్లు అమెరికా సెన్సెస్ బ్యూరో తెలిపింది. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వివిధ కంపెనీల తరఫున హెచ్–1బీ వీసాలపై అమెరికా వెళ్తున్న తెలుగు వారి సంఖ్య పెరుగుతోంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అమెరికాలో చదివించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మధ్య తరగతి పేరెంట్స్ కూడా అప్పో సప్పో చేసి తమ పిల్లలను అమెరికా ఫ్లైట్ ఎక్కిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు కూడా అమెరికా వెళ్లడాన్ని అమీర్‌పేట్‌కు వెళ్లినట్లుగా భావిస్తున్నారు.
ఎనిమిదేళ్లలో నాలుగు రెట్లు..
అమెరికా సెన్సస్ బ్యూరో నివేదిక ప్రకారం.. 2016లో అమెరికాలో తెలుగు వారు 3.2 లక్షల మంది ఉన్నారు. 2024 నాటికి ఆ సంఖ్య 12.3 లక్షలకు చేరుకుంది. రాష్టాల వారీగా పరిశీలిస్తే కాలిపోర్నియాలో 2 లక్షలు, టెక్సాస్‌లో 1.5 లక్షలు, న్యూజెర్సీలో 1.1 లక్షలు, ఇల్లినాయిస్‌లో 83 వేలు, వర్జీనియాలో 78 వేలు, జార్జియాలో 52 వేల మంది తెలుగువారు ఉన్నారు. ఇందులో 10 వేల మంది హెచ్–1బీ వీసాపై వెళ్లగా ఏటా 60 నుంచి 70 వేల మంది విద్యార్థులు అమెరికా ఫ్లైట్ ఎక్కుతున్నారు.
75 శాతం అక్కడే..
ఇక అమెరికా వెళ్లినవారిలో 75 శాతం తెలుగు వారు అక్కడే స్థిరపడుతున్నారు. ఉన్నత చదువులు చదివి.. అక్కడి కంపెనీల్లోనే కొలువులు సాధిస్తున్నారు. అమెరికా కంపెనీలు కూడా భారతీయుల నియామకానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇవి తెలుగువారికి కలిసి వస్తోంది. దీంతో తెలుగువారు ఎక్కువగా డల్లాస్, బేఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్‌విల్లేలో స్థిరపడుతున్నారు. ఇక అమెరికాలో 350 భాషలు ఉండగా, తెలుగు భాష 11వ స్థానంలో ఉండడం అక్కడ తెలుగుదనం పెరుగుతుందనేందుకు మరో నిదర్శనం. ఇక హిందీ, గుజరాతీలు కూడా ఎక్కువగానే ఉన్నట్లు అమెరికా సెన్సెస్ బ్యూరో తెలిపింది.