Amaravati: అమరావతి.. మళ్లీ మొదలైంది

రాజధానిలో 9 భవ్య నగరాలు నిర్మించాలని ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదనలు తయారు చేసింది. 25 లక్షల జనాభాతో 15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టింది.

Written By: Dharma, Updated On : June 28, 2024 11:43 am

Amaravati

Follow us on

Amaravati: ఏపీలో ఐదేళ్ల కిందట వరకూ ఎవరి నోట విన్నా అమరావతి అనే మాట మార్మోగేది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి నిర్మాణం ప్రారంభమైంది. తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసి.. అమరావతి గా పేరు పెట్టారు. సచివాలయం తో పాటు పరిపాలన భవనాలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల నివాసాలకు కావాల్సిన భవనాల నిర్మాణాలను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. తాత్కాలిక సచివాలయం, హైకోర్టు భవనాలను నిర్మించింది. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్వీర్యం అయ్యింది. ఎక్కడి నిర్మాణాలను అక్కడ నిలిపివేసింది. దీంతో కోట్లాది రూపాయల విలువైన నిర్మాణ సామాగ్రి చెదలు పట్టి పనికి రాకుండా పోయింది. ఇప్పుడు మరోసారి టిడిపి అధికారంలోకి వచ్చింది. దీంతో అమరావతిలో సందడి ప్రారంభమైంది.

అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం 122 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. రాజధాని నగర పరిధిలోకి తుళ్లూరు మండలం లింగాయపాలెం, మొదరులంక పాలెం, ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, నేలపాడు, శాఖమూరు, అయినవోలు, మల్కాపురం, మందడం, తాళ్లాయపాలెం, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండరాజుపాలెం, పిచ్చుకల పాలెం, తాడేపల్లి మండలంలోని ఉండవెల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, డోలాస్ నగర్, మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణాయ పాలెం, నిడమర్రు, కొడగల్లు, నీరుకొండ, నవ్వులూరు, ఎర్ర పాలెం, బాపట్లపూడి గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ రాజధాని నగరంలో కలిపేస్తూ టిడిపి సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఆయా గ్రామాల్లో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

రాజధానిలో 9 భవ్య నగరాలు నిర్మించాలని ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదనలు తయారు చేసింది. 25 లక్షల జనాభాతో 15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టింది. నాలుగు ప్రాధాన్యత ప్రాజెక్టులు నిర్మించి.. తక్షణం ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి హెక్టారుకు 1082 నివాస గృహాలు నిర్మించేందుకు అనుమతులు ఉంటాయి. గరిష్టంగా జి ప్లస్ 15 వరకు భవనాలు ఎత్తు నిర్మించేందుకు అనుమతులు మంజూరు చేస్తారు. రెండు హై స్పీడ్ రైల్ క్యారిడార్లు ఉంటాయి. ఇవన్నీ అప్పట్లో టిడిపి ప్రభుత్వం తయారు చేసిన ప్రతిపాదనలే. గతంలో తయారు చేసిన ప్రతిపాదనలన్నీ ఇప్పుడు అమలులోకి వచ్చే విధంగా నూతన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అటు స్వదేశీ, ఇటు విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. మొత్తానికి అయితే అమరావతి రాజధాని కొత్త కళతో, సరికొత్త శోభతో కనిపిస్తోంది.