India Vs South Africa Final: అది 2007వ సంవత్సరం. వెస్టిండీస్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్, మునాఫ్ పటేల్.. వంటి దిగ్గజ ఆటగాళ్లు వెస్టిండీస్ వెళ్లారు. ప్రారంభ మ్యాచ్ బెర్ముడా దేశంతో ఆడారు. ఆ జట్టుపై భారీ స్కోరు సాధించారు. ఆ తర్వాత మిగతా మ్యాచ్లలో ఓడిపోయారు. ఫలితంగా భారత జట్టు గ్రూప్ దశలోనే స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. దీంతో టీమిండియా పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ తన కెప్టెన్సీ కోల్పోయాడు. రాహుల్ కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకోగానే బీసీసీఐ ధోనీకి జట్టు పగ్గాలు అప్పగించింది. ఆ తర్వాత ధోని సారథ్యంలో టీమిండియా 2007 టి20 వరల్డ్ కప్ సాధించింది. 2011లో వన్డే వరల్డ్ కప్ దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అందుకుంది..
2007లో టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఇప్పటివరకు టీమ్ ఇండియా మరోసారి ఆ ట్రోఫీని అందుకోలేదు. 2014లో ఫైనల్ వెళ్లినప్పటికీ శ్రీలంక చేతిలో భంగపాటుకు గురైంది. అయితే ఇప్పుడు మరోసారి టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్ గెలుచుకునే అవకాశం లభించింది. వెస్టిండీస్ – శ్రీలంక వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ వెళ్ళింది. దక్షిణాఫ్రికా జట్టుతో ట్రోఫీ కోసం తలపడనుంది.. రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా వరుస విజయాలు సాధించి ఫైనల్ దాకా వెళ్ళింది. ప్రస్తుతం టీమిండియా కు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కొనసాగుతున్నాడు. రాహుల్ ద్రావిడ్ కు ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ చివరి టోర్నీ. ఈ కప్ ముగిసిన తర్వాత రాహుల్ తన పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. తను కోచ్ గా వ్యవహరిస్తున్న చివరి t20 వరల్డ్ కప్ కావడంతో.. ఎలాగైనా విజయంతో ముగించాలని రాహుల్ ద్రావిడ్ భావిస్తున్నాడు.
అందువల్లే జట్టు ఆటగాళ్లలో పోరాట స్ఫూర్తిని నింపుతున్నాడు. రాహుల్ ద్రావిడ్ కోచింగ్ పర్యవేక్షణలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ.. ఐసీసీ మెగా టోర్నీలను సాధించలేకపోయింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 2022 t20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది.. ఇటీవల జరిగిన టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోనూ ఓటమిపాలైంది. ఇవన్నీ కూడా రాహుల్ ద్రావిడ్ కు తీవ్ర ఇబ్బందిని కలిగించాయి. ఎలాగైనా సరే ఈ పరాజయాలకు చెక్ పెట్టి.. తన చివరి t20 వరల్డ్ కప్ లో భారత జట్టును విజేతగా చూసి.. తాను సగర్భంగా భారత కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని రాహుల్ ద్రావిడ్ యోచిస్తున్నాడు.
2007 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ వేదిక భారత్ లీగ్ దశలోనే వెనుతిరిగిన నేపథ్యంలో.. పోయిన చోటే వెతుక్కోవాలని.. వెస్టిండీస్ వేదికగా 2024 t20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో.. అక్కడే ట్రోఫీని సగర్వంగా ఎత్తుకోవాలని ద్రావిడ్ భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ తో వెల్లడించాడు. “ఆట ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. సమష్టిగా ఆడితేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ ఫలితం కోసం ఎదురుచూస్తున్నాను. విజయం వల్లే సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఆ దృక్పథం దక్కాలంటే ఎంతటి కష్టమైనా పడక తప్పదని” ద్రావిడ్ వ్యాఖ్యానించాడు. ఒకవేళ టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా మీద గెలిస్తే.. రాహుల్ ద్రావిడ్ కు ఘనమైన వీడ్కోలు లభిస్తుంది.