T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ లో దాదాపు 10 సంవత్సరాల తర్వాత టీమిండియా ఫైనల్ చేరుకుంది. 2007లో తొలి సీజన్ లో ట్రోఫీ దక్కించుకున్న టీమిండియా.. ఆ తర్వాత మరోసారి t20 వరల్డ్ కప్ అందుకోలేకపోయింది. 2014లో ఫైనల్ చేరినప్పటికీ.. శ్రీలంక చేతిలో భంగపాటుకు గురైంది. ఈ నేపథ్యంలో శనివారం దక్షిణాఫ్రికా తో జరిగే ఫైనల్ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించి.. మరోసారి కప్ దక్కించుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. గత ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో, టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో టి20 వరల్డ్ కప్ గెలుచుకొని.. నాటి చేదు జ్ఞాపకాలకు చెక్ పెట్టాలని టీమిండియా యోచిస్తోంది. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికాపై విజయమో, వీర స్వర్గమో అనే రేంజ్ లో తలపడేందుకు సిద్ధమవుతోంది..
టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా సెమీఫైనల్ మ్యాచ్ వరకు వరుస విజయాలు సాధించింది. ఐర్లాండ్ నుంచి మొదలు పెడితే ఇంగ్లాండ్ వరకు అన్ని జట్లపై విజయ సాధించింది. కెనడాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.. లేకుంటే ఆ మ్యాచ్ కూడా గెలిచి ఉండేది. వరుస విజయాల నేపథ్యంలో టీమిండియా ఫైనల్ మ్యాచ్ లోనూ అదే స్థాయిలో సత్తా చాటుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.. అయితే దక్షిణాఫ్రికా తో జరిగే ఫైనల్ మ్యాచ్.. టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, చివరి మ్యాచ్ అవుతుందని తెలుస్తోంది. టీమిండియా గెలిచినా, ఓడిపోయినా వారిద్దరికీ ఇదే అంతర్జాతీయ టి20 మ్యాచ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. టి20 క్రికెట్లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు వారు ఈ పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్తారని జాతీయ మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మిగతా ఫార్మాట్లలో ఎన్ని రోజులు కొనసాగుతారన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే రోహిత్ వయసు దాదాపు 36 దాటింది. కోహ్లీ కూడా 35వ పడి లో పడ్డాడు. బ్యాటింగ్ పరంగా, ఆటపరంగా ఇద్దరికి వంకపెట్టే అవకాశం లేకపోయినప్పటికీ.. తమ కారణంగా ఇతర ఆటగాళ్లకు అవకాశాలు లభించకపోవడంతో.. వారు టి20 ఫార్మాట్ కు గుడ్ బై చెబుతారని తెలుస్తోంది.
ఇక ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ అంతగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఒక మ్యాచ్ లో ఐతే ఏకంగా గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో తొమ్మిది పరుగులు మాత్రమే చేసి.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ఇక రోహిత్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియాపై జరిగిన సూపర్ -8 మ్యాచ్లో 92 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో అర్థ సెంచరీ సాధించాడు. అయితే టి20 ఫార్మాట్ కు రోహిత్, విరాట్ ఇప్పుడిప్పుడే గుడ్ బై చెప్పరని.. ఒకేసారి ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు వెళ్లిపోతే అది జట్టుపై ప్రభావం చూపిస్తుందని.. క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.