New Zealand Vs Afghanistan: అప్ఘన్లూ ఏం ఆటరా బాబూ.. న్యూజిలాండ్ ను చిత్తుచిత్తుగా ఓడించి సంచలనం

వెస్టిండీస్ లోని గయానా వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. మైదానంపై ఉన్న స్వల్ప తేమ, పచ్చికను ఆసరాగా చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు రెచ్చిపోయారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 8, 2024 9:12 am

New Zealand Vs Afghanistan

Follow us on

New Zealand Vs Afghanistan: ఐసీసీ మెన్స్ టి20 ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 5 స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పదో స్థానంలో కొనసాగుతోంది. అనుభవం, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రకారం చూసుకుంటే న్యూజిలాండ్ జట్టుతో ఆఫ్ఘనిస్తాన్ కు పోలికే లేదు. కనీసం అంతర్జాతీయ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ కు ఒక్క ట్రోఫీ గెలిచిన చరిత్ర కూడా లేదు.. కానీ అలాంటి జట్టు టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించింది.. కివిస్ ఆటగాళ్లను చెత్త చెత్తగా పేవిలియన్ పంపించింది. ఏకంగా 84 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. క్రికెట్లో ఈ ఫార్మాట్లో అయినా ఆఫ్ఘనిస్తాన్ కు ఇదే అతిపెద్ద విజయం.

వెస్టిండీస్ లోని గయానా వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. మైదానంపై ఉన్న స్వల్ప తేమ, పచ్చికను ఆసరాగా చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా ఓపెనర్ గుర్బాజ్(80), ఇబ్రహీం జద్రాన్ (44) తొలి వికెట్ కు ఏకంగా 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఆఫ్గనిస్తాన్ పటిష్ట స్థితిలో నిలిచింది.. ఇబ్రహీం అవుట్ అయినప్పటికీ.. మరో ఎండ్ లో గుర్బాజ్ ఉండటంతో ఆఫ్ఘనిస్తాన్ స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. నబీ(0), రషీద్ ఖాన్ (6), కరీం జనత్(1), గుల్బాదిన్ (0), నజీబుల్లా(1).. విఫలమైనప్పటికీ అజ్మతుల్లా (22) ఆకట్టుకున్నాడు.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆఫ్గానిస్థాన్ 159 రన్స్ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్డ్, హెన్రీ తలా రెండు వికెట్లు తీశారు.

160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను కాచుకోలేక టాప్ ఆర్డర్ పేక మేడను తలపించింది. పరుగుల ఖాతాను ప్రారంభించక ముందే తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. ఆ తర్వాత క్రమం తప్పకుండా కీలక వికెట్లను నష్టపోయింది.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫిన్ అలెన్ (0) ఫారూఖీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..కాన్వే(8) ఆకట్టుకోలేకపోయాడు. విలియంసన్ (9), మిచెల్(5), ఫిలిప్స్ (18), చాప్ మన్(4), బ్రేస్ వెల్(0), శాంట్నర్(4), హెన్రీ (12), పెర్గూసన్(2) తీవ్రంగా నిరాశపరిచారు.. దీంతో న్యూజిలాండ్ జట్టు కనీసం పోటీ ఇవ్వకుండా, 15.2 ఓవర్లలో 75 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫారుఖీ , రషీద్ ఖాన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ నబీ రెండు వికెట్లు సాధించాడు.. వాస్తవానికి ఈ మైదానంపై ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకే అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోయిన న్యూజిలాండ్ కెప్టెన్ బౌలింగ్ వైపు నిర్ణయం తీసుకున్నాడు.. అది ఆ జట్టు అవకాశాలను తీవ్రంగా దెబ్బ కొట్టింది. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు అద్భుతంగా ఆడటంతో తొలి వికెట్ కు 100+ పరుగుల భాగస్వామ్యం నమోదయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో రెండో వికెట్ కు నమోదైన 18 పరుగులే అతిపెద్ద భాగస్వామ్యం అంటే.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టైటిల్ ఫేవరెట్లలో ఒక జట్టుగా పేరుపొందిన న్యూజిలాండ్.. ఇలా ఓడిపోవడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల ధాటికి అలెన్(0), బ్రేస్ వెల్(0) లాంటి ప్రమాదకరమైన ఆటగాళ్లు గోల్డెన్ డక్ గా వెను తిరగడం విశేషం.