Surya Kumar Yadav: గత ఏడాది టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అంతగా ఆడలేదు. అతడి బ్యాట్ నుంచి గొప్ప ఇన్నింగ్స్ రాలేదు. ప్రతి మ్యాచ్లో కూడా అతడు బ్యాటింగ్ చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. సారధిగా అతడు నూటికి నూరు శాతం మార్కులు సాధించినప్పటికీ.. ఆటగాడిగా మాత్రం విఫలమయ్యాడు. ఓ సందర్భంగా అతడిని t20 కెప్టెన్ గా పక్కకు పెట్టి.. ఆ స్థానాన్ని గిల్ తో భర్తీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, సూర్య కుమార్ యాదవ్ మీద మేనేజ్మెంట్ నమ్మకం ఉంచడంతో.. ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియాను అతడు ముందుండి నడిపిస్తున్నాడు.
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఇటీవల టీ20 సిరీస్లో సూర్య కుమార్ యాదవ్ అదరగొట్టాడు. భీకరమైన ఫామ్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో అదే ఫామ్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. టి20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలో జరిగిన మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ 84* పరుగులు చేశాడు. 49 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోర్లు, 8 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు.
సూర్య కుమార్ యాదవ్ కనుక నిలబడకపోయి ఉంటే టీమిండియా పరిస్థితి దారుణంగా ఉండేది. పేరు పొందిన ప్లేయర్లు మొత్తం విఫలం కావడంతో సూర్యకుమార్ ఒక్కడే జట్టు భారాన్ని మోసాడు. తద్వారా ముంబై మైదానంలో టీమిండియాకు 161 పరుగుల స్కోర్ అందించాడు. ఈ స్కోర్ తో టీమ్ ఇండియా గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోవడం మాత్రమే కాదు.. అమెరికాకు ఓటమిని కూడా పరిచయం చేసింది.
అమెరికా బౌలర్లు అద్భుతంగా భవనం చేయడంతో టీమిండియా ఒకానొక దశలో 77 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్ ఒంటరిగా పోరాడాడు. నాన్ స్ట్రైకర్ బ్యాటర్లకు అవకాశం ఇవ్వకుండా.. తను ఒక్కడే ఎదురుదాడికి పాల్పడ్డాడు. ఫలితంగా అమెరికా 132 పరుగుల వద్ద ఆగిపోవడంతో.. భారత్ 29 పరుగులు తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ తర్వాత సూర్య కుమార్ యాదవ్ కీలక విషయాలను వెల్లడించాడు.. ” ఈ స్థాయి ఇన్నింగ్స్ ఆడటం గొప్పగా ఉంది. అయితే నేను ఒత్తిడి అనుభవించాను. దానికంటే ముందు గౌతమ్ గంభీర్ నాకు అనేక సూచనలు చేశారు. చివరి వరకు నేను ఆడాలి. అప్పుడే జట్టు పరిస్థితి అంచనా వేసినట్టుగా ఉంటుంది.. పిచ్ ఎందుకనో డిఫరెంట్ గా ప్రవర్తించింది. అయితే కొన్ని సందర్భాలలో నాకు ఇబ్బంది ఎదురైనప్పటికీ.. పరుగులు ఎలా తీయాలో నాకు అర్థమైంది.. ఈ పిచ్ తయారీలో క్యూరేటర్ తన బెస్ట్ ఇచ్చారు. దీనికి తోడు రోల్ చేయడానికి.. నీళ్ళు చల్లడానికి సరైన వెలుతురు లేదు. ఈ పిచ్ కండిషన్ చూస్తే 150 పరుగులకు మించి చేయలేమని అర్థమైంది. 14 వ ఓవర్ తర్వాత గౌతమ్ గంభీర్ నాకు ఒక విషయం చెప్పారు. చివరి వరకు బ్యాటింగ్ చేయాలని సూచించారు. దానికి తగ్గట్టుగానే నన్ను నేను మార్చుకున్నాను. అందువల్లే ఈ స్థాయిలో ఆడగలిగానని” సూర్య కుమార్ యాదవ్ పేర్కొన్నాడు.
